
భూపాలపల్లి: ‘ఓ ఎస్సై, అతడి కుటుంబసభ్యులు మా పొలంలోని వెళ్లనివ్వకుండా దారిని తొలగించారు. పైగా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించా’లంటూ వృద్ధ దంపతులు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ అధికారులను వేడుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్‌రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమికి వెళ్లడానికి దారి ఉండగా, రెండున్నరేళ్లుగా కన్నాయిగూడెం ఎస్సై (ములుగు జిల్లా)గా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి సదరు మార్గాన్ని మూసివేశారని దంపతులు ఆరోపించారు. ‘దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, భూపాలపల్లి ఆర్డీవో రమాదేవి విచారణ చేపట్టి దారి మూసివేసిన విషయాన్ని నిర్ధారించారు. అయినా, ఎస్సై వెంకటేష్, అతని బంధువులు దారివ్వకపోగా, మాపై అక్రమ కేసులు బనాయించారు.
మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదు’ అని ఆ దంపతులు వాపోయారు. ఎస్సై బాధలు తట్టుకోలేకపోతున్నామని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని సులోచన, ప్రతాప్‌రెడ్డి కోరారు. కలెక్టర్ రాహుల్‌శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో రవి వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీనిచ్చారు.