light house
-
‘లైట్‌హౌస్’ ఎట్ స్లమ్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 1500 స్లమ్స్‌లో సరైన ఉపాధి అవకాశాల్లేక.. ఏం చేయాలో తెలియక..ఏం చేస్తే సుస్ధిర ఉపాధి సాధ్యమో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతీయువకులెందరో. హైస్కూల్, ఇంటర్ విద్యనుంచి డిగ్రీలు చేసిన వారిదీ అదే పరిస్థితి. సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేరు. అవసరమైన ట్రైనింగ్ అందదు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఇంట్లోని ఒక్కరి సంపాదనే ఇంటిల్లిపాదికీ ఆధారం...ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, కొద్దిరోజులపాటు ఫౌండేషన్ కోర్సు, అభ్యర్థుల అభీష్టానికనుగుణంగా, స్థిరపడాలనుకుంటున్న రంగంలో కెరీర్‌పరంగా ఎదిగేందుకు ఒక ఆసరా ఇచ్చే సమున్నత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. పుణే మునిసిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్(ఎల్‌సీఎఫ్) నగరంలోనూ ‘లైట్‌హౌస్’ కార్యక్రమాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీని సంప్రదించింది. అమలు ఇలా... ఉపాధి అవసరమైన స్లమ్స్‌లోని పేదపిల్లలకు ఉపకరించేలా వివిధ రంగాల్లో అవసరమైన నైపుణ్యశిక్షణ, ఉద్యోగం పొందాక ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలానూ తగిన గైడెన్స్ తదితరమైనవి ఇచ్చేందుకు తగిన భవనం కేటాయిస్తే.. పీపీపీ పద్ధతిలో ఎంఓయూ కుదుర్చుకొని తమ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అందుకు సుముఖంగా ఉన్న జీహెచ్ఎంసీ..అవసరమైన ప్రక్రియ త్వరలో పూర్తి చేయనుంది. అది పూర్తయితే తొలుత ప్రయోగాత్మకంగా చందానగర్‌లోని కమ్యూనిటీహాల్ భవనంలో ఎల్‌సీఎఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల నిర్వహణలో భాగంగా తొలుత ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన మార్గం చూపుతారు. నగరంలో ఏర్పాటుచేసే కేంద్రంలో 60 శాతం అమ్మాయిలకే అవకాశం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. బ్యూటీపార్లర్, టైలరింగ్, నర్సింగ్ వంటి సాంప్రదాయ రంగాలే కాక పలు రంగాల్లో శిక్షణ నివ్వనున్నట్లు సమాచారం. ఎక్కడైనా రాణించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ సైతం నేర్పిస్తారు. ప్లేస్మెంట్ కల్పించేందుకు పలు కార్పొరేట్ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉపాధి పొందాలనుకుంటున్న రంగానికి సంబంధించి తగిన శిక్షణ నిస్తారు.డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు. సృజనాత్మకతకు ప్రోత్సాహంతోపాటు సుస్థిర ఉపాధి పొందేందుకు ‘లైట్‌హౌస్’ ఒక దారి చూపగలదని భావిస్తున్నారు. అందుకు వివిధ సంస్థల సహకారం పొందుతారు. శిక్షణపూర్తయ్యే అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో తడబడకుండా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉద్యోగాలకు ఎంపికయ్యాక ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనడంతోపాటు ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకునేందుకు, ఇతరత్రా అంశాల్లో కౌన్సిలింగ్ ఇస్తారు. సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధిచెందేందుకు, కమ్యూనిటీ లీడర్లుగా ఎదిగేందుకూ లైట్‌హౌస్ కార్యక్రమాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే కేంద్రం ఫలితాన్ని బట్టి మిగతా సర్కిళ్లలోనూ ఏర్పాటు చేస్తారు. -
‘లైట్‌హౌస్ కీపర్స్’ స్టోరీ.. ఇది ఇప్పటికీ ఆసక్తికరమే
Flannan Isles Lighthouse Keepers Mystery Real Story: కొన్ని రక్కసి క్షణాలు.. కొందరి జీవితాలను ఇట్టే తలకిందులు చేస్తాయి. నామరూపాలు లేకుండా తలరాతలను మార్చేస్తాయి. ఆనవాళ్లను సైతం మాయం చేస్తాయి. చరిత్ర జాడల్లో మిస్టరీలుగా మిగుల్చుతాయి. అలాంటిదే ఈ ‘లైట్‌హౌస్ కీపర్స్’ స్టోరీ.ఊహకు అందని ప్రతీది అతీంద్రియ శక్తుల చర్యే అంటారు చాలా మంది. ఊహించగలిగినంత మేర ఇదే నిజమని వాదిస్తుంటారు ఇంకొంతమంది. ఈ కథలో ఇలాంటివారి అభిప్రాయలు ఎన్నో ఉన్నాయి కానీ.. నిర్ధారించే ఆధారాలే లేవు. అందుకే నేటికీ ఇది అత్యంత ఆసక్తికరమైన కథనమైంది. స్కాట్లాండ్కి పడమర తీరాల్లో.. మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని భయంకరమైన దీవులున్నాయి. వాటిని ఫ్లానెన్ఐజిల్స్ అంటారు. 18వ శతాబ్దంలో స్కాట్లాండ్కి సుమారు 379 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుటర్ హెబ్రిడ్స్లోని ఏడు ద్వీపాల(సెవెన్ హంటర్స్)లో గడ్డి అధికంగా మొలిచేది. ఆ గడ్డిలో ఏదో మ్యాజిక్ ఉందని, దాన్ని గొర్రెలు తింటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాయని.. కవల గొర్రె పిల్లలు పుడతాయని స్థానికులు నమ్మేవారు. అందుకే అక్కడి గొర్రెల కాపర్లు.. ఆ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా.. తమ గొర్రెలను పడవల్లో ఆ దీవులకు తీసుకెళ్లి.. రోజంతా మేయించి, సాయంత్రానికల్లా తిరుగుప్రయాణం అయ్యేవారు. ఏ కారణం చేతైనా రాత్రి అక్కడే ఉండాల్సి వస్తే మాత్రం.. వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలే ఎదురయ్యేవని, ఎవరో తరుముతున్నట్లు, ఎవరో గమనిస్తున్నట్లు ఉంటోందనేది అప్పటి అనుభవజ్ఞుల మాట. 1896లో సెవెన్ హంటర్స్‌లో ఒకటైన ఐలియన్ మోర్లో అత్యవసరంగా.. ఎందరు వద్దని వాదించినా వినకుండా 300 మీటర్లు ఎత్తు గల లైట్‌హౌస్ నిర్మాణం మొదలుపెట్టారు. 1899లో దీని నిర్మాణం పూర్తయి.. ఆ ఏడాది డిసెంబర్ కల్లా తొలిసారి వెలిగింది. ఈ లైట్ హౌస్‌కి కాపలాగా నలుగురు కీపర్స్ని నియమించారు. ఎల్లప్పుడూ అక్కడ ముగ్గురు కీపర్స్ ఉండేలా.. వారిలో ప్రతి ఒక్కరికీ 6 వారాలు వర్కింగ్ డేస్, 2 వారాలు సెలవులు ఉండేలా డ్యూటీ చార్ట్ సిద్ధమైంది. వండుకునేందుకు వంటగది, రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఏ అవాంతరాలు లేకుండా ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాదికి.. 1900 డిసెంబర్లో.. హెస్పెరస్ అనే బోట్ ఐలియన్మోర్ ద్వీపం వైపు లైట్ హౌస్‌కి బయలుదేరింది. అయితే వాతావరణ పరిస్థితుల అనుకూలించక బోట్ చాలా ఆలస్యంగా నడిచింది. సముద్రం మధ్యలో ఉండగానే ఆ బోట్ కెప్టెన్ జేమ్స్ హార్వేకి గానీ.. అతడి సిబ్బందికి గానీ లైట్ హౌస్ పైన లైట్ కనిపించలేదు. బోట్ ఐలాండ్‌కి చేరువ అవుతున్నకొద్ది.. లైట్ హౌస్ లైటే కాదు.. దాని మీద ఎగిరే స్కాట్లాండ్ జెండా కూడా కనిపించలేదు. దాంతో హారన్స్ మోగించి అక్కడ కీపర్స్ని అలర్ట్ చెయ్యాలనుకున్నారు. కావాలనే పలుమార్లు బోట్ హారన్స్ మోగించడం మొదలుపెట్టారు. ఎన్ని హారన్స్ కొట్టినా ఐలాండ్ నుంచి స్పందన రాలేదు. దాంతో హార్వే టీమ్.. హెచ్చరిక మాదిరి సిగ్నల్స్ ఇస్తూ.. గాల్లోక్కి కొన్ని తారాజువ్వలను ఎగరేశారు. అయినా అటు నుంచి నో రిప్లై. తీరా డిసెంబర్ 26 సాయంత్రానికి హెస్పెరస్ బోట్.. లైట్ హౌస్ దగ్గరకు చేరుకుంది. అక్కడంతా సాధారణంగానే ప్రశాంతమైన వాతావరణమే ఉంది. కానీ ఏదో తెలియని నిర్మానుష్య శ్మశాన నిశబ్దం అలముకుంది. మెయిన్ గేట్, మెయిన్ డోర్, లోపలి గదులు అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఒక్క కీపర్ కూడా కనిపించ లేదు. వంట గది మాత్రమే తెరుచుకునుంది. అందులోని పొయ్యి చూస్తే గత కొన్ని రోజులుగా దాన్ని వాడలేదని అర్థమవుతోంది. పైగా అక్కడున్న గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన ముగ్గురూ ఏమయ్యారో తెలియలేదు. దాంతో అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మాయమైన ముగ్గురిలో 20 ఏళ్ల అనుభవమున్న ప్రిన్సిపల్ కీపర్ జేమ్స్ డ్యుకాట్(43), అకేషనల్ కీపర్ డొనాల్డ్ మాకార్థర్ (40) సెకండ్ అసిస్టెంట్ కీపర్ థామస్ మార్షల్(28) ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరూ వివాహితులే. నేటికి 121 ఏళ్లు గడిచినా ఆ ముగ్గురూ ఏమయ్యారనేది తెలియలేదు. నాలుగో కీపర్ జోసఫ్ మోర్ సెలవులో ఉండటం వల్లే బాధితుల లిస్ట్‌లో అతడి పేరు చేరలేదు. అధికారులు, పోలీసులు ఏకమై వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. ఐలాండ్‌కి పడమర వైపు బోట్ లాండ్ అయ్యే చోటు డ్యామేజ్ అయ్యి ఉంది. మోరింగ్ రోప్స్ తెగిపోయి ఉన్నాయి. టాకిల్ బాక్స్ మిస్ అయ్యింది. ఐరన్ రెయిలింగ్స్ విరిగిపోయి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రొఫిలింగ్ బోయ్ సమీపంలోనే ఉంది. అయితే అది పక్కకు ఒరిగిన తీరుని గమనిస్తే సముద్రమే తన దారిని మార్చుకుందనిపించింది. ఎందుకంటే దాన్ని కదిలించడం మనుషుల తరం కాదు. ఈ పాయింట్స్ అన్నీ విచారణలో భాగంగా ఫైల్ అయ్యాయి. కానీ ఫలితం లేదు. ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఒక కోటు దొరికింది. అది తన సహోద్యోగి డొనాల్డ్ వాడే కోటేనని నాలుగో కీపర్ జోసఫ్ మోర్ గుర్తించాడు. అయితే డిసెంబర్ నెలలో కోటు తీసేసి ఉండటం అసాధ్యం. మరి డొనాల్డ్ దాన్ని ఎందుకు ధరించలేదనేది మరో చిక్కుప్రశ్నగా మారింది. డిసెంబర్ 12న లైట్‌హౌస్ లాగ్‌బుక్‌లో మార్షల్.. ‘నేను మునుపెన్నడు చూడని విధంగా గాలులు వీస్తున్నాయని, డ్యుకాట్ మౌనంగా ఉన్నాడు కానీ.. మాకార్థర్ ఏడుస్తున్నాడు. ఇంత అనుభవజ్ఞుడైన మాకార్థర్ బేలగా మారిపోయాడు’ అని రాశాడు. విచిత్రమేమిటంటే.. 12, 13, 14 తేదీల్లో ఎలాంటి నివేదికా లేదు కానీ.. డిసెంబర్ 15న ‘తుఫాను ముగిసింది, సముద్రం ప్రశాంతంగా ఉంది, గాడ్ ఈజ్ ఓవర్ ఆల్’ అని రాసి ఉంది. ఆ తర్వాత ఏమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ ముగ్గురూ మాయం కావడానికి కారణం అక్కడున్న అతీంద్రియశక్తులే అని కొందరు.. సముద్ర జీవుల పని అని మరికొందరు భావించారు. అయితే ముగ్గురిలో ఒకరికి పిచ్చి పటì ్ట మిగిలిన ఇద్దరినీ చంపి, సముద్రంలో పడేసి.. తనూ దూకేశాడంటూ ఓ కథ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. బహుశా ఇది విదేశీ గూఢాచారుల పని అయ్యుండొచ్చని, లేదంటే ఏలియన్స్ వచ్చి ఆ ముగ్గురినీ తీసుకుని వెళ్లి ఉంటారని వదంతులు వ్యాపించాయి. అయితే.. నార్తన్ లైట్స్‌కి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ కమిషన్ రాబర్ట్ ముయిర్‌హెడ్ రాసిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. ‘డిసెంబర్ 15 మధ్యాహ్నం ఆ ముగ్గురూ వెస్ట్ ల్యాండింగ్ సమీపంలోని మూరింగ్ రోప్స్ భద్రపరడానికి వెళ్లి ఉంటారని.. ఆ సమయంలో అనుకోకుండా పెద్ద కెరటం వచ్చి ముగ్గురినీ ఒకేసారి కొట్టుకునిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. 1950లో ఓ చరిత్రకారుడు మైక్ డాష్.. ఈ ఐలాండ్ సముద్రమట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి.. అంతకు మించిన ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసిపడి ఉంటాయనేందుకు.. పలు ఆధారాలు కనుగొన్నాడు. అదే జరిగితే మనుషులు కొట్టుకుపోవడం ఖాయమని భావించాడు. ఆ అంచనా ప్రకారం ఆ ముగ్గురూ మాయమయ్యారనేది అతడి వాదన. మొత్తానికి ఆ ముగ్గరూ ఏమయ్యారనేది మాత్రం ప్రపంచానికి తెలియకుండా ముగిసిన కథ. కానీ ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్, ఘటన జరిగిన ఏడాదికి అక్కడ డ్యూటీలో ఉన్న కీపర్స్‌కి.. అదృశ్యమైన వారి పేర్లు పిలుస్తూ ఎవరో కేకలు వేస్తున్న ధ్వనులు వినిపించాయట. అది నిజమా, కల్పితమా అనేది మరో మిస్టరీ. ∙సంహిత నిమ్మన -
లైట్హౌస్లు స్వాగతిస్తున్నాయ్..!
సాక్షి, అమరావతి: విద్యార్థులు, సామాన్య ప్రజల సందర్శనార్థం లైట్‌హౌస్‌ల తలుపులు తెరుచుకున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నలైట్ హౌస్‌ల సందర్శనకు కేంద్రం అనుమతించింది. కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్ కలిగిన లైట్‌హౌస్‌లను సైతం చూసే అవకాశాన్ని సామాన్యులకు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 లైట్‌హౌస్‌లను మనం సందర్శించొచ్చు. నేటి నుంచి 15వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు వీటిని ఎంచక్కా చూసి రావొచ్చు. 15వ తేదీ వరకు విద్యార్థులకు అనుమతినివ్వగా, సామాన్య ప్రజలకు మాత్రం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతించారు. పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, పదేళ్లు పైబడిన వారు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అత్యంత పురాతన లైట్‌హౌస్ ‘శాంతపల్లి’ భారీ నౌకల నుంచి చిన్న చిన్న బోట్ల వరకూ సముద్రంలో దారి చూపే దిక్సూచి లైట్‌హౌస్. ఎలక్ట్రానిక్ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా తీరప్రాంతంలో ఇప్పటికీ అవి సేవలందిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 185 లైట్‌హౌస్‌లుండగా.. రాష్ట్రంలో 16 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత పురాతన లైట్‌హౌస్ విజయనగరం జిల్లా శాంతపల్లిలో ఉంది. ఇక్కడి లైట్‌హౌస్‌ను 1840లో నిర్మించారు. తర్వాత 1853లో ఆర్మగన్ షోల్(మోనపాలెం), 1858లో మచిలీపట్నం, 1868లో పెంటకోట(తుని), 1860లో నిజాంపట్నం, 1874లో డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్(విశాఖ), 1877లో కళింగపట్నం, 1895లో శాంక్రిమెంటో(కరవాక.. తూర్పుగోదావరి), 1903లో భీమునిపట్నం, 1938లో కృష్ణపట్నం లైట్‌హౌస్‌లను నిర్మించారు. రాష్ట్రంలోని ఇక మిగిలిన లైట్హౌస్లన్నీ స్వాతంత్య్రానంతరం నిర్మించినవే. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఒక్కోలైట్ హౌస్ ఒక్కో విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం డాల్ఫిన్‌నోస్, శాంక్రిమెంటో, అంతర్వేది, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం లైట్హౌస్లు కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్ పూర్తిగా నావీ ఆధీనంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లైట్‌హౌస్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రం మెరైన్ ఎయిడ్ టూ నావిగేషన్–2021 చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం లైట్‌హౌస్‌ల చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ విలువలను కాపాడుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 13 లైట్‌హౌస్‌లుండగా, ఏపీలో డాల్ఫిన్‌నోస్ ఉంది. ప్రస్తుతం కోస్టల్ సర్వెలెన్స్తో పనిచేస్తున్న లైట్హౌస్లు 300 కి.మీ దూరంలో సముద్రంలోని కదలికలను కూడా గుర్తిస్తాయి. ఒకప్పుడు సముద్రంలో తిరిగే నౌకలు, బోట్లకు దారిచూపిన ఈ లైట్‌హౌస్‌లను.. ఇప్పుడు సముద్ర జలాల్లోకి చొచ్చుకొచ్చే విదేశీ నౌకలు, ఇతర అక్రమ కార్యకలాపాలను కూడా గుర్తించేంతగా టెక్నికల్‌గా తీర్చిదిద్దారు. ప్రజలకు తెలియజేయాలనే.. చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిషేధిత ప్రాంతాల సందర్శనకు సామాన్య ప్రజలకు అనుమతివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైట్‌హౌస్‌ల సందర్శనకు అవకాశం ఇచ్చింది. –అనురాగ్మణి, ఇన్చార్జి, డాల్ఫిన్స్‌నోస్ లైట్‌హౌస్ -
గ్యాస్ ‘ఫిల్లింగ్’.. కిల్లింగ్
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లతో తెరచాటున ‘రీ ఫిల్లింగ్’ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. ‘లైట్ హౌస్’ల పేరుతో గోప్యంగా అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారం జనవాసాల మధ్యే సాగడంతో జిల్లాలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా అధికారులు షరా ‘మామూలు’గానే తీసుకుంటున్నారని మంగళవారం నందిపేటలో జరిగిన సంఘటన నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లను కొనుగోలు చేసి దాంట్లో నుంచి చిన్న సిలిండర్లలో గ్యాస్‌ని నింపి విక్రయించేందుకు నిర్వాహకులు లైట్‌హౌస్‌ల పేరిట వ్యాపారం చేయాలి. ఈ వ్యాపారం కూడా జనవాసాల మధ్య చేయకూడదని అగ్నిమాపక శాఖ నిబంధనలున్నాయి. అయినా వాటిని తుంగలో తొక్కుతున్నారు. దర్జాగా జనావాసాల మధ్య, వ్యాపార సముదాయాల మధ్య బహిరంగ వ్యాపారం చేస్తున్నారు. అనుమతుల విషయంలో కూడా తమకెవరికీ సంబంధం లేదని పౌర సరఫరాలశాఖ అధికారులు అంటున్నారు. జీపీలు, మున్సిపాల్టీల వారే అనుమతులు ఇస్తారని చెప్తున్నారు. ఇంతకూ లైట్హౌస్లు ఎవరి పరిధిలోకి వస్తాయో అనేది కూడా స్పష్టత లేదు. అయితే తమకు సంబంధం లేదంటున్న సివిల్ సప్లయి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీలు చేస్తుండడం, గృహావసర సిలిండర్లతో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుండగా చాలా సిలిండర్లను పట్టుకుని కేసులు సైతం నమోదు చేయడం మాత్రం గమనించాల్సిన విషయమే. సమాచారం వస్తే తప్ప.. తరచుగా లైట్‌హౌస్‌లను తనిఖీ చేసిన సందర్భాలు ఒక్కటీ లేవు. దీంతో అధికారుల పనితీరు ఏంటో అద్దం పడుతోంది. ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు లేదు.. జిల్లాలో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు పేలి చాలా ప్రమాదాలు జరిగాయి. కేవలం చిన్న సిలిండర్లకు మరమ్మతులు చేస్తున్నామని చెప్పి సాహసం చేసి దర్జాగా దుకాణాల్లోనే గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారు. మంటలు చెలరేగితే వెంటనే ఆర్పేందుకు కావాల్సిన స్ప్రేలు, సౌకర్యాలు అందుబాటులో కూడా ఉండవు. దీంతో సిలిండర్లు లీకై లేదా పేలి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. లైట్‌హౌస్ దుకాణమే కాకుండా పక్కనున్న ఇతర వ్యాపారా సముదాయాలకు మంటలు వ్యాపించి భారీ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. నందిపేట మండలంలో మంగళవారం జరిగిన సలిండర్ పేలుళ్లలో కూడా ఇలాంటిదే జరిగింది. నాలుగు దుకాణాలు పూర్తిగా కాలిపోయి దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం వాటిళ్లింది. లైట్ హౌస్ జనాసాలు, వ్యాపార సముదాయాల మధ్య ఉండడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆర్నెళ్ల క్రితమే డిచ్పల్లిలోని ఓ లైట్‌హౌస్‌లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చే స్తుండగా సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో గ్యా స్ నింపుతున్న వ్యక్తితోపాటు మరో వ్యక్తి తీవ్ర గా యాలై చికిత్స పొందుతూ మర ణించారు. ఆర్నెళ్ల వ్యవధిలోనే రెండు పెద్ద సంఘటనలు జరిగినా అధికారుల్లో మాత్రం చల నం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. సంఘటనలు జరిగితే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం వరకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనుమతులు మా పరిధిలో లేదు లైట్‌హౌస్‌ల అనుమతులు సివిల్ సప్లయి శాఖ పరిధిలోకి రావు. గ్రామ పంచాయతీలు, ము న్సిపాల్టీల పరిధిలోకి వస్తాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుం డా, వాటిని రీ ఫిల్లింగ్ చేయకుండా చర్యలు తీ సు కునేందుకు లైట్‌హౌస్‌లపై తనిఖీలు చేస్తాం. –కృష్ణప్రసాద్, డీఎస్ఓ -
లంకంత సొంతిల్లు.. కట్టుకుంది ఇద్దరు!
‘‘మేడంటే మేడా కాదు... గూడంటే గూడు కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది..’’ అని అరవై ఆరేళ్ల వేన్ ఆడమ్స్, యాభై తొమ్మిదేళ్ల కేథరీన్ కింగ్ దంపతులు పాడుకుంటున్నారు. కెనడాలోని వాంకోవర్ ద్వీపం వద్ద రణ గొణధ్వనులకు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా ఈ దంపతులు కట్టుకున్న ఇల్లే మీకు ఫొటోల్లో కనిపిస్తున్నది. ఆశ్చర్యంగా ఉందా? ‘వావ్ ...’ అనే అంశాలు ఇంకా అనేకమున్నాయి ఇందులో. వాటిలోకి వెళ్లేముందు ఆడమ్స్, కేథరీన్‌ల గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇద్దరూ మంచి కళాకారులు. ఆడమ్స్ కార్వర్ (వడ్రంగి), కేథరీన్ బ్యాలే నర్తకి. 1992 నుంచి వీళ్లు ఈ ఇంట్లోనే ఉంటున్నారుగానీ... అప్పటికీ ఇప్పటికీ అస్సలు పోలికే లేదు. అప్పట్లో సరస్సుపై తేలియాడుతున్న చిన్న ఇల్లు ఉంటే.. ఇప్పుడది 12 ప్లాట్‌ఫార్మ్‌తో ఏ చిన్న విషయానికీ ఇతరులపై ఆధారపడని రీతిలో అభివృద్ధి చెందింది. క్రెడిట్ మొత్తం ఆ జంటదే సుమీ! ఏమేమున్నాయి వీళ్లింట్లో అనుకుంటున్నారా? ఓ లైట్ హౌస్, డ్యాన్స్ ఫ్లోర్, ఆర్ట్ గ్యాలరీ, గ్రీన్హౌస్. అంతేకాదు.. కరెంటు కోసం 14 సోలార్ ప్యానెళ్లు కూడా ఉన్నాయి. ఆకలైనప్పుడు సరస్సులో చేపలు పట్టుకోవడం.. పక్కనే ఉన్న అర ఎకరం తేలియాడే పొలంలో పండే కాయగూరలు, ఆకు కూరలతో వండుకోవడం. అంతే! కోళ్లు కూడా పెంచుకునేవారుగానీ... ఆ మధ్య జంతువుల బెడద ఎక్కువైందని మానేశారు. వేసవిలో సరస్సు పక్కనే ఉన్న జలపాతం నుంచి, చలికాలంలో కురిసే మంచు నుంచి నీళ్లు సేకరించి వాడుకుంటారట! తమ ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారిని ప్రతి ఏడాది వేసవి సమయంలో అతిథులుగా ఆహ్వానిస్తారు కూడా! ఇంతకీ వీళ్ల ఇంటిపేరు ఏమిటో చెప్పలేదు కదూ.. ‘ఫ్రీడమ్ కోవ్’! బాగుంది కదూ! నిజంగానే ఇది స్వేచ్ఛా గుడారం! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గడ్కరీ ఆకస్మిక త నిఖీ
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని లైట్ హౌస్‌ను 1977 జనవరి 19న నిర్మించారు. 150 అడుగుల ఎత్తు, పది అంతస్తులతో ముక్కోణపు ఆకారంలో దీనిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ లైట్ హౌస్ సందర్శనకు ప్రజలను అనుమతించారు. 1994లో సందర్శకుల అనుమతికి బ్రేక్ పడింది. ఈ లైట్ హౌస్‌లో 9 అంతస్తుల వరకు లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి మెరీనా తీరంలో కిలోమీటర్ల కొద్దీ తిలకించవచ్చు. అతి సుందరంగా చెన్నై నగరంలో కొంత భాగాన్ని కెమెరాల్లో బంధించేందుకు వీలుంది. మెరీనాతీరం అంతా చూసేందు కు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి లైట్ హౌస్ కు అనుమతి నిరాకరించడంతో సందర్శకుల్లో అసంతృప్తి రగి లింది. అనుమతి కల్పించాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. యూపీఏ హ యూంలో ఆ లైట్ హౌస్‌కు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుని, సుందరంగా తీర్చిదిద్దారు. సందర్శకులకు సమయాన్ని కేటాయించి కొన్ని అంతస్తుల వరకే అనుమతి కల్పించారు. అలాంటి లైట్ హౌస్‌లో తనిఖీలు, పరిశీలనకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చేయడం ఆ శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తనిఖీలు : ఢి ల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నితిన్ గడ్కరీ ఉదయాన్నే మెరీనా తీరానికి వెళ్లారు. అక్కడి నుంచి లైట్ హౌస్‌లో తనిఖీలు, పరిశీలనల్లో పడ్డారు. సమాచారం అందుకున్న ఆ శాఖ అధికారులు, ఆ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పరుగులు తీశారు. ఆ లైట్ హౌస్ జనవరి 19న ఏర్పాటు కావడం, మంగళవారానికి 38 సంవత్సరాలు కావడాన్ని పురస్కరించుకునే గడ్కారి పరిశీలనకు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. లైట్ హౌస్‌ను పరిశీలించడంతో పాటుగా, అక్కడ సందర్శకులకు కేటాయించిన సమయం, ఆ పరిసరాల్లో కల్పించిన సదుపాయాలు, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి జాలర్లతో గడ్కరీ మాట్లాడారు. అర గంటకు పైగా అక్కడే ఉన్న ఆయన అనంతరం ఎక్కడికి వెళ్లారో గోప్యంగా ఉంచడం గమనార్హం. -
తీరానికి రాజయోగం
క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు దేశంలోనే రెండోది గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతం ఎంపిక? నాగాయలంక : బంగాళాఖాతం సరిహద్దు తీరప్రాంతమైన నాగాయలంక మండలానికి రాజయోగం పట్టనుందనే వార్తలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే క్షిపణి ప్రయోగ కేంద్ర మే ఇందుకు కారణంగా తెలుస్తుంది. రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో దేశంలోనే రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని రూ. 1000 కోట్లతో నాగాయలంక సాగర తీరం గుల్లలమోద-లైట్‌హౌస్ మడ అటవీ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అటవీశాఖ, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 3వ తేదీన డీఆర్డీవో ఉన్నతాధికారులు, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) జోసఫ్, వైల్డ్ లైఫ్ సీసీఎస్ శ్రీధర్ గుల్లలమోద-లైట్‌హౌస్ ప్రాంతాల్లో పర్యటించి నిశితంగా అధ్యయనం చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో (గత ఏడాది చివరిలో) ముఖ్య అతిథిగా పాల్గొన్న అప్పటి కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రి సలహాదారుడు పద్మశ్రీ అవినాష్ చందర్ ఈ అంశాన్ని ధ్రువీకరించారు. నాగాయలంక తీరప్రాంతంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్‌ను ఏర్పాటుచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. ఆయన ప్రకటన చేసిన నెల రోజుల్లోనే డీఆర్డీవో, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ పర్యటించారు. దరిమిలా డీఆర్డీవోతోపాటు పలువురు రక్షణ రంగ నిపుణులు దేశంలోని ఇతర ప్రాంతాలు పరిశీలించిన మీదట నాగాయలంక తీరప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. గుల్లలమోద ప్రాంతంలో ఒక వైపు మాత్రమే భూమి ఉంది. తూర్పు-దక్షిణ భాగాల్లో బంగాళాఖాతం, పడమరవైపు కృష్ణానది ఉంటాయి. ఓడిశాలోని బాలాసోర్ వీలర్ ఐలాండ్ క్షిపణి ప్రయోగకేంద్రం మాదిరిగానే నాగాయలంకలోని గుల్లలమోద తీర భౌగోళిక స్వరూపం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చిన మీదట రక్షణ పరంగా అన్ని విధాలుగా అనుకూలమైనదిగా భావించారని తెలుస్తుంది. మహర్దశ పడుతుందా? ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మిస్సైల్ లాంచింగ్ సెంటర్ నాగాయలంక తీరంలో ఖాయమని భావిస్తుండటంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ మండలమే కాకుండా జిల్లా రూపురేఖలే మారిపోతాయని అంచనా వేస్తున్నారు. 40 ఎకరాల్లో అధికారులు, సిబ్బంది కోసం నిర్మించే ప్రత్యేక క్వార్టర్స్, 40కి.మీ పరిధిలో రహదారుల సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రత్యక్ష, పరోక్షంగా పాతికవేల మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రక్షణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
పై-లీన్ తో లైట్‌హౌస్ ఢీ!
గోపాల్పూర్: దేశవ్యాప్తంగా గుండెల్లో గుబులు పుట్టించిన పై-లీన్ ఆగ్రహాన్ని ఒడిశా గోపాల్పూర్ బీచ్‌లోని లైట్‌హౌస్ దీటుగా ఎదుర్కొంది! ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్రం, వందల మైళ్లు విస్తరించిన తుపాను గురించి క్షణక్షణం అధికారులకు, తద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసింది. తుపాను భయంతో గోపాల్పూర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం తెలిసిందే. ఈ లైట్‌హౌస్‌లోని కొద్దిపాటి సిబ్బంది మాత్రం విధుల్లో భాగంగా పై-లీన్‌తో ఢీకొన్నారు. సిబ్బందికి చెందిన రెండు కుటుంబాలు కూడా అక్కడే ఉండిపోయాయి. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ లైట్‌హౌస్.. తీర గస్తీ దళానికి, నౌకాదళానికి దిక్సూచి. ఇందులో వైర్లెస్వ్యవస్థ, వాతావరణ అంచనా పరికరాలు ఉన్నాయి. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జూనియర్ సివిల్ ఇంజనీరు జీకే ప్రమోద్ నేతృత్వంలో నలుగురు అధికారులు పై-లీన్‌ను క్షణక్షణం అంచనా వేస్తూ, సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోల్‌కతాలోని తమ కేంద్ర కార్యాలయానికి, ఢిల్లీలోని విపత్తు ప్రతిస్పందన కేంద్రానికి చేరవేశారు. తుపాను ధాటి కి లైట్‌హౌస్ స్వల్పంగా దెబ్బతింది. కాంపౌండ్‌లోని కొన్ని చెట్లు కూలాయి. కొన్ని షెడ్లు ఎగిరిపోయాయి. అయినా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. -
సన్మార్గం : విశ్వాసి మౌనం... నిశ్శబ్ద పునరుజ్జీవన ప్రక్రియ
శరీర రుగ్మతలపైన ఉన్నంత శ్రద్ధ ఆత్మీయ స్థితి పట్ల మనకు లేకపోతే అది నిజంగా ప్రమాద సూచిక. తానే వెలుగైన దేవుడు ‘మీరు లోకంలో వెలుగై ఉన్నారని విశ్వాసులతో అన్నాడు. కొండ మీద కారుచీకట్లో ఒంటరిగా నిలబడి కాంతులీనుతూ దూరంలోని నౌకలకు దిశా నిర్దేశం చేసే ‘లైట్ హౌస్’ది నిజమైన వెలుగు పరిచర్య. చీకటిని చీల్చి చెండాడే ఆ సమరంలో వెలుగు రవ్వంత కూడా శబ్దం చేయకపోవడం గమనించదగ్గ విషయం. చికాగోలో ఇటీవల చానెల్ ప్రకటించిన పదివేల డాలర్ల బహుమతికోసం వాళ్లు చెప్పిన పనల్లా చేయడానికి చాలా మంది పోటీపడగా, ఒక వ్యక్తిని విజేతగా ఎంపిక చేశారు. ఒక చెట్టు ఆకులు, కాయలు, బెరడు కూడా తినమంటే, అతను 18 గంటల్లో అవన్నీ తిని ఆ డబ్బు గెలుచుకున్నా. అయితే విపరీతమైన కడుపు నొప్పితో జబ్బు పాలై ప్రాణాపాయం తప్పించుకోవడానికి యాభై వేల డాలర్లు ఖర్చు చేసుకున్నాడు. మీ దేహాన్ని దేవుడే మీకిచ్చాడని, మీలోని పరిశుద్ధాత్మకు అది నిలయమని మీరెరుగరా? అని కోపంగా, బాధగా కూడా పౌలు ప్రశ్నించాడు (1 కొరి 6:19). విశృంఖల జీవన సరళికి అలవాటు పడ్డ కొరింథి ప్రాంతంలోని చర్చికి, విశ్వాసులకు ఆయన చేసిన హెచ్చరిక ఇది. దేవుడు తన రూపంలో, స్వహస్తాలతో రూపించి తన జీవాత్మను ఊదగా మనం జన్మించామని ఎన్నడూ మరువరాదు. సువిశాలమైన ఈ విశ్వానికి మకుటంగా, ఏలికగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఈ దేహం తుచ్ఛమైనది, మట్టిలో కలిసిపోయేది, పాప భోగేచ్ఛలకు నిలయమన్నది కొన్ని తత్వాల బోధన. నిజమే, కాని రోగనిర్థారణ చేస్తే, సమస్య దేహంలో లేదు, దేహాన్ని నియంత్రించే నియమావళిలోనేనని తెలుస్తుంది. దైవ నియమావళిలో నడిచే దేహాలను పొందిన తొలి మానవులు ఆదాము, హవ్వ దైవ వ్యతిరేక శక్తియైన సాతాను ప్రలోభంలో పడి అతని పాప నియమావళికి తమ దేహాల్ని వశం చేశారు. మానవాళినంతా శాపగ్రస్థుల్ని చేశారు. అయితే దేవుడే చొరవ తీసుకుని తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువలో చేసిన రక్షణ యాగం ద్వారా, దైవమానవాళితో తమ దేహాలను నియంత్రించుకునే వెసులుబాటు కల్పించాడు. కాబట్టి దేవుడెంత శాశ్వతమో రక్షణ యాగమూ అంతే శాశ్వతమైనది. అందుకే విశ్వాసి తనను తాను దేవునికి సజీవ యాగంగా అర్పించుకునే ప్రయత్నంలో, అతనిలో పాప నియమావళికి, దైవనియమావళికి మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మంచి చేయాలనుకున్నా చేయలేకపోవడం, వద్దనుకుంటూనే చెడు చేయడమనేది ఆ సందిగ్ధం ఫలితమే: (రోమా 7:17-25). రెండు పక్షాల్లో ఒక పక్షం ఓడిపోతే లేదా లొంగిపోతేనే సంఘర్షణ లేదా యుద్ధం ముగుస్తుంది. అయితే తనలో దైవ నియమావళియే గెలవాలన్న బలమైన కాంక్ష విశ్వాసికుంటే దేవుడు కూడా అతన్ని బలపర్చుతాడు. ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడంటే ఇంటిని అందంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుంటాం. మరి పరిశుద్ధాత్మ నివాసానికి యోగ్యమైనదిగా మన దేహాలను తీర్చిదిద్దడానికి మరింత శ్రద్ధ తీసుకోవాలి. వెంట్రుకలు తెల్లబడ్డా, చర్మం ముడతలు పడ్డా, మచ్చలు పడ్డా చికిత్సలకు, క్రీములకు బోలెడు డబ్బు, సమయం వ్యయం చేస్తాం. దేహం పై పై మెరుగులకే ఇంత హైరానా పడితే, మన ఆంతర్యపు ఆత్మీయ శుద్ధికోసం ప్రార్థన, వాక్య పఠనం, దీనత్వం వంటి పారలోకిక వ్యాయామాల పట్ల మరింత శ్రద్ధ చూపాలి. మన దేహాన్ని పాపాలకు నిలయం చేయడం ద్వారా దాని విలువను దిగజార్చే సాతాను కుట్రను విశ్వాసి ప్రతిక్షణం ప్రతిఘటించడం ద్వారానే దేవునికి మహిమ తెస్తాడు. శరీర రుగ్మతలపైన ఉన్నంత శ్రద్ధ ఆత్మీయ స్థితి పట్ల మనకు లేకపోతే అది నిజంగా ప్రమాద సూచిక. తానే వెలుగైన దేవుడు ‘మీరు లోకంలో వెలుగై ఉన్నారని విశ్వాసులతో అన్నాడు. కొండ మీద కారుచీకట్లో ఒంటరిగా నిలబడి కాంతులీనుతూ దూరంలోని నౌకలకు దిశా నిర్దేశం చేసే ‘లైట్ హౌస్’ది నిజమైన వెలుగు పరిచర్య. చీకటిని చీల్చి చెండాడే ఆ సమరంలో వెలుగు రవ్వంత కూడా శబ్దం చేయకపోవడం గొప్ప విషయం. అది నిశ్శబ్దంగా, అత్యంత సమర్థవంతంగా తన పని చేసుకుని పోతుంది. అందువల్ల వెలుగు నిత్యత్వానికే కాదు, నిశ్శబ్దానికి కూడా గుర్తే! ప్రసంగాలు, వాదనలు తర్కాలు శబ్దకాలుష్యానికి అతీతమైన నిశ్శబ్ద శాంత జీవనం విశ్వాసిది. నిశ్శబ్దంలోని ఈ శక్తి, చర్చిల పైకప్పులు ఎగిరిపోయేలా డప్పు వాద్యాలు, అరుపులు, కేకలతో చేసేదే ఆరాధనగా భావించే వారికి అర్థం కావాలి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
సీసీ కెమెరాల ద్వారా పడవల రాకపోకల గుర్తింపు
కందుకూరు, న్యూస్‌లైన్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సముద్రంపై నిఘాను కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఉన్న లైట్‌హౌస్‌లను కేంద్రాలుగా చేసుకొని రాడార్ వ్యవస్థ ద్వారా అత్యంత శక్తివంతమైన ససీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సముద్రంలో ప్రయాణించే భారీ షిప్‌ల మొదలు చిన్నచిన్న బోట్లపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. పూర్తిగా కోస్ట్‌గార్డ్ పర్యవేక్షణలో ఉండే ఈ రాడార్ నిఘా వ్యవస్థను శాటిలైట్‌తో అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. 2011 నవంబర్ 9వ తేదీ ముంబై దాడి దేశ చరిత్రలో మరిచిపోలేని విషాద ఘటనగా మిగిలిపోయింది. సముద్రం ద్వారా పడవలు వేసుకొని పాకిస్తాన్ నుంచి ముంబై చేరుకున్న ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా వందల మందిని పొట్టనపెట్టుకున్న దుర్ఘటనను దేశ ప్రజలు మరిచిపోలేరు. దీంతో మేల్కొన్న కేంద్ర నిఘా వర్గాలు సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించాయి. రామాయపట్నం లైట్‌హౌస్‌పై... జిల్లాలోని ఉలవపాడు మండలం సముద్ర తీర ప్రాంతమైన రామాయపట్నంలో ఉన్న లైట్‌హౌస్‌పై ఈ అత్యాధునిక రాడార్ వ్యవస్థను నెలకొల్పారు. మూడు నెలల క్రితం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినా..పది రోజుల నుంచి సముద్రంపై సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం ప్రారంభించారు. లైట్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ద్వారా కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. తీరం నుంచి సముద్ర ఉపరితలంపై దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర సంచరించే ఓడలు, పడవల గమనాన్ని సీసీ కెమెరాలు రికార్డు చేస్తాయి. సముద్ర గర్భంలో సంచరించే జలాంతర్గాముల కదలికలను కూడా పసికట్టేంత సామర్థ్యం ఈ కెమెరాల సొంతం. రాష్ట్రంలో ఇలాంటి రాడార్ వ్యవస్థను మరో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో, మచిలీపట్నం, విశాఖపట్నంలో ఈ వ్యవస్థను నెలకొల్పారు. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా నిఘాను ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. 24 గంటలు విద్యుత్ సరఫరా.... రాడార్ వ్యవస్థకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అందుకోసం ఉలవపాడు సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక విద్యుత్ ఫీడర్‌ను ఏర్పాటు చేసుకొని, రైల్వే లైన్‌కు ఏ విధంగా అయితే విద్యుత్ సరఫరా ఉండాలో అదే విధంగా ఉండేలా చూసుకున్నారు. అందుకోసం నెలకు విద్యుత్ శాఖకు * లక్ష వరకు బిల్లు రూపంలో చెల్లిస్తున్నారు. తొలుత ఈ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు దాదాపు *50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. లైట్ హౌస్ నిర్మించి 30 ఏళ్లకు పైగా... బ్రిటీష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన రామాయపట్నంలో అప్పట్లోనే చిన్నపాటి ఓడరేవు కూడా ఉండేది. అప్పుడు తాత్కాలికంగా ఉన్న లైట్‌హౌస్ స్థానంలో 30 ఏళ్ల క్రితం శాశ్వత లైట్‌హౌస్‌ను నిర్మించారు. విద్యుత్ సౌకర్యంతో పాటు సోలార్ సిస్టమ్ ద్వారా రీచార్జ్ అయి రాత్రి వేళల్లో సముద్రం వైపు లైట్లు తిరుగుతూనే ఉంటాయి. తీరం నుంచి దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఈ లైట్లు సముద్రంలోకి కనబడతాయి.