మురికివాడల్లో పెరుగుతున్న టీబీ పీడితుల సంఖ్య
పుణే: నగరంలోని మురికివాడలు క్షయవ్యాధికి అడ్డాలుగా మారిపోయాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) గణాంకాలప్రకారం ఈ ఏడాది నగరంలో మొత్తం 3,683 టీబీ కేసులు నమోదు కాగా అందులో 80 శాతం మంది మురికివాడ వాసులే. వాస్తవానికి 1951లో ఈ నగర జనాభా సంఖ్య ఆరు లక్షలే. ఆ తర్వాత చెన్నై, బెంగళూర్, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి నగరానికి వలసలు మొదలయ్యాయి.దీంతో ప్రస్తుత జనాభా సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. ఉపాధి వేటలో అనేకమంది ఇక్కడికి రావడం ప్రారంభించారు. అయితే ఇలా వలస వచ్చినవారికి గృహవసతి కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యింది.
కార ణాలు అనేకం
నగరంలోని మురికివాడల్లో టీబీ వ్యాధిపీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంసీ అధికారి ఒకరు చెప్పారు.అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు, జనాభా సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం, మురికివాడల్లో నివసించేవారికి తగినంత గాలి,వెలుతురు అందకపోవడం వల్లనే వారంతా వ్యాధిపీడితులుగా మారిపోతున్నారన్నారు. పట్టణీకరణ శరవేగంగా జరిగిపోవడం కూడా ఇటువంటి దయనీయ పరిస్థితులకు దోహదం చేస్తోందన్నారు.
అనారోగ్యం వారికి పట్టదు
మురికివాడల్లో నివసించే వారి జీవనస్థితిగతులను రాజకీయ నాయకులు పట్టిం చుకోరని, వారిని తమ ఓటుబ్యాంకుగా మాత్రమే భావిస్తారంటూ సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నగరంలో మురికివాడల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు.