తీరానికి రాజయోగం
- క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు
- దేశంలోనే రెండోది
- గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతం ఎంపిక?
నాగాయలంక : బంగాళాఖాతం సరిహద్దు తీరప్రాంతమైన నాగాయలంక మండలానికి రాజయోగం పట్టనుందనే వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే క్షిపణి ప్రయోగ కేంద్ర మే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో దేశంలోనే రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని రూ. 1000 కోట్లతో నాగాయలంక సాగర తీరం గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అటవీశాఖ, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3వ తేదీన డీఆర్‌డీవో ఉన్నతాధికారులు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) జోసఫ్, వైల్డ్ లైఫ్ సీసీఎస్ శ్రీధర్ గుల్లలమోద-లైట్‌హౌస్ ప్రాంతాల్లో పర్యటించి నిశితంగా అధ్యయనం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో (గత ఏడాది చివరిలో) ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రి సలహాదారుడు పద్మశ్రీ అవినాష్ చందర్ ఈ అంశాన్ని ధ్రువీకరించారు.
నాగాయలంక తీరప్రాంతంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఆయన ప్రకటన చేసిన నెల రోజుల్లోనే డీఆర్‌డీవో, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించారు. దరిమిలా డీఆర్‌డీవోతోపాటు పలువురు రక్షణ రంగ నిపుణులు దేశంలోని ఇతర ప్రాంతాలు పరిశీలించిన మీదట నాగాయలంక తీరప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది.
గుల్లలమోద ప్రాంతంలో ఒక వైపు మాత్రమే భూమి ఉంది. తూర్పు-దక్షిణ భాగాల్లో బంగాళాఖాతం, పడమరవైపు కృష్ణానది ఉంటాయి. ఓడిశాలోని బాలాసోర్ వీలర్ ఐలాండ్ క్షిపణి ప్రయోగకేంద్రం మాదిరిగానే నాగాయలంకలోని గుల్లలమోద తీర భౌగోళిక స్వరూపం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చిన మీదట రక్షణ పరంగా అన్ని విధాలుగా అనుకూలమైనదిగా భావించారని తెలుస్తుంది.
మహర్దశ పడుతుందా?
ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ నాగాయలంక తీరంలో ఖాయమని భావిస్తుండటంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ మండలమే కాకుండా జిల్లా రూపురేఖలే మారిపోతాయని అంచనా వేస్తున్నారు. 40 ఎకరాల్లో అధికారులు, సిబ్బంది కోసం నిర్మించే ప్రత్యేక క్వార్టర్స్, 40కి.మీ పరిధిలో రహదారుల సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రత్యక్ష, పరోక్షంగా పాతికవేల మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు.