ఇక యుద్ధాలన్నీ మానవ రహిత క్షేత్రాల్లోనే
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలన్నీ మానవరహిత యుద్ధ క్షేత్రాల్లోనే జరగనున్నాయని డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్, రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు పద్మశ్రీ అవినాష్‌చందర్ పేర్కొన్నారు. మానవ రహిత యుద్ధ క్షేత్రాల్లో మైక్రో ఎయిర్ వెహికల్స్ ముఖ్య భూమిక పోషించనున్నాయని చెప్పారు. మైక్రో ఎయిర్ వెహికల్స్ రూపకల్పన, అభివృద్ధి, ఆపరేషన్స్‌లో తాజా ఆవిష్కరణలపై జేఎన్టీయూహెచ్‌లో గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు(ఐసీఆర్‌ఎఎంఏవీ-13)కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైక్రో ఎయిర్ వెహికల్స్(మిస్సైల్స్) ద్వారా 5 వేల కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతున్నామని చెప్పారు.
జేఎన్టీయూహెచ్ కు ఆ సత్తా ఉంది: రక్షణ రంగంతోపాటు సమాజానికి మేలు చేకూర్చే మైక్రో ఎయిర్ వెహికల్స్‌ను రూపొందించగలిగే సత్తా జేఎన్టీయూహెచ్‌కు ఉందని వర్సిటీ మాజీ వీసీ, ఏఐసీటీఈ సదరన్ రీజియన్ చైర్మన్ డాక్టర్ కె.రాజగోపాల్ చెప్పారు. అద్భుతమైన అవకాశాలున్న ఈ రంగం వైపు దృష్టి సారించాలని విద్యార్థులను కోరారు. సముద్ర గర్భాల్లోకి కూడా మైక్రో ఎయిర్ వెహికల్స్‌ను పంపవచ్చని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రామేశ్వర్‌రావు తెలిపారు. సదస్సులో‘ సెన్సార్స్ అండ్ ఏవియానిక్స్’ అంశంపై డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ(పుణే) వీసీ డాక్టర్ ఆర్.ప్రహ్లాద ఉపన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్వీ రమణరావు, రెక్టార్ సాయిబాబారెడ్డి, సదస్సు కన్వీనర్ మాధవీలత, కో-కన్వీనర్లు సుధీర్ ప్రేమ్‌కుమార్, జీకే విశ్వనాథ్, యాదయ్య, డెరైక్టర్లు ముక్కంటి, రామకృష్ణప్రసాద్, ఆర్యశ్రీ, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.