Slums
-
‘లైట్‌హౌస్’ ఎట్ స్లమ్స్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోని దాదాపు 1500 స్లమ్స్‌లో సరైన ఉపాధి అవకాశాల్లేక.. ఏం చేయాలో తెలియక..ఏం చేస్తే సుస్ధిర ఉపాధి సాధ్యమో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతీయువకులెందరో. హైస్కూల్, ఇంటర్ విద్యనుంచి డిగ్రీలు చేసిన వారిదీ అదే పరిస్థితి. సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేరు. అవసరమైన ట్రైనింగ్ అందదు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఇంట్లోని ఒక్కరి సంపాదనే ఇంటిల్లిపాదికీ ఆధారం...ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, కొద్దిరోజులపాటు ఫౌండేషన్ కోర్సు, అభ్యర్థుల అభీష్టానికనుగుణంగా, స్థిరపడాలనుకుంటున్న రంగంలో కెరీర్‌పరంగా ఎదిగేందుకు ఒక ఆసరా ఇచ్చే సమున్నత కార్యక్రమానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. పుణే మునిసిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న లైట్‌హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్(ఎల్‌సీఎఫ్) నగరంలోనూ ‘లైట్‌హౌస్’ కార్యక్రమాలు నిర్వహించేందుకు జీహెచ్ఎంసీని సంప్రదించింది. అమలు ఇలా... ఉపాధి అవసరమైన స్లమ్స్‌లోని పేదపిల్లలకు ఉపకరించేలా వివిధ రంగాల్లో అవసరమైన నైపుణ్యశిక్షణ, ఉద్యోగం పొందాక ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలానూ తగిన గైడెన్స్ తదితరమైనవి ఇచ్చేందుకు తగిన భవనం కేటాయిస్తే.. పీపీపీ పద్ధతిలో ఎంఓయూ కుదుర్చుకొని తమ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. అందుకు సుముఖంగా ఉన్న జీహెచ్ఎంసీ..అవసరమైన ప్రక్రియ త్వరలో పూర్తి చేయనుంది. అది పూర్తయితే తొలుత ప్రయోగాత్మకంగా చందానగర్‌లోని కమ్యూనిటీహాల్ భవనంలో ఎల్‌సీఎఫ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్యక్రమాల నిర్వహణలో భాగంగా తొలుత ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. నచ్చిన రంగంలో రాణించేందుకు తగిన మార్గం చూపుతారు. నగరంలో ఏర్పాటుచేసే కేంద్రంలో 60 శాతం అమ్మాయిలకే అవకాశం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. బ్యూటీపార్లర్, టైలరింగ్, నర్సింగ్ వంటి సాంప్రదాయ రంగాలే కాక పలు రంగాల్లో శిక్షణ నివ్వనున్నట్లు సమాచారం. ఎక్కడైనా రాణించేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ సైతం నేర్పిస్తారు. ప్లేస్మెంట్ కల్పించేందుకు పలు కార్పొరేట్ సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉపాధి పొందాలనుకుంటున్న రంగానికి సంబంధించి తగిన శిక్షణ నిస్తారు.డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తారు. సృజనాత్మకతకు ప్రోత్సాహంతోపాటు సుస్థిర ఉపాధి పొందేందుకు ‘లైట్‌హౌస్’ ఒక దారి చూపగలదని భావిస్తున్నారు. అందుకు వివిధ సంస్థల సహకారం పొందుతారు. శిక్షణపూర్తయ్యే అభ్యర్థులు ఇంటర్వ్యూల్లో తడబడకుండా మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉద్యోగాలకు ఎంపికయ్యాక ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొనడంతోపాటు ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకునేందుకు, ఇతరత్రా అంశాల్లో కౌన్సిలింగ్ ఇస్తారు. సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధిచెందేందుకు, కమ్యూనిటీ లీడర్లుగా ఎదిగేందుకూ లైట్‌హౌస్ కార్యక్రమాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే కేంద్రం ఫలితాన్ని బట్టి మిగతా సర్కిళ్లలోనూ ఏర్పాటు చేస్తారు. -
మురికివాడల్లోనే 57 శాతం కరోనా
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్యల రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబైలో 57 శాతం మురికివాడల్లో నివసించే ప్రజలు కరోనా బారినపడినట్లు సెరో సర్వే తెలిపింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఎఫ్ఆర్), నీతి ఆయోగ్‌లతో కలిసి చేపట్టిన సెరోలాజికల్ సర్వే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పురుషుల కంటే మహిళలు అధికంగా కరోనా మహమ్మారి బారినపడినట్లు తెలిపింది. ఈ సర్వేలో 8,870 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 6936 మందిలో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఇక ఈ నమూనాలను ముంబైలోని మూడు సాధారణ వార్డులు దాహిసర్, చెంబూర్, మాతుంగాలో సేకరిచినట్లు తెలిపారు. వైరస్ సోకి మృతి చెందినవారి శాతం తక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం బీఎంసీ సమర్థవంతమైన కరోనా నివారణ చర్యలు తీసుకుందని పేర్కొంది. ముంబైలోని మురికివాడల్లో కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి అధిక జనసాంద్రత కలిగి ఉండడం, అదే విధంగా పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేకపోవడం కారణమని సెరో సర్వే వెల్లడించింది. ఈ సర్వేను జూలై 12 నుంచి 14 వరకు నిర్వహించినట్లు తెలిపారు. -
స్లమ్స్‌లో వణుకు... ఇక్కడా ఇరుకు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహా నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో ఉంది. ఆసియాలోని అతిపెద్ద స్లమ్స్‌లో ఒకటైన ధారవి స్లమ్‌లో దాదాపు వంద పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో దాదాపు 10 మంది మరణించారు. ఈ నేపథ్యంలో స్లమ్ అంటేనే ప్రజల్లో వణుకు పుడుతోంది. కారణం ఇరుకు ఇళ్లు.. ఎక్కువ జనాభా.. ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. పెద్ద కాలనీల్లో కంటే స్లమ్స్‌లో పాజిటివ్ కేసులుంటే వ్యాపించే తీవ్రత అధికంగా ఉండడమే అందుకు కారణం. ధారవితో పోల్చగల స్లమ్ ఏదీ నగరంలో లేనప్పటికీ.. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండటం వల్ల భయాందోళనలు నెలకొన్నాయి. (కరోనా : వారికి సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేం) ఈ కేసులే అత్యధికం.. గ్రేటర్ నగరంలో వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసుల్లో మర్కజ్‌వే అధికం. మర్కజ్‌తో సంబంధాలున్న వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, పాతబస్తీలో ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఇప్పటికే అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 160కి పైగా ఉండటంతో అక్కడి స్లమ్స్‌లోని ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వైరస్ పొంచి ఉందోనని భీతిల్లుతున్నారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, మలక్‌పేట, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ఇలాంటి పరిస్థితులున్నాయి. పాతబస్తీలోని స్లమ్స్, ఇరుకు పరిస్థితులు, ఒకే ఇంట్లో అధిక జనాభా ఉండటం వంటి కారణాల వల్లే ఒకే ఇంట్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని స్లమ్స్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లేని పక్షంలో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్లో అధిక జనాభా కలిగిన స్లమ్స్‌లో హఫీజ్ బాబానగర్, వినాయక్ నగర్, ఎన్టీఆర్నగర్, అడ్డగుట్ట, సంజయ్‌గాంధీనగర్, ప్రేమ్‌నగర్, మహమూద్‌నగర్, ఎల్లమ్మబండ, ఎంఎస్ మక్తా, వట్టేపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి. యూసీడీ సేవలు.. జీహెచ్ఎంసీలోని యూసీడీ విభాగం స్లమ్స్‌లోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్నప్పటికీ, ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసులు అన్ని ప్రాంతాల్లో ఉండటంతో అన్ని చోట్లా నివారణపై దృష్టి సారించడంతో పాటు స్లమ్స్‌లోని పేదలు, నిరాశ్రయులకు వసతి, ఆహారం తదితరాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జె. శంకరయ్య తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో 120 షెల్టర్లలో 4,565 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించామని, వారందరికీ రెండుపూటలా భోజనంతోపాటు శానిటైజర్లు, సబ్బులతో పాటు మాస్కులు అందజేస్తూ వైద్యపరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని ఏఎంఓహెచ్‌లతోపాటు బస్తీ దవాఖానాలకు చెందిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారన్నారు. వీరిలో జ్వరాలున్నవారిని అన్ని జాగ్రత్తలతో అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. షెల్టర్లలో సామాజిక దూరం పాటించే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రేటర్లో సర్కిళ్లు : 30 వార్డుల సంఖ్య : 150 మురికి వాడలు : 1466 ఆవాసాలు : 4.21 లక్షలు నివాసితులు : 18.05 లక్షలు ఒక్కో స్లమ్‌లో జనాభా : 200 నుంచి 500 మరికొన్నింటిలో : 10000 నుంచి 17000 జనాభా -
మురికివాడలో పాయల్ రాజ్‌పుత్
గౌతంనగర్: అదోక మురికివాడ గ్రామీణ వాతావరణంను తలపించే అంశాలు కనిపిస్తాయి. హఠాత్తుగా మంగళవారం సినీ సందడి నెలకొనడంతో స్థానికులు ఆనందంతో గుంపులు గుంపులుగా పోగై సినీమా షూటింగ్‌ను వీక్షించారు. మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని హాల్టాప్ కాలనీలో ఉదయం ఓ సినిమా షూటింగ్ నిర్వహించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పై ఓ ద్విచక్ర వాహనం, ఇతర సన్నివేశాలను చిత్రికరించే విధానాన్ని షూట్ చేశారు.సినిమా పేరును ఇంక ఖారారు చేయ్యలేదని సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రణదీప్ తెలిపారు. -
ఆఫీస్ బాయ్‌కు రూ.కోట్లలో ఐటీ నోటీసులు
ముంబయి: ఓ కంపెనీలో ఆఫీసు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రవి జైశ్వాల్ (32) అనే వ్యక్తికి ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అది కూడా రూ.5.4కోట్లు ట్యాక్స్ పెండింగ్ ఉందంటూ. అంతేకాదు.. అతడి పేరిట నాలుగు కంపెనీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారులు పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు అందుకున్న రవి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఆ నోటీసులు తీసుకొని ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభిస్తున్న థానే ఎస్పీ మహేశ్ పాటిల్ వద్దకు వెళ్లి వివరాలు అందజేశాడు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఆధారంగా అసలు విషయం బయటపడింది. అతడి ఆధార్, పాన్ కార్డులు ఉపయోగించుకొని ఓ వ్యక్తి నాలుగు కంపెనీలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని భయందర్ అనే ప్రాంతంలోని మురికి వాడల్లోగల గణేశ్ దేవల్ నగర్ కు చెందిన వాడు రవి. అతడు గతంలో కాండివ్లిలో చార్టెడ్ ఎకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్ వద్ద 2008 ఆగస్టులో పనిలో చేరాడు. ఆ సమయంలో బ్యాంకు ఖాతాకోసం అంటూ తన పాన్, ఆధార్ కార్డులు తీసుకున్నాడు. కానీ, జీతభత్యం మాత్రం డబ్బు రూపంలో చేతికే ఇచ్చాడు. 2012లో రవి అక్కడ పని మానేసి వేరే సంస్థలో చేరాడు. అంతకుమించి అతడికి ఏమీ తెలియదు. అతడు ఇచ్చిన ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అగర్వాల్(42), అతడి భాగస్వామి రాజీవ్ గుప్తా(30)ను మరో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. అనంతరం వారిని థానే కోర్టుకు తీసుకెళ్లి అనంతరం జైలు కస్టడీకి తరలించారు. -
రూ. 457 కోట్ల నల్లా బిల్లు బకాయిలు మాఫీ
* గ్రేటర్లో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి * ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలవేళ పేదలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. గ్రేటర్ పరిధిలోని మురికివాడలు, రాజీవ్ గృహకల్ప నివాస సముదాయాల్లో నివసిస్తున్నవారు, గృహ వినియోగదారుల నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేసింది. పేదలకు సంబంధించి రూ. 457.75 కోట్ల పెండింగ్ నల్లా బిల్లు బకాయిలను మాఫీ చేస్తూ మంగళవారం మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులతో గ్రేటర్ పరిధిలో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో మురికివాడలకు చెందిన 68,261 కుటుంబాలు, రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో నివసిస్తున్న 8,563 కుటుంబాలు, గృహ వినియోగ కేటగిరీ కింద 2,35,644 అల్పాదాయ, మధ్యాదాయ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 2015 నవంబర్ నాటికి మొత్తం నల్లా బిల్లు బకాయిలురూ. 299.52 కోట్లు కాగా.. దీనిపై కొన్నేళ్లుగా విధించిన వడ్డీ రూ.158.18 కోట్లుగా ఉంది.బకాయిలతో పాటు ఈ వడ్డీ మొత్తాన్నీ ప్రభుత్వం మాఫీ చేయడం గమనార్హం. తాజా ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వం జలమండలి ఎండీని ఆదేశించడంతో పేదలకు ఉపశమనం లభించింది. కాగా, జలమండలి పరిధిలో మొత్తం 8.46 లక్షల నల్లా కనెక్షన్లుండగా.. మాఫీతో 3,12,468 మందికి లబ్ధి చేకూరనుంది. అత్యధికంగా పాతనగరంలో రూ. 3 వేల నుంచి రూ.50 వేల వరకు బకాయి పడిన వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. -
రౌడీ ఆట
ఆదర్శం ప్రఖ్యాత అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ విన్సెంట్ లాంబార్డీ ఫుట్‌బాల్ ఆటను జీవితంతో పోలుస్తాడు. ‘ఫుట్‌బాల్ ఆట జీవితంలాంటిది. దానికి జీవితంలాగే... పట్టుదల, త్యాగం, అంకితభావం కావాలి’ అంటాడు. అవన్నీ అఖిలేష్లో ఉన్నాయి. అందుకే అతని జీవితం చీకటి నుంచి వెలుగు దారి వైపు మళ్లింది. చిన్నప్పుడు బడికి వెళ్లి చదువుకోవడం కంటే నాగపూర్ వీధుల్లో జులాయిగా తిరగడం ఇష్టం అఖిలేష్‌కు. తాను ఉండే అజాని మురికివాడలో కొందరు పిల్లలు సిగరెట్లు తాగడం, జూదం ఆడడం లాంటివి చేసేవారు. వారిని అబ్బురంగా చూసేవాడు అఖిలేష్. వారితో స్నేహం చేసి అన్ని దురలవాట్లనూ నేర్చుకున్నాడు. దాంతో ఆరవ తరగతిలోనే చదువు అటకెక్కింది. అఖిలేష్ తండ్రి నాగపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్యూన్‌గా పని చేసేవాడు. కొడుకుని గొప్పవాణ్ని చేయాలని ఎంతో ఆరాటపడేవాడు. కానీ ఎన్ని మంచి మాటలు చెప్పినా అఖిలేష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆశ వదులుకున్నాడు. ఆయన ఫీలింగ్సని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు అఖిలేష్. రౌడీ షీటర్లతో కలిసి తిరిగి తానూ రౌడీషీటర్ అయ్యాడు. పోలీసుల హిట్ లిస్ట్‌లో తన పేరు చేరేంతగా నేరాలు చేశాడు. ఒకటీ రెండూ కాదు... నలభైకి పైగా కేసుల్లో అతడు నిందితుడు! ఆ నేరాల పరంపర అలానే కొనసాగి ఉంటే, అఖిలేష్ ఈపాటికి ఏ జైలులోనో ఉండేవాడు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అతని జీవితంలోకి విజయ్ బోర్సే వచ్చాడు. విజయ్ ఫుట్‌బాల్ ఆటగాడు. మాంచి ఒడ్డూ పొడవుతో హీరోలా ఉండేవాడు. దాంతో అజాని మురికివాడ యువత అతణ్ని ఆరాధించేవారు. హుందాగా, ఓ పోలిస్ ఆఫీసర్లా కనిపించే అతనంటే భయంలాంటి భక్తిని కనబర్చేవారు. ఒకరోజు విజయ్ అఖిలేష్‌ను, అతని స్నేహితులను పిలిచి... ‘‘రోజూ నాతో పాటు ఫుట్‌బాల్ ఆడండి. రోజుకు అయిదు రూపాయలిస్తాను. మీకు నచ్చదని తెలుసు. వారం రోజులు ఆడి చూడండి. తరువాత మీ ఇష్టం’’ అన్నాడు. ‘‘భయ్యా, అయిదు రూపాయలు కాదు, ఒక్క రూపాయి ఇచ్చినా ఆడతాం’’ అన్నాడు అఖిలేష్. కుర్రాళ్లంతా కూడా అదే అన్నారు. వాళ్లు అలా అంటారని విజయ్‌కి తెలుసు. అందుకే ఆ ప్రపోజల్ పెట్టాడు. అతని ప్లాన్ ఫలించింది. రెండు వారాల్లో కుర్రాళ్లంతా ఫుట్‌బాల్ ఆటకు అలవాటు పడిపోయారు. ఇంకా చెప్పాలంటే అడిక్ట్ అయిపోయారు. ఏ రోజైనా విజయ్ నేను ఆట ఆడలేను అంటే వాళ్లు ఒప్పుకునేవారు కాదు. అతన్ని బతిమాలి ఒక్క మ్యాచ్ అయినా ఆడేవారు. రోజులు గడిచాయి. అందరూ ఫుట్ బాల్లో మునిగి తేలుతున్నారు. ఎవ్వరికీ తాగుడు, జూదం, చిల్లర వేషాలు, కొట్లాటలు... ఏవీ గుర్తుకు రావడం లేదు. అఖిలేష్‌కి అయితే ఫుట్‌బాలే ప్రపంచమై పోయింది. అది అతణ్ని నేరాల నుంచి పూర్తిగా దూరం చేసింది. కానీ అతడి గతం మాత్రం అంత త్వరగా వదల్లేదు. ఒకరోజు ఏదో పాత కేసులో అతన్ని అరెస్ట్ చేయడా నికి పోలీసులు వచ్చారు. పారిపోయి శ్మశానంలో తల దాచుకున్నాడు అఖిలేష్. అప్పుడే అతనిలో ఆలోచన మొదలైంది. ‘‘ఎందుకిలా భయపడి పారిపోవడం, వల్లకాట్లో ఎన్నాళ్లని దాక్కోవడం, ఇక ఇలాంటి జీవితం వద్దు’’ అనకున్నాడు. వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. తాను మారానని, ఇక ఏ నేరం చేయనని జడ్జి ముందు ప్రమాణం చేశాడు. షరతులతో బెయిల్ వచ్చింది. అంతే... నాటి నుంచీ అఖిలేష్ ప్రవర్తన మారిపోయింది. విజయ్ ఆర్గనైజేషన్ అయిన ‘స్లమ్ సాకర్’లో చేరి, విరివిగా ఫుట్‌బాల్ ఆడడం ప్రారంభిం చాడు. జాతీయ స్థాయి ఆటగాడిగా ఎదిగాడు. చివరికి 2009లో అతడికి అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ఆడే అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోనే లేదు. అయితే తన గతాన్ని మర్చిపోలేదు అఖిలేష్. విజయ్ తన జీవితాన్ని బాగు చేసినట్టు, తాను కూడా కొందరి జీవితాలను తీర్చిదిద్దాలని నిర్ణయించు కున్నాడు. ‘లివింగ్ హోప్’ అనే సంస్థను స్థాపించాడు. మురికివాడల్లో ఉండే ఆణిముత్యాలను వెలికి తీస్తున్నాడు. అలాగే రెడ్‌లైట్ ఏరియాల్లో మగ్గే పిల్లలను సైతం అక్కడ్నుంచి తప్పిస్తున్నాడు. వాళ్లందరికీ ఉచితంగా ఫుల్బాల్ నేర్పిస్తూ, వారికి అందమైన భవితను అందించాలని తపిస్తున్నాడు. ‘‘ఆ పిల్లల్లో ఏ ఒక్కరు అంతర్జాతీయ స్థాయికి చేరినా నా జీవితం ధన్యమైనట్టే’’ అని సత్యమేవ జయతే షోలో ఎమోషనల్‌గా చెప్పాడు అఖిలేష్. అలాంటి ఆదర్శనీయమైన గురువు ఉంటే... అది సాధ్యం కాకుండా ఉంటుందా! -
నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. మురికివాడల్లో స్థితిగతులు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడి ప్రజలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇదివరకు రెండుమార్లు వచ్చినప్పటికీ.. ఈ సారి మాత్రం మురికివాడల్లో విస్తృతంగా పర్యటన చేపట్టనున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ టీకె శ్రీదేవి మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు మురికివాడల్లో ఉదయం 5గంటల నుంచే పర్యవేక్షించి సమస్యలు గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు ఏం వరాలు ఇస్తారోనని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. షెడ్యూల్‌పై గోప్యత... ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. కార్యక్రమంపై సీఎం కార్యాలయం నుంచే స్పష్టత లేదని పేర్కొంటున్నారు. అయితే సీఎం మాత్రం మహబూబ్‌నగర్ పట్టణంలోని నాలుగు మురికి వాడలను సందర్శించే అవకాశం ఉంది. సీఎం పర్యటన ఇలా..? సీఎం పర్యటన వివరాలు అధికారులు ప్రకటించనప్పటికీ ఆయన పర్యటన ఇలా ఉండే అవకాశం ఉంది. మొదటగా సీఎం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల వరకు ఆర్అండ్బీ అథితిగృహానికి చేరుకుంటారు. అక్కడ మంత్రులు, జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా మురికివాడల్లో పర్యటించనున్నారు. మున్సిపాలిటీల్లోని నాలుగు మురికి వాడల్లో పర్యటనకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత పాలమూరు, వీరన్నపేట, పాతతోట(కూరగాయల మార్కెట్), టీడీగుట్ట ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. మొదటగా మధ్యాహ్న సమయంలోపు రెండువాడల్లో పర్యటించేలా అధికారులు ప్రణాళిక రచించారు. లంచ్ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. సీఎం పర్యటించే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం తేనీటి విందు తర్వాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం అక్కడే మళ్లీ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించనున్నారు. అధికారుల అప్రమత్తత..! సీఎం కేసీఆర్ జిల్లాలో నేరుగా సమస్యల పై దృష్టి సారించనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో తలెత్తిన ఇబ్బందులు పునారావృతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుల చిట్టాను పక్కాగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డులు, పింఛన్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా సరిచూసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులు సమీక్షలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు. తాగునీరు, ఇళ్లు, రహదారులు, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యలపై ప్రణాళికలు రచించారు. వీటితో పాటు విలీన పంచాయతీల్లో సమస్యలపై ప్రత్యేక నోట్ తయారు చేశారు. పనులను అడ్డుకున్న స్థానికులు.. సముదాయించిన కలెక్టర్ సీఎం పర్యటించే ప్రాంతాల్లో పనులు చేసేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రధానంగా పాత పాలమూరులో పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఇన్నాళ్లు తమను పట్టించుకోని వారు ఇప్పుడు సీఎం వస్తున్నారని ఇవన్నీ చేస్తున్నారా... మా సమస్యలు సీఎంకు చూపిద్దామనుకుంటే.. ఇప్పుడు పనులు చేసి అంతా బాగున్నట్టు చెప్పుదామని చూస్తున్నారా’ అంటూ ఘర్షణకు దిగారు. దీంతో కలెక్టర్ శ్రీదేవి వారిని సముదాయించారు. కౌన్సిల్ జాబితా సిద్ధం... సీఎం ప్రత్యేకంగా మున్సిపల్ సమస్యలపైనే వస్తుండడంతో మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ చిట్టాపద్దును తయారు చేసుకుంది. పట్టణ ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ అధ్యక్షతన కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమై జాబితా సిద్ధం చేశారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ చుట్టూ ఔ టర్ రింగ్‌రోడ్డు, అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణంతో పాటు విలీన గ్రామ పంచాయతీల్లో తాగునీటి సౌకర్యం, ఇదివరకు పట్టణానికి తాగునీ రు సరఫరా చేస్తున్న రామన్‌పాడు, కోయిల్సాగర్ల నుంచి అదనంగా మరో పైపులైన్, పట్టణంలోని పలు ప్రాంతాల గుం డా రైల్వేలైన్లు ఉన్నందున ఆయా ప్రాం తాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పార్కుల ఏ ర్పాటు తదితర వాటితో మొత్తం రూ.500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. -
1+1 రగడ
మురికివాడల్లో ముసలం జీ ప్లస్ వన్ నిర్మాణాల కోసం అధికారుల సర్వేవద్దంటూ ధర్నాలు.. రాస్తారోకోలు.. ఆందోళనలు కార్పొరేషన్‌కు సవాల్‌గా ఇళ్ల నిర్మాణం వన్ ప్లస్ వన్ వద్దు. పక్కాగా నిర్మించిన డాబాలను కూల్చకుండా ఇళ్ల పట్టాలు లేదా భూమిపై హక్కు కల్పించాలి. రేకుల ఇళ్ల స్థానంలో ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించాలి. వన్ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించినా అభ్యంతరం లేదు. భూసేకరణ, లేఅవుట్ పేరుతో డాబా ఇళ్లు, రేకుల ఇళ్లు కూల్చొద్దు. సీసీ రోడ్లు, డ్రెరుునేజీలు లేని చోట నిర్మించాలి. - గరీబ్‌నగర్ కాలనీవాసులు మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం.. నాలుగైదు నెలల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తాం. అందరూ సహకరించాలి. నగర జనాభా పెరుగుతోంది. భూమి పెరగడం లేదు. అందరూ గమనించాలి. ఎక్కడైనా జీ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దంటే బంద్ పెడ్తం. - ఆదివారం ప్రెస్మీట్లో సీఎం సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరాన్ని మురికివాడలు లేని బస్తీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని అమల్లోకి తేవడం బల్దియా అధికారులకు సవాల్‌గా మారింది. ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలతో అడుగు ముందుకు పడటం లేదు. నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. వన్ ప్లస్ వన్ వద్దనే నిరనసన మధ్య అధికారులు ఎలా ముందుకు సాగుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివాదంలో జీ ప్లస్ వన్వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరు కాలనీల్లో జీ ప్లస్‌వన్(ప్రస్తుతం స్థలంలో ఉన్న వారు కింద.. అర్హులైన మరో కుటుంబం మొదటి అంతస్తులో) పద్ధతిలో మొత్తం 3,957 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీని వల్ల 7,916 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా ప్రతీ కాలనీలో డ్రెరుునేజీలు, మంచినీటి పైపులైన్లు, 30 అడుగుల అప్రోచ్ రోడ్లు, 20 అడుగుల అంతర్గత రోడ్లు, 334 చదరపు అడుగుల పార్కు స్థలం, అంగన్వాడీ సెంటర్, కమ్యూనిటీ హాల్, అర్బన్ హెల్త్ సెంటర్ తదితర అవసరాలకు వీలుగా స్థలం ఉండే విధంగా లే అవుట్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. లక్ష్మీపురం, శాకరాసికుంట, అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్‌లలో పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. మలివిడతలో భాగంగా ఎస్ఆర్ నగర్, గరీబ్‌నగర్, గాంధీనగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీల్లో లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఉచితంగా సకల సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నా, లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. పైగా ఇళ్లు నిర్మాణం అవసర ం లేదంటూ ధర్నాలకు దిగుతున్నారు. జీ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దు, మా ఇళ్లపై యాజమాన్య హక్కు కల్పించి, మంచినీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తే చాలు అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉన్నది పోతుందేమో.. ప్రస్తుతం ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిన మురికివాడల్లో అంబేద్కర్, జితేందర్నగర్లను మినహాయిస్తే మిగిలి ప్రాంతాల్లో కొందరు డాబా ఇళ్లు, రేకుల ఇళ్లు నిర్మించుకున్నారు. తమ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు సంబంధించిన లే అవుట్లో రోడ్లు, డ్రెరుునేజీల వల్ల తమ ఇళ్లు పోతాయోమోననే ఆందోళన వారిలో నెలకొంది. దానితో జీ ప్లస్ వన్ నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తాము ఉంటున్న ఇంటి జాగాను క్రమబద్ధీకరిస్తే చాలంటున్నారు. లేదంటే తమ ఇళ్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ముఖ్యంగా దీన్‌దయాళ్‌నగర్, గరీబ్‌నగర్ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండగా లక్ష్మీపురంలో కూడా ఇలాగే ఉంది. -
మురికివాడల్లో పెరుగుతున్న టీబీ పీడితుల సంఖ్య
పుణే: నగరంలోని మురికివాడలు క్షయవ్యాధికి అడ్డాలుగా మారిపోయాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) గణాంకాలప్రకారం ఈ ఏడాది నగరంలో మొత్తం 3,683 టీబీ కేసులు నమోదు కాగా అందులో 80 శాతం మంది మురికివాడ వాసులే. వాస్తవానికి 1951లో ఈ నగర జనాభా సంఖ్య ఆరు లక్షలే. ఆ తర్వాత చెన్నై, బెంగళూర్, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి నగరానికి వలసలు మొదలయ్యాయి.దీంతో ప్రస్తుత జనాభా సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. ఉపాధి వేటలో అనేకమంది ఇక్కడికి రావడం ప్రారంభించారు. అయితే ఇలా వలస వచ్చినవారికి గృహవసతి కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యింది. కార ణాలు అనేకం నగరంలోని మురికివాడల్లో టీబీ వ్యాధిపీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంసీ అధికారి ఒకరు చెప్పారు.అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు, జనాభా సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం, మురికివాడల్లో నివసించేవారికి తగినంత గాలి,వెలుతురు అందకపోవడం వల్లనే వారంతా వ్యాధిపీడితులుగా మారిపోతున్నారన్నారు. పట్టణీకరణ శరవేగంగా జరిగిపోవడం కూడా ఇటువంటి దయనీయ పరిస్థితులకు దోహదం చేస్తోందన్నారు. అనారోగ్యం వారికి పట్టదు మురికివాడల్లో నివసించే వారి జీవనస్థితిగతులను రాజకీయ నాయకులు పట్టిం చుకోరని, వారిని తమ ఓటుబ్యాంకుగా మాత్రమే భావిస్తారంటూ సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నగరంలో మురికివాడల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు. -
అంతా బహిరంగమే
సాక్షి, ముంబై : నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు ఎటూ సరిపోవడం లేదు. ముఖ్యంగా మురికివాడల ప్రజలు రోడ్లపైన, సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్రాలు విసర్జిస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసనమయం అవుతున్నాయి. నగరంలోని పలు మురికివాడల ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల సంఖ్య పెంచడంతోపాటు వాటికి మరమ్మతులు చేపట్టాలని కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ)ను కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బీఎంసీలోని గట్ నాయకులు మద్దతిచ్చారు. మరుగుదొడ్ల మంజూరు కోసం బీఎంసీ కమిషనర్ వద్దకు ప్రతిపాదన పంపించారు. కానీ కొత్తగా సౌచాలయాలు నిర్మించాలంటే అందుకు సరిపడా స్థలం నగరంలో ఎక్కడా లభించడం లేకపోవడంతో బీఎంసీ పరిపాలన విభాగం అందోళనలో పడిపోయింది. సంచార మరుగుదొడ్ల ప్రతిపాదన మరుగుదొడ్ల కొరత కారణంగా ముఖ్యంగా మురికివాడల్లో ఉంటున్న పేద ప్రజలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ప్రత్యామ్నాయంగా సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేసి ఉచితంగా సేవ లందించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కానీ ఈ సంచార మరుగు దొడ్లను కేవలం ఉత్సవాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా వాటిని అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగియగానే వాటిని బీఎంసీ యార్డులోకి తరలిస్తారు. వీటిని మురికివాడల్లో శాశ్వతంగా ఉంచాలంటే అది ఖర్చుతో కూడుకున్నది. దీన్ని యార్డు నుంచి అవసరం ఉన్న చోటికి తరలించేందుకు రూ.4,392 రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ సంచార మరుగుదొడ్డికి రూ.3000 డిపాజిట్ చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి ఇలా మొత్తం రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఈ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా...? లేక దీన్ని వినియోగించే మురికివాడ ప్రజల నుంచి వసూలు చేయాలనేది స్పష్టమైన నియమాలు లేవు. బీఎంసీ ఈ సంచార సౌచాలయాలను ఉచితంగా సమకూర్చి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఉత్సవాల సమయాల్లోనే సాధ్యం ఉత్సవాల సమయంలో అంటే ఉదాహరణకు 26 జనవరి, మే ఒకటి, 15 ఆగస్టు, గణేశ్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాళ్లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తారు. అది అత్యవసర సమయం కావడంతో ప్రజలకు మౌలికసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత బీఎంసీపై ఉంటుంది. అందుకయ్యే వ్యయాన్ని కూడా బీఎంసీ భరిస్తోంది. కానీ ప్రతీ రోజు మురికివాడల ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి సాధ్యం కాదు. -
పేదబస్తీలకు ఫిల్టర్ వాటర్
4 రూపాయలకే 20 లీటర్లు.. 400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు యోచన.. తొలి దశలో 60 కేంద్రాలు త్వరలో ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ సాక్షి, హైదరాబాద్: గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్న నగరంలోని పేదబస్తీ వాసులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. పేదల కోసం ఇప్పటికే రూ. 5కే భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న జీహెచ్ఎంసీ.. త్వరలోనే రూ. 4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. 400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు యోచన ఉన్నప్పటికీ తొలిదశలో 60 ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సర్కిళ్ల వారీగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న బస్తీలు/కాలనీలను గుర్తించారు. ఈ బస్తీల్లో ఆర్ఓ ప్లాంట్లను జీహెచ్ఎంసీయే ఏర్పాటు చేస్తుంది. స్థానిక స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు కొద్దిరోజుల శిక్షణనిచ్చి.. అనంతరం నిర్వహణ బాధ్యతను వాటికే అప్పగిస్తుంది. ఖర్చులు పోను మిగిలే ఆదాయం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందుతుంది. బస్తీలకు స్వచ్ఛమైన నీటి సదుపాయంతోపాటు ఎస్‌హెచ్‌జీలతో ఎంతోకొంత ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు. గ్రేటర్లో 1,476 మురికివాడలు ఉండగా, వీటిల్లో చాలా బస్తీలకు కనీస నీటి సదుపాయం లేదు. శివారు మునిసిపాలిటీల్లోని కాలనీల్లోనూ అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేందుకు ఉద్దేశించిన ‘టిప్’ పథకం అటకెక్కింది. ఇలాంటి కాలనీలు 900 పై చిలుకు ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది జనాభాకు అవసరమైన తాగునీరు లేదు. తొలిదశలో మురికివాడలపై దృష్టిసారించిన జీహెచ్ఎంసీ.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పేదలకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కోసం రూ. 20 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఆయా బస్తీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. భూగర్భ జలాలు అధికంగా ఉన్న చోట పవర్‌బోర్లు వేస్తారు. సమీపంలోని కమ్యూనిటీ హాలు.. లేదా జీహెచ్ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ భవనంలో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఇలా తొలిదశలో 60 ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకుగాను 62 బస్తీలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. నిరంతర నీటి సర ఫరాకు అక్కడ వీలుందా లేదా అనే సాంకేతికాంశాల్ని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తనిఖీ చేస్తున్నారు. నివేదిక రాగానే నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. శుద్ధి చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌ను రూ. 4 కే అందజేస్తారు. ప్లాంట్ వద్దకు వెళ్లేవారికి ఈ ధర వర్తిస్తుంది. శివారు ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ. 300 కోట్లు కేటాయించారు. పైపులైన్ల ద్వారా శాశ్వత నీటి సదుపాయం సమకూరేంత వరకు అక్కడ కూడా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయి. -
మురికివాడల్లో కనీస సౌకర్యాలు కల్పించండి
న్యూఢిల్లీ: నగర శివారుల్లో ఉన్న మురికివాడల్లో ప్రజానీకానికి వసతులు కల్పించాలని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లాల నేతృత్వంలోని ధర్మాసనం... ఈ అంశంపై జూలై రెండో తేదీన నివేదిక ఇవ్వాలని కోరింది. పాత ఢిల్లీలోని పుల్ మిథాయి ప్రాంతంలోగల మురికివాడల్లోని ప్రజానీకం అత్యంత దుర్భరమైన, అమానవీయ పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అభితి గుప్తా తెలిపారు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతంలో కేవలం ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన ఇళ్లలో బతుకుతున్నారని పేర్కొన్నారు. తాగునీరు లేదని, పారిశుధ్యం అసలే లేదని, పూర్తిగా పేదరికంలో అనారోగ్య వాతావరణంలో నివసిస్తున్నారని తెలిపారు. అనేక మందికి ఇళ్లులేకపోవడంతో దశాబ్దాలుగా ఇలాగే తమ జీవితాన్ని గడుపుతున్నారని, వారిలో కొందరు ఇళ్ల నిర్మాణ రంగంలో కార్మికులుగా కొనసాగుతుండగా, మరికొందరు కూరగాయల మార్కెట్లలో పనిచేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వ పథకాలేవీ చేరడం లేదని, ప్రాథమిక చికిత్స కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులకు పోషకాహారం లభించడం లేదని, దీనివల్ల శిశుమరణాలు, గర్భస్థ శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జననీ శిశు సురక్షా కార్యక్రమం, రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన, జన నీ సురక్షా యోజన, ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ పథకాలను ఇక్కడి స్త్రీలకు కూడా కల్పించాలని పిటిషన్లో కోరారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని షకీల్ అహ్మద్ అనే వ్యక్తి దాఖలు చేశారు. హాకర్లపై వేధింపుల కేసులో తీర్పు రిజర్వ్ తమ హక్కులు కాపాడాలంటూ ఢిల్లీలోని హాకర్లు (రోడ్డుపక్కన వ్యాపారం చేసేవారు) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును రిజర్వ్ చేసింది. పోలీసులు తమను వేధిస్తున్నారని, తాము కూర్చునే చోట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెత్తను పోగు చేస్తున్నారని, ఓఖ్లాలోని సబ్జీమండి ప్రాంతంలో వేసిన చెత్తను తీసేయించాలంటూ హాకర్లు చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్, జయంత్‌నాథ్‌ల బెంచ్ తీర్పును నిలిపివేసింది. సమస్యను తమకు తామే పరిష్కరించుకోవాలని హాకర్లకు సూచించిన కోర్టు... లేకపోతే సమస్య మరింత సాగుతుందని తెలిపింది. చిన్న వ్యాపారుల హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ శ్రామిక్ సంఘటన్ తరపు న్యాయవాది ఇందిరా ఉన్నియార్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు... పిటిషనర్, ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎమ్సీడీ) సమర్పించిన దస్తావేజులు, చిత్రాలు, వీడియోలను పరిశీలించిన తరువాత తీర్పు ఇవ్వనున్నట్లు చెప్పింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో హర్కేష్నగర్ సబ్జీమండిలోని 130 మంది హాకర్లు దాఖలు చేసిన పిటిషన్లో... స్థలాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు తమను వేధిస్తున్నారని, డబ్బులు అడుగుతున్నారని తెలిపారు. 20 ఏళ్లుగా అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నామని హాకర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దానికితోడు తాము కూర్చునే ప్రాంతాల్లోనే ఎమ్సీడీ చెత్తను వేస్తూ తమ జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తోందని ఆరోపించారు. హాకర్లను నెలకు రూ. 500 చెల్లించాలంటూ వేధిస్తున్నారని హాకర్ల తరఫు న్యాయవాది ఇందిర.. కోర్టుకు వివరించారు. ఐదు వేల రూపాయలు లంచం తీసుకొని వేరే వ్యాపారస్తులకు అక్కడ చోటిస్తున్నారని, వారిని రక్షించినందుకుగాను నెలకు రూ. 1,000 కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు. హాకర్లను వేధించొద్దన్న కోర్టు ఆదేశాలను పోలీసులు, ఎమ్సీడీ ఖాతరు చేయడం లేదని తెలియజేశారు. -
మురికి రాష్ట్రం మనదే..
టాప్-10 మురికివాడల నగరాల్లో 3 మనవే నగరాలను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నది అంతా భ్రమే ప్రతి వంద మందిలో 31 నుంచి 44 మంది స్లమ్స్‌లోనే మురికివాడలు లేని రాష్ట్రంగా కేరళ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నగరాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెబుతున్నదంతా ఉత్త కబుర్లేనని తేలిపోయింది. మురికివాడలు అధికంగా ఉన్నాయని కేంద్రం గుర్తించిన పది నగరాల్లో మూడు మన రాష్ట్రంలోనే ఉండటమే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో పది లక్షలు జనాభా దాటిన మూడు నగరాలు మురికివాడలకు ఆలవాలంగా మారాయి. కేంద్ర జనాభా లెక్కల డెరైక్టర్ జనరల్ గణాంకాల ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం పెరుగుతున్న నగరాలు, అక్కడి ప్రజలకున్న సౌకర్యాలపై నివేదిక రూపొందించింది. మురికివాడలు ఉన్న పట్టణాల్లో గ్రేటర్ విశాఖపట్టణం అగ్రస్థానంలో ఉండగా, విజయవాడ నాలుగో స్థానంలో, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. కేరళ రాష్ట్రం దాదాపు మురికివాడలు లేని రాష్ట్రంగా తేలింది. కార్పొరేషన్ల పరంగా చూసినా, రాష్ట్రపరంగా చూసినా మురికివాడలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. ప్రతీ వంద మందిలో 35 నుంచి 45 మంది మురికివాడల్లోనే నివసిస్తున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. గ్రేటర్ విశాఖపట్టణంలో 45 శాతం కుటుంబాలు, విజయవాడలో 40 శాతం, గ్రేటర్ హైదరాబాద్‌లో 31 శాతం కుటుంబాలు మురికివాడల్లో ఉన్నాయని వివరించింది. నగరాల్లో 1.37 కోటి కుటుంబాలు మురికివాడల్లోనే జీవనం సాగిస్తున్నాయి. అందులో పదిలక్షల జనాభా దాటిన నగరాల్లో 52 లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపింది. మిగిలిన పట్టణాల్లో మరో 85 లక్షల కుటుంబాలు ఉన్నాయని వివరించింది. తగ్గుతున్న ఉమ్మడి కుటుంబాలు దేశ వ్యాప్తంగా నగరాల్లో మురికివాడల సంఖ్య పెరుగుతుండడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నివేదికలో ఆందోళన వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా 7,933 నగరాలు, పట్టణాలు ఉన్నాయి. గడిచిన పదేళ్లలో 2,700 పట్టణాలు కొత్తగా ఏర్పడినట్లు ఆ నివేదిక పేర్కొంది. అదే సమయంలో పది లక్షల పైబడి జనాభా ఉన్న నగరాల సంఖ్య 35 నుంచి 53కి పెరిగినట్లు వివరించింది. నగరీకరణ పెరుగుతున్న కొద్దీ ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయని వెల్లడించింది. ఒక కుటుంబంలో నలుగురికి మించి ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2001 జనాభా లెక్కల్లో ఉమ్మడి కుటుంబం (9+)ఉన్న వారి శాతం 9.3 ఉంటే... 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి 5.5 శాతానికి తగ్గినట్లు తేల్చారు. తామిద్దరు, తమకు ఇద్దరు అన్న నినాదాన్ని నగరాల ప్రజలు వంటిపట్టించుకున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. 2001లో నలుగురున్న కుటుంబాలు 22.4 శాతం ఉంటే... ప్రస్తుతం ఆ శాతం 26.4 శాతానికి పెరిగిందని వివరించింది. అదే సమయంలో ఆరు నుంచి ఎనిమిది మంది ఉంటే కుటుంబాలు 24.4 శాతం నుంచి 20.6 శాతానికి తగ్గిపోవడం గమనార్హం.