Elderly suicide attempt
-
ఆత్మహత్యకు అనుమతించండి
భూపాలపల్లి: ‘ఓ ఎస్సై, అతడి కుటుంబసభ్యులు మా పొలంలోని వెళ్లనివ్వకుండా దారిని తొలగించారు. పైగా కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించా’లంటూ వృద్ధ దంపతులు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ భవనం ఎదుట ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ అధికారులను వేడుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్‌రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి వెళ్లడానికి దారి ఉండగా, రెండున్నరేళ్లుగా కన్నాయిగూడెం ఎస్సై (ములుగు జిల్లా)గా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి సదరు మార్గాన్ని మూసివేశారని దంపతులు ఆరోపించారు. ‘దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, భూపాలపల్లి ఆర్డీవో రమాదేవి విచారణ చేపట్టి దారి మూసివేసిన విషయాన్ని నిర్ధారించారు. అయినా, ఎస్సై వెంకటేష్, అతని బంధువులు దారివ్వకపోగా, మాపై అక్రమ కేసులు బనాయించారు. మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదు’ అని ఆ దంపతులు వాపోయారు. ఎస్సై బాధలు తట్టుకోలేకపోతున్నామని, ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని సులోచన, ప్రతాప్‌రెడ్డి కోరారు. కలెక్టర్ రాహుల్‌శర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో రవి వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీనిచ్చారు. -
కొడుకులకు భారం కాకూడదని..
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు.. వయోభారం మరోవైపు ఆ వృద్ధ దంపతులను మనస్తాపానికి గురిచేశాయి. పిల్లలకు తాము భారం కాకూడదనే ఉద్దేశంతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటకు చెందిన సింహరాజు మునీందర్ (70), సులోచన (65) దంపతులు. వీరి కుమారులు గోవర్ధన్, సంతోష్. వీరు తమ కుటుంబాలతో వేరుగా ఉంటున్నారు. పెద్దకుమారుడు గోవర్ధన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సంతోష్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం అంతంతమాత్రమే. తండ్రి మునీందర్ పనిచేస్తున్న కట్టె కోత మిల్లును కొంతకాలం కిందట యజమాని అమ్మేయడంతో ఆయన ఉపాధి కోల్పోయారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్నుంచి తమ కొడుకులకు భారం కాకూడదని మునీందర్ దంపతులు బాధపడుతుండే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత వృద్ధ దంపతులు గదిలో పడుకున్నారు. సోమవారం ఉదయం గోవర్ధన్.. తల్లిదండ్రులుండే ఇంటి వద్దకు వెళ్లగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. పరిశీలించగా పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. -
కూతురి హింస ... వృద్ధుల ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి.. చావుబతుకుల్లో భార్య - పురుగుల మందు తాగి.. కిటికీకి ఉరి వేసుకున్న భర్త హసన్‌పర్తి(వర్దన్నపేట): డబ్బుల కోసం కూతురు పెడుతున్న వేధింపులు భరించలేక సోమవారం ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన రత్నం సత్యనారాయణరెడ్డి (70), తిరుపతమ్మ(65) దంపతులు వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం పలివేల్పులలో స్థిరపడ్డారు. సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. కొంతకాలంగా తండ్రిని కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్‌లు డబ్బుల విషయంలో వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి దంపతులు సోమవారం పురుగుల మందు తాగారు.తొలుత తిరుపతమ్మ వాంతులు చేసుకుంది. తనకూ అలాగై బతికేస్తానేమోనని భావించిన సత్యనారాయణ రెడ్డి కిటికీకి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందు అతను సమీప బంధువు రమేశ్‌రెడ్డికి ఫోన్ చేసి ఉదయం 11.30 గంటలకు ఇంటికి రమ్మని, హైదరాబాద్ నుంచి తన కుమారుడు శ్రీధర్ కూడా వస్తున్నట్లు చెప్పాడు. మాటల్లో ఏదో తేడా కనిపించడంతో రమేశ్‌రెడ్డి దంపతులు హుటాహుటిన ఆనంద్‌నగర్‌కాలనీకి చేరుకున్నారు. దంపతులు బయట నుంచి తాళం వేసి.. తాళం చెవిని బాత్రూం వద్ద పెట్టారు. ఈ విషయాన్ని రమేశ్‌రెడ్డికి ముందుగానే ఫోన్లో చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చేసరికి తిరుపతమ్మ చావుబతుకుల మధ్య కనిపించింది. ఆమెను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దంపతులు కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, నగర పోలీస్ కమిషనర్, పోలీస్ ఇన్స్పెక్టర్లతో పాటు మరో నలుగురికి లేఖ రాసి పెట్టారు. తమ మరణానికి తమ కూతురు శ్రీదేవి, అల్లుడు శివకుమార్, కుమార్తె స్నేహితురాలు ఆర్.శ్రీదేవి, ఉపాధ్యాయురాలు వినీత కారణమని పేర్కొన్నారు. వీరితో పాటు పంచాయితీ పెద్దలుగా వ్యవహరించిన సదానందం, సమ్మయ్య కూడా కారకులని మృతుడి కుమారుడు శ్రీధర్ తెలిపాడు. ఈ మేరకు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.