ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహా నగరాల్లో ముంబై ప్రథమ స్థానంలో ఉంది. ఆసియాలోని అతిపెద్ద స్లమ్స్‌లో ఒకటైన ధారవి స్లమ్‌లో దాదాపు వంద పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో దాదాపు 10 మంది మరణించారు. ఈ నేపథ్యంలో స్లమ్ అంటేనే ప్రజల్లో వణుకు పుడుతోంది. కారణం ఇరుకు ఇళ్లు.. ఎక్కువ జనాభా.. ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. పెద్ద కాలనీల్లో కంటే స్లమ్స్‌లో పాజిటివ్ కేసులుంటే వ్యాపించే తీవ్రత అధికంగా ఉండడమే అందుకు కారణం. ధారవితో పోల్చగల స్లమ్ ఏదీ నగరంలో లేనప్పటికీ.. ఒకే ఇంట్లో ఎక్కువ మంది ఉండటం వల్ల భయాందోళనలు నెలకొన్నాయి. (కరోనా : వారికి సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేం)
ఈ కేసులే అత్యధికం..
గ్రేటర్ నగరంలో వెలుగు చూస్తున్న పాజిటివ్ కేసుల్లో మర్కజ్‌వే అధికం. మర్కజ్‌తో సంబంధాలున్న వారు వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, పాతబస్తీలో ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఇప్పటికే అక్కడి పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 160కి పైగా ఉండటంతో అక్కడి స్లమ్స్‌లోని ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వైరస్ పొంచి ఉందోనని భీతిల్లుతున్నారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, మలక్‌పేట, రాజేంద్రనగర్ సర్కిళ్లలో ఇలాంటి పరిస్థితులున్నాయి. పాతబస్తీలోని స్లమ్స్, ఇరుకు పరిస్థితులు, ఒకే ఇంట్లో అధిక జనాభా ఉండటం వంటి కారణాల వల్లే ఒకే ఇంట్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని స్లమ్స్ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లేని పక్షంలో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్‌లో అధిక జనాభా కలిగిన స్లమ్స్‌లో హఫీజ్ బాబానగర్, వినాయక్ నగర్, ఎన్టీఆర్‌నగర్, అడ్డగుట్ట, సంజయ్‌గాంధీనగర్, ప్రేమ్‌నగర్, మహమూద్‌నగర్, ఎల్లమ్మబండ, ఎంఎస్ మక్తా, వట్టేపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి.
యూసీడీ సేవలు..
జీహెచ్‌ఎంసీలోని యూసీడీ విభాగం స్లమ్స్‌లోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్నప్పటికీ, ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసులు అన్ని ప్రాంతాల్లో ఉండటంతో అన్ని చోట్లా నివారణపై దృష్టి సారించడంతో పాటు స్లమ్స్‌లోని పేదలు, నిరాశ్రయులకు వసతి, ఆహారం తదితరాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ (యూసీడీ) జె. శంకరయ్య తెలిపారు. ఇప్పటి వరకు నగరంలో 120 షెల్టర్లలో 4,565 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించామని, వారందరికీ రెండుపూటలా భోజనంతోపాటు శానిటైజర్లు, సబ్బులతో పాటు మాస్కులు అందజేస్తూ వైద్యపరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలోని ఏఎంఓహెచ్‌లతోపాటు బస్తీ దవాఖానాలకు చెందిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారన్నారు. వీరిలో జ్వరాలున్నవారిని అన్ని జాగ్రత్తలతో అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు. షెల్టర్‌లలో సామాజిక దూరం పాటించే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గ్రేటర్‌లో సర్కిళ్లు : 30
వార్డుల సంఖ్య : 150
మురికి వాడలు : 1466
ఆవాసాలు : 4.21 లక్షలు
నివాసితులు : 18.05 లక్షలు
ఒక్కో స్లమ్‌లో జనాభా : 200 నుంచి 500
మరికొన్నింటిలో : 10000 నుంచి 17000 జనాభా
Comments
Please login to add a commentAdd a comment