మునీందర్, సులోచన
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు.. వయోభారం మరోవైపు ఆ వృద్ధ దంపతులను మనస్తాపానికి గురిచేశాయి. పిల్లలకు తాము భారం కాకూడదనే ఉద్దేశంతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం రఘురాములకోటకు చెందిన సింహరాజు మునీందర్ (70), సులోచన (65) దంపతులు. వీరి కుమారులు గోవర్ధన్, సంతోష్. వీరు తమ కుటుంబాలతో వేరుగా ఉంటున్నారు.
పెద్దకుమారుడు గోవర్ధన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సంతోష్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం అంతంతమాత్రమే. తండ్రి మునీందర్ పనిచేస్తున్న కట్టె కోత మిల్లును కొంతకాలం కిందట యజమాని అమ్మేయడంతో ఆయన ఉపాధి కోల్పోయారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పట్నుంచి తమ కొడుకులకు భారం కాకూడదని మునీందర్ దంపతులు బాధపడుతుండే వారని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత వృద్ధ దంపతులు గదిలో పడుకున్నారు. సోమవారం ఉదయం గోవర్ధన్.. తల్లిదండ్రులుండే ఇంటి వద్దకు వెళ్లగా ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. పరిశీలించగా పురుగులమందు తాగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment