జేఎన్‌టీయూ, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ అవినాష్ చందర్ అన్నారు. పరిశోధన ఫలాలు సామాన్యులకు అందించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. ఆ దిశగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. సోమవారం అనంతపురం జవహల్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ-ఎ) పరిపాలన భవనంలో ఐదో స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వీసీ లాల్‌కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవినాష్ చందర్ హాజరై ప్రసంగించారు. భారతదేశంలో మేథో సంపత్తికి కొదవ లేదని, ఎంతో మంది ఇంజనీర్ల కృషి ఫలితంగా నేడు ‘అగ్ని’ వంటి క్షిపణులను స్వయంగా తయారు చేసుకోగలిగామన్నారు.
ఇదే సమయంలో కొందరు వలసబాట పట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలోని మేథో సంపత్తిని సద్వినియోగం చేసుకుని దేశీయంగా ఆశించిన విజయాలు సాధించామన్నారు. ఇందుకు అనంతపురం జేఎన్‌టీయూకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలే నిదర్శనమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్.. సాంకేతిక పరిజ్ఞానానికి హబ్‌గా వెలుగొందిందన్నారు. అదే సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించాలన్నారు. ఇంజనీర్లు అవిశ్రాంతంగా చేసిన కృషి షలితంగా దేశీయంగా అగ్ని, చంద్రయాన్, మంగళయాన్, జీఎస్‌ఎల్‌వీ, వివిధ రకాల యుద్ధ యంత్రాల తయారీ, ఆధునిక పరిశోధనలు సాధ్యమయ్యాయన్నారు. వాటి ఫలితాలను నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ పొందుతున్నామన్నారు. ఈ ఫలితాలతో సాంకేతిక రంగంలో భారత దేశం ఒక శాస్త్ర లీడర్‌గా నిలుస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కాగా.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన 200 ఉత్తమ పరిశోధనా సంస్థలలో భారత దేశానికి చెందిన ఒక్కదానికి కూడా చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆందోళన చెందారు. దేశంలో విద్యను అభ్యసించిన ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులు ఇతర దేశాలకు వలసబాట పట్డడమే ప్రధాన కారణమన్నారు. ఇది ఎంతమాత్రం తగదని.. దేశీయంగా తమ ప్రతిభను చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలో భాగస్వాములు కావాలని భావి ఇంజినీర్లకు సూచించారు. భాతరదేశ సాంకేతిక విజ్ఞాన పరిశోధనా రంగంలో పంజాబ్ యూనివర్శిటీ తర్వాత అనంతపురం జేఎన్‌టీయూ దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలుస్తోందన్నారు. దేశంలో ఇంజినీరింగ్ విద్య అభ్యసించిన వారు డీఆర్‌డీఓలో కీలకంగా మారారన్నారు. అందుకు గతంలో అగ్ని ప్రయోగంలో ఏర్పడిన లోపాలను డిసెంబర్ 31వ తేదీ రాత్రికి రాత్రే బాలాసోర్ పరిశోధనా క్షేత్రాన్ని చేరుకుని క్షిపణి లోపాలను సరిదిద్దడమే నిదర్శనమన్నారు. విద్యాభ్యాసానికి దీటుగా పరిశోధనలకు జేఎన్‌టీయూ ప్రాధాన్యత ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయన్నారు.
పరిశోధనలో నాణ్యతా ప్రమాణాల పెంపు
పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశామని జేఎన్‌టీయూ వీసీ లాల్‌కిశోర్ అన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, నిధులను ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోందన్నారు. సాంకేతిక విద్యకు చుక్కానిలా వర్శిటీని తీర్చిదిద్దామన్నారు. వర్శిటీలో 14 బీటెక్, 69 బీఫార్మా, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మా స్పెషలైజేషన్ కోర్సులు, 5 ఎమ్మెస్సీ, 3 ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ(పీబీ) కోర్సులు నడుస్తున్నాయన్నారు. ఎంఎస్‌ఐటీ కోర్సును నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రారంభించామన్నారు. విదేశీ యూనివర్శిటీలతో అవగాహన ఒప్పందాలు, వీఎల్‌ఐసీ సిస్టమ్ డిజైన్, ఎంబేడెడ్ సిస్టమ్స్ లాంటి కొత్త ప్రోగ్రాంలను పరిచయం చేశామన్నారు. కలికిరిలో నూతనంగా వర్శిటీ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ సుదర్శన్‌రావ్, రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, డెరైక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
Published Tue, Dec 17 2013 6:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement