సాక్షి, అమరావతి: విద్యార్థులు, సామాన్య ప్రజల సందర్శనార్థం లైట్‌హౌస్‌ల తలుపులు తెరుచుకున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నలైట్ హౌస్‌ల సందర్శనకు కేంద్రం అనుమతించింది. కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్ కలిగిన లైట్‌హౌస్‌లను సైతం చూసే అవకాశాన్ని సామాన్యులకు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 లైట్‌హౌస్‌లను మనం సందర్శించొచ్చు. నేటి నుంచి 15వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు వీటిని ఎంచక్కా చూసి రావొచ్చు. 15వ తేదీ వరకు విద్యార్థులకు అనుమతినివ్వగా, సామాన్య ప్రజలకు మాత్రం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతించారు. పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, పదేళ్లు పైబడిన వారు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది.
అత్యంత పురాతన లైట్‌హౌస్ ‘శాంతపల్లి’
భారీ నౌకల నుంచి చిన్న చిన్న బోట్ల వరకూ సముద్రంలో దారి చూపే దిక్సూచి లైట్‌హౌస్. ఎలక్ట్రానిక్ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా తీరప్రాంతంలో ఇప్పటికీ అవి సేవలందిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 185 లైట్‌హౌస్‌లుండగా.. రాష్ట్రంలో 16 ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత పురాతన లైట్‌హౌస్ విజయనగరం జిల్లా శాంతపల్లిలో ఉంది. ఇక్కడి లైట్‌హౌస్‌ను 1840లో నిర్మించారు. తర్వాత 1853లో ఆర్మగన్ షోల్(మోనపాలెం), 1858లో మచిలీపట్నం, 1868లో పెంటకోట(తుని), 1860లో నిజాంపట్నం, 1874లో డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్(విశాఖ), 1877లో కళింగపట్నం, 1895లో శాంక్రిమెంటో(కరవాక.. తూర్పుగోదావరి), 1903లో భీమునిపట్నం, 1938లో కృష్ణపట్నం లైట్‌హౌస్‌లను నిర్మించారు. రాష్ట్రంలోని ఇక మిగిలిన లైట్‌హౌస్‌లన్నీ స్వాతంత్య్రానంతరం నిర్మించినవే.
ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత
ఒక్కోలైట్ హౌస్ ఒక్కో విశిష్టత, చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం డాల్ఫిన్‌నోస్, శాంక్రిమెంటో, అంతర్వేది, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం లైట్‌హౌస్‌లు కోస్టల్ సర్వెలెన్స్ రాడార్ సిస్టమ్‌తో పనిచేస్తున్నాయి. డాల్ఫిన్‌నోస్ లైట్‌హౌస్ పూర్తిగా నావీ ఆధీనంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న లైట్‌హౌస్‌లను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేంద్రం మెరైన్ ఎయిడ్ టూ నావిగేషన్–2021 చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం లైట్‌హౌస్‌ల చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ విలువలను కాపాడుతూ పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 13 లైట్‌హౌస్‌లుండగా, ఏపీలో డాల్ఫిన్‌నోస్ ఉంది. ప్రస్తుతం కోస్టల్ సర్వెలెన్స్‌తో పనిచేస్తున్న లైట్‌హౌస్‌లు 300 కి.మీ దూరంలో సముద్రంలోని కదలికలను కూడా గుర్తిస్తాయి. ఒకప్పుడు సముద్రంలో తిరిగే నౌకలు, బోట్లకు దారిచూపిన ఈ లైట్‌హౌస్‌లను.. ఇప్పుడు సముద్ర జలాల్లోకి చొచ్చుకొచ్చే విదేశీ నౌకలు, ఇతర అక్రమ కార్యకలాపాలను కూడా గుర్తించేంతగా టెక్నికల్‌గా తీర్చిదిద్దారు.
ప్రజలకు తెలియజేయాలనే..
చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిషేధిత ప్రాంతాల సందర్శనకు సామాన్య ప్రజలకు అనుమతివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైట్‌హౌస్‌ల సందర్శనకు అవకాశం ఇచ్చింది.
–అనురాగ్‌మణి, ఇన్‌చార్జి, డాల్ఫిన్స్‌నోస్ లైట్‌హౌస్
Comments
Please login to add a commentAdd a comment