సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 1500 స్లమ్స్‌లో సరైన ఉపాధి అవకాశాల్లేక.. ఏం చేయాలో తెలియక..ఏం చేస్తే సుస్ధిర ఉపాధి సాధ్యమో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతీయువకులెందరో. హైస్కూల్, ఇంటర్ విద్యనుంచి డిగ్రీలు చేసిన వారిదీ అదే పరిస్థితి. సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేరు. అవసరమైన ట్రైనింగ్ అందదు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే.
ఇంట్లోని ఒక్కరి సంపాదనే ఇంటిల్లిపాదికీ ఆధారం...ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, కొద్దిరోజులపాటు ఫౌండేషన్ కోర్సు, అభ్యర్థుల అభీష్టానికనుగుణంగా, స్థిరపడాలనుకుంటున్న రంగంలో కెరీర్‌పరంగా ఎదిగేందుకు ఒక ఆసరా ఇచ్చే సమున్నత కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. పుణే మునిసిపల్ కార్పొరేషన్‌లో ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్(ఎల్‌సీఎఫ్) నగరంలోనూ ‘లైట్‌హౌస్’ కార్యక్రమాలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీని సంప్రదించింది.
అమలు ఇలా...
ఉపాధి అవసరమైన స్లమ్స్‌లోని పేదపిల్లలకు ఉపకరించేలా వివిధ రంగాల్లో అవసరమైన నైపుణ్యశిక్షణ, ఉద్యోగం పొందాక ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలానూ తగిన గైడెన్స్ తదితరమైనవి ఇచ్చేందుకు తగిన భవనం కేటాయిస్తే.. పీపీపీ పద్ధతిలో ఎంఓయూ కుదుర్చుకొని తమ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అందుకు సుముఖంగా ఉన్న జీహెచ్‌ఎంసీ..అవసరమైన ప్రక్రియ త్వరలో పూర్తి చేయనుంది. అది పూర్తయితే తొలుత ప్రయోగాత్మకంగా చందానగర్‌లోని కమ్యూనిటీహాల్ భవనంలో ఎల్‌సీఎఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కార్యక్రమాల నిర్వహణలో భాగంగా తొలుత ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన మార్గం చూపుతారు. నగరంలో ఏర్పాటుచేసే కేంద్రంలో 60 శాతం అమ్మాయిలకే అవకాశం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. బ్యూటీపార్లర్, టైలరింగ్, నర్సింగ్ వంటి సాంప్రదాయ రంగాలే కాక పలు రంగాల్లో శిక్షణ నివ్వనున్నట్లు సమాచారం.
ఎక్కడైనా రాణించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ సైతం నేర్పిస్తారు. ప్లేస్‌మెంట్ కల్పించేందుకు పలు కార్పొరేట్ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఉపాధి పొందాలనుకుంటున్న రంగానికి సంబంధించి తగిన శిక్షణ నిస్తారు.డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు.
సృజనాత్మకతకు ప్రోత్సాహంతోపాటు సుస్థిర ఉపాధి పొందేందుకు ‘లైట్‌హౌస్’ ఒక దారి చూపగలదని భావిస్తున్నారు. అందుకు వివిధ సంస్థల సహకారం పొందుతారు. శిక్షణపూర్తయ్యే అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో తడబడకుండా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఉద్యోగాలకు ఎంపికయ్యాక ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనడంతోపాటు ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకునేందుకు, ఇతరత్రా అంశాల్లో కౌన్సిలింగ్ ఇస్తారు. సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధిచెందేందుకు, కమ్యూనిటీ లీడర్లుగా ఎదిగేందుకూ లైట్‌హౌస్ కార్యక్రమాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే కేంద్రం ఫలితాన్ని బట్టి మిగతా సర్కిళ్లలోనూ ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment