పాసుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు | Passes will be cancelled if Anyone misusing,says CP Anjani Kumar | Sakshi
Sakshi News home page

పాసుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Published Mon, Apr 20 2020 9:10 AM | Last Updated on Mon, Apr 20 2020 9:21 AM

Passes will be cancelled if Anyone misusing,says CP Anjani Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తెలంగాణలో మే 7 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింపు నేపథ్యంలో పాసుల దుర్వినియోగంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ట్వీట్‌ చేశారు. పాసులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పాసుల రివ్యూ చేయడానికి ప్రత్యేకంగా ఓ పోలీస్‌ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఒకవేళ పాసులు దుర్వినియోగం అవుతున్నట్లు తేలితే వాటిని క్యాన్సిల్‌ చేస్తామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ విస్తృతం అవుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అంజనీకుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. (మే 7 వరకు ఇళ్లలోనే..!)

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ కొందరు ఉల్లంఘించి యధేచ్చగా బయట తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ పాసుల జారీలో  పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నారు. (తెలంగాణలో రోజూ సగటున 17 కేసులు)

పోలీసు వెబ్‌సైట్‌ నుంచి ఈ–పాస్‌ 

నగర పోలీసు విభాగ అధికారిక వెబ్‌సైట్‌ (www.hyderabadpolice.gov.in)కు ఈ–పాస్‌ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభమైంది. ఇకనుంచి ఎవరూ పోలీసు కమిషనరేట్, ఇతర కార్యాలయాకు రాకుండానే వీటిని పొందవచ్చు. అత్యవసర, కీలక, నిత్యావసర సర్వీసులు అందిస్తున్న వ్యక్తులు, వాహనాలు, కార్యాలయాలకు చెందినవారికి మాత్రమే  ఈ–పాస్‌లు జారీ చేస్తామని కొత్వాల్‌ అంజనీకుమార్‌  ప్రకటించారు. పోలీసు వెబ్‌సైట్‌లో ఉన్న అప్లై ఫర్‌ పాస్‌ అనే విభాగంలోకి ముందుగా ప్రవేశించాలి.

అక్కడ పాస్‌ కోరుతున్న వారి గుర్తింపు కార్డు, ఫొటో అప్‌లోడ్‌ చేసి, ఫోన్‌ నంబరు, ఇతర వివరాలు పొందుపరచాలి. వీటిని పరిశీలించిన తర్వాత స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు ఈ–పాస్‌ జారీ చేస్తూ పొందుపరిచిన ఫోన్‌ నంబర్‌కు సందేశం పంపుతారు. ఇందులో ఉన్న లింకు ఆధారంగా సదరు వ్యక్తులు ఈ–పాస్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, కలర్‌ ప్రింట్‌ ఔట్‌ తీసుకోవాలి.  క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులకు కూడా  ఈ–పాస్‌ పైన ఉండే క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేసే పరికరాలు అందిస్తున్నారు. ఈ–పాస్‌లను వీటితో స్కాన్‌ చేసిన వెంటనే పూర్తి వివరాలు వారికి తెలుస్తాయి. ఈ నేపథ్యంలోనే అప్‌లోడ్‌ చేసిన గుర్తింపు కార్డును తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ–పాస్‌లను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement