లంకంత సొంతిల్లు.. కట్టుకుంది ఇద్దరు!
‘‘మేడంటే మేడా కాదు... గూడంటే గూడు కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది..’’ అని అరవై ఆరేళ్ల వేన్ ఆడమ్స్, యాభై తొమ్మిదేళ్ల కేథరీన్ కింగ్ దంపతులు పాడుకుంటున్నారు. కెనడాలోని వాంకోవర్ ద్వీపం వద్ద రణ గొణధ్వనులకు దూరంగా.. ప్రకృతికి దగ్గరగా ఈ దంపతులు కట్టుకున్న ఇల్లే మీకు ఫొటోల్లో కనిపిస్తున్నది. ఆశ్చర్యంగా ఉందా? ‘వావ్ ...’ అనే అంశాలు ఇంకా అనేకమున్నాయి ఇందులో. వాటిలోకి వెళ్లేముందు ఆడమ్స్, కేథరీన్‌ల గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇద్దరూ మంచి కళాకారులు. ఆడమ్స్ కార్వర్ (వడ్రంగి), కేథరీన్ బ్యాలే నర్తకి. 1992 నుంచి వీళ్లు ఈ ఇంట్లోనే ఉంటున్నారుగానీ... అప్పటికీ ఇప్పటికీ అస్సలు పోలికే లేదు.
అప్పట్లో సరస్సుపై తేలియాడుతున్న చిన్న ఇల్లు ఉంటే.. ఇప్పుడది 12 ప్లాట్‌ఫార్మ్‌తో ఏ చిన్న విషయానికీ ఇతరులపై ఆధారపడని రీతిలో అభివృద్ధి చెందింది. క్రెడిట్ మొత్తం ఆ జంటదే సుమీ! ఏమేమున్నాయి వీళ్లింట్లో అనుకుంటున్నారా? ఓ లైట్ హౌస్, డ్యాన్స్ ఫ్లోర్, ఆర్ట్ గ్యాలరీ, గ్రీన్‌హౌస్. అంతేకాదు.. కరెంటు కోసం 14 సోలార్ ప్యానెళ్లు కూడా ఉన్నాయి. ఆకలైనప్పుడు సరస్సులో చేపలు పట్టుకోవడం.. పక్కనే ఉన్న అర ఎకరం తేలియాడే పొలంలో పండే కాయగూరలు, ఆకు కూరలతో వండుకోవడం. అంతే! కోళ్లు కూడా పెంచుకునేవారుగానీ... ఆ మధ్య జంతువుల బెడద ఎక్కువైందని మానేశారు. వేసవిలో సరస్సు పక్కనే ఉన్న జలపాతం నుంచి, చలికాలంలో కురిసే మంచు నుంచి నీళ్లు సేకరించి వాడుకుంటారట! తమ ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారిని ప్రతి ఏడాది వేసవి సమయంలో అతిథులుగా ఆహ్వానిస్తారు కూడా! ఇంతకీ వీళ్ల ఇంటిపేరు ఏమిటో చెప్పలేదు కదూ.. ‘ఫ్రీడమ్ కోవ్’! బాగుంది కదూ! నిజంగానే ఇది స్వేచ్ఛా గుడారం!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్