పై-లీన్ తో లైట్‌హౌస్ ఢీ!
గోపాల్‌పూర్: దేశవ్యాప్తంగా గుండెల్లో గుబులు పుట్టించిన పై-లీన్ ఆగ్రహాన్ని ఒడిశా గోపాల్‌పూర్ బీచ్‌లోని లైట్‌హౌస్ దీటుగా ఎదుర్కొంది! ఉవ్వెత్తున ఎగసిపడిన సముద్రం, వందల మైళ్లు విస్తరించిన తుపాను గురించి క్షణక్షణం అధికారులకు, తద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసింది. తుపాను భయంతో గోపాల్‌పూర్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం తెలిసిందే. ఈ లైట్‌హౌస్‌లోని కొద్దిపాటి సిబ్బంది మాత్రం విధుల్లో భాగంగా పై-లీన్‌తో ఢీకొన్నారు. సిబ్బందికి చెందిన రెండు కుటుంబాలు కూడా అక్కడే ఉండిపోయాయి. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ లైట్‌హౌస్.. తీర గస్తీ దళానికి, నౌకాదళానికి దిక్సూచి. ఇందులో వైర్‌లెస్‌వ్యవస్థ, వాతావరణ అంచనా పరికరాలు ఉన్నాయి.
శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జూనియర్ సివిల్ ఇంజనీరు జీకే ప్రమోద్ నేతృత్వంలో నలుగురు అధికారులు పై-లీన్‌ను క్షణక్షణం అంచనా వేస్తూ, సమాచారాన్ని ఎప్పటికప్పుడు కోల్‌కతాలోని తమ కేంద్ర కార్యాలయానికి, ఢిల్లీలోని విపత్తు ప్రతిస్పందన కేంద్రానికి చేరవేశారు. తుపాను ధాటి కి లైట్‌హౌస్ స్వల్పంగా దెబ్బతింది. కాంపౌండ్‌లోని కొన్ని చెట్లు కూలాయి. కొన్ని షెడ్లు ఎగిరిపోయాయి. అయినా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు.