చివర్లో ‘వెలిగారు’
సన్‌రైజర్స్ ఘన విజయం
7 వికెట్లతో బెంగళూరు చిత్తు
రాణించిన వార్నర్, ధావన్
కోహ్లి శ్రమ వృథా
ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మూడు ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్... చివరి మ్యాచ్‌లో మాత్రం అద్భుతంగా ఆడింది. కాస్త ఆలస్యంగానైనా హైదరాబాద్ అభిమానులకు విజయాన్ని రుచిచూపించి... ఈ సీజన్‌కు సొంతగడ్డపై మ్యాచ్‌లను ముగించింది.
సాక్షి, హైదరాబాద్: తాము ముందుకెళుతున్నారా? లేక బెంగళూరును ముంచారా? మంగళవారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం తర్వాత ఉదయించిన ప్రశ్న ఇది. మిగిలిన అన్ని మ్యాచ్‌లూ గెలిచినా కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరతారని నమ్మకం లేని దశలో సన్‌రైజర్స్ తమ ఆటస్థాయిని ఒక్కసారిగా పెంచింది. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అనుకున్న బెంగళూరుకు షాక్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో హైదరాబాద్ జట్టు బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను ఏడు వికెట్లతో ఓడించి... ఈ సీజన్‌లో సొంతగడ్డపై మ్యాచ్‌లను ముగించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, ఏబీ డివిలియర్స్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. అనంతరం సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 161 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డేవిడ్ వార్నర్ (46 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (39 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 75 బంతుల్లోనే 100 పరుగులు జోడించి విజయాన్నందించారు.
కీలక భాగస్వామ్యాలు...
భువనేశ్వర్ హైదరాబాద్‌కు శుభారంభం అందించాడు. ఐదో బంతికే పార్థివ్ (4)ను పెవిలియన్ పంపించగా...మరో వైపు స్టెయిన్ పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశాడు. ఫలితంగా ఆర్‌సీబీ ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. ఇబ్బంది పడుతూ ఆడిన గేల్ (20 బంతుల్లో 14; 1 ఫోర్) కరణ్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. పవర్‌ప్లేలో ఆ జట్టు 25 పరుగులు మాత్రమే చేయగలిగింది.
యువరాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. ఆరంభంలో మెల్లగా ఆడుతూ 19 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. ఈ జోడి 43 బంతుల్లో 57 పరుగులు జోడించిన అనంతరం భారీ షాట్‌కు ప్రయత్నించి యువీ వెనుదిరిగాడు.
డివిలియర్స్ అండతో దూసుకుపోయిన కోహ్లి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసిన అనంతరం ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. తొలి 10 ఓవర్లలో 48 పరుగులు మాత్రమే చేసిన బెంగళూరు ఆ తర్వాతి 10 ఓవర్లలో 112 పరుగులు చేసింది. .
ఓపెనింగ్ అదుర్స్...
సన్‌రైజర్స్‌కు ధావన్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ధావన్ రనౌటయ్యాడు. ఆ తర్వాత 41 బంతుల్లో సీజన్‌లో ఐదో అర్ధ సెంచరీ చేసిన వార్నర్, ఆరోన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
వార్నర్ అవుటయ్యాక 3.5 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో కాస్త ఒత్తిడికి లోనైనా... నమన్ ఓజా (20 బంతుల్లో 24; 2 సిక్స్‌లు)తో పాటు చివర్లో ఫించ్ (11 నాటౌట్), స్యామీ (10 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. ఆరోన్ వేసిన 19వ ఓవర్లో 2 సిక్స్‌లు సహా 16 పరుగులు రావడంతో గెలుపు సులువైంది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) రసూల్ (బి) కరణ్ 14; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 4; కోహ్లి (సి) స్టెయిన్ (బి) పఠాన్ 67; యువరాజ్ (సి) స్టెయిన్ (బి) రసూల్ 21; డివిలియర్స్ (బి) భువనేశ్వర్ 29; రాణా (నాటౌట్) 12; స్టార్క్ (రనౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1-5; 2-23; 3-80; 4-141; 5-146; 6-160.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-2; స్టెయిన్ 4-0-23-0; రసూల్ 4-0-26-1; కరణ్ 3-0-27-1; వేణు 1-0-7-0; పఠాన్ 3-0-28-1; స్యామీ 1-0-19-0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ధావన్ (రనౌట్) 50; వార్నర్ (సి) యువరాజ్ (బి) ఆరోన్ 59; నమన్ ఓజా (సి) యువరాజ్ (బి) ఆరోన్ 24; ఫించ్ (నాటౌట్) 11; స్యామీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1-100; 2-126; 3-150.
బౌలింగ్: మురళీధరన్ 4-0-26-0; స్టార్క్ 3.4-0-31-0; ఆరోన్ 4-0-36-2; అహ్మద్ 2.2-0-22-0; చహల్ 4-0-32-0; యువరాజ్ 1.4-0-10-0.