కందుకూరు, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సముద్రంపై నిఘాను కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఉన్న లైట్‌హౌస్‌లను కేంద్రాలుగా చేసుకొని రాడార్ వ్యవస్థ ద్వారా అత్యంత శక్తివంతమైన ససీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సముద్రంలో ప్రయాణించే భారీ షిప్‌ల మొదలు చిన్నచిన్న బోట్లపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. పూర్తిగా కోస్ట్‌గార్డ్ పర్యవేక్షణలో ఉండే ఈ రాడార్ నిఘా వ్యవస్థను శాటిలైట్‌తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. 2011 నవంబర్ 9వ తేదీ ముంబై దాడి దేశ చరిత్రలో మరిచిపోలేని విషాద ఘటనగా మిగిలిపోయింది. సముద్రం ద్వారా పడవలు వేసుకొని పాకిస్తాన్ నుంచి ముంబై చేరుకున్న ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా వందల మందిని పొట్టనపెట్టుకున్న దుర్ఘటనను దేశ ప్రజలు మరిచిపోలేరు. దీంతో మేల్కొన్న కేంద్ర నిఘా వర్గాలు సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించాయి.
రామాయపట్నం లైట్‌హౌస్‌పై...
జిల్లాలోని ఉలవపాడు మండలం సముద్ర తీర ప్రాంతమైన రామాయపట్నంలో ఉన్న లైట్‌హౌస్‌పై ఈ అత్యాధునిక రాడార్ వ్యవస్థను నెలకొల్పారు. మూడు నెలల క్రితం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినా..పది రోజుల నుంచి సముద్రంపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం ప్రారంభించారు. లైట్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. తీరం నుంచి సముద్ర ఉపరితలంపై దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సంచరించే ఓడలు, పడవల గమనాన్ని సీసీ కెమెరాలు రికార్డు చేస్తాయి. సముద్ర గర్భంలో సంచరించే జలాంతర్గాముల కదలికలను కూడా పసికట్టేంత సామర్థ్యం ఈ కెమెరాల సొంతం. రాష్ట్రంలో ఇలాంటి రాడార్ వ్యవస్థను మరో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో, మచిలీపట్నం, విశాఖపట్నంలో ఈ వ్యవస్థను నెలకొల్పారు. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా నిఘాను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు.
24 గంటలు విద్యుత్ సరఫరా....
రాడార్ వ్యవస్థకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అందుకోసం ఉలవపాడు సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌ను ఏర్పాటు చేసుకొని, రైల్వే లైన్‌కు ఏ విధంగా అయితే విద్యుత్ సరఫరా ఉండాలో అదే విధంగా ఉండేలా చూసుకున్నారు. అందుకోసం నెలకు విద్యుత్ శాఖకు * లక్ష వరకు బిల్లు రూపంలో చెల్లిస్తున్నారు. తొలుత ఈ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు దాదాపు *50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.
లైట్ హౌస్ నిర్మించి 30 ఏళ్లకు పైగా...
బ్రిటీష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన రామాయపట్నంలో అప్పట్లోనే చిన్నపాటి ఓడరేవు కూడా ఉండేది. అప్పుడు తాత్కాలికంగా ఉన్న లైట్‌హౌస్ స్థానంలో 30 ఏళ్ల క్రితం శాశ్వత లైట్‌హౌస్‌ను నిర్మించారు. విద్యుత్ సౌకర్యంతో పాటు సోలార్ సిస్టమ్ ద్వారా రీచార్జ్ అయి రాత్రి వేళల్లో సముద్రం వైపు లైట్లు తిరుగుతూనే ఉంటాయి. తీరం నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఈ లైట్లు సముద్రంలోకి కనబడతాయి.
సీసీ కెమెరాల ద్వారా పడవల రాకపోకల గుర్తింపు
Published Mon, Aug 12 2013 2:58 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement