గడ్కరీ ఆకస్మిక త నిఖీ
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని లైట్ హౌస్‌ను 1977 జనవరి 19న నిర్మించారు. 150 అడుగుల ఎత్తు, పది అంతస్తులతో ముక్కోణపు ఆకారంలో దీనిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ లైట్ హౌస్ సందర్శనకు ప్రజలను అనుమతించారు. 1994లో సందర్శకుల అనుమతికి బ్రేక్ పడింది. ఈ లైట్ హౌస్‌లో 9 అంతస్తుల వరకు లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి మెరీనా తీరంలో కిలోమీటర్ల కొద్దీ తిలకించవచ్చు. అతి సుందరంగా చెన్నై నగరంలో కొంత భాగాన్ని కెమెరాల్లో బంధించేందుకు వీలుంది. మెరీనాతీరం అంతా చూసేందు కు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి లైట్ హౌస్ కు అనుమతి నిరాకరించడంతో సందర్శకుల్లో అసంతృప్తి రగి లింది.
అనుమతి కల్పించాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. యూపీఏ హ యూంలో ఆ లైట్ హౌస్‌కు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుని, సుందరంగా తీర్చిదిద్దారు. సందర్శకులకు సమయాన్ని కేటాయించి కొన్ని అంతస్తుల వరకే అనుమతి కల్పించారు. అలాంటి లైట్ హౌస్‌లో తనిఖీలు, పరిశీలనకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చేయడం ఆ శాఖ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. తనిఖీలు : ఢి ల్లీ నుంచి చెన్నైకు వచ్చిన నితిన్ గడ్కరీ ఉదయాన్నే మెరీనా తీరానికి వెళ్లారు. అక్కడి నుంచి లైట్ హౌస్‌లో తనిఖీలు, పరిశీలనల్లో పడ్డారు.
సమాచారం అందుకున్న ఆ శాఖ అధికారులు, ఆ శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పరుగులు తీశారు. ఆ లైట్ హౌస్ జనవరి 19న ఏర్పాటు కావడం, మంగళవారానికి 38 సంవత్సరాలు కావడాన్ని పురస్కరించుకునే గడ్కారి పరిశీలనకు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. లైట్ హౌస్‌ను పరిశీలించడంతో పాటుగా, అక్కడ సందర్శకులకు కేటాయించిన సమయం, ఆ పరిసరాల్లో కల్పించిన సదుపాయాలు, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి జాలర్లతో గడ్కరీ మాట్లాడారు. అర గంటకు పైగా అక్కడే ఉన్న ఆయన అనంతరం ఎక్కడికి వెళ్లారో గోప్యంగా ఉంచడం గమనార్హం.