tuberculosis
-
మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియాతో టీబీ కొత్త వ్యాక్సిన్!
క్షయ వ్యాధి ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అయినా..చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది ఈ క్షయవ్యాధి. ఇది మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వలన వస్తుంది. క్షయ ఈ వ్యాధి సోకని శరీరావయవాలు క్లోమము, థైరాయిడ్ గ్రంథి, జుట్టు. మిగిలిన అవయవాలన్నింటికి క్షయవ్యాధి కలిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశాన్ని దెబ్బ తీస్తుంది. అలాంటి ఈ వ్యాధికి ఇప్పటి వరకు బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ మరియు గురిన్), బోవిన్ టీబీ పాథోజెన్ అటెన్యూయేటెడ్ వేరియంట్ అనే ఏళ్ల నాటి పాత వ్యాక్సిన్లే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ పరిమిత ప్రభావమే ఉంది. అందువల్లే ప్రభావవంతంగా పనిచేసేది, ముఖ్యంగా చిన్నారులు, పెద్దలకు మెరుగైన ఫలితాలనిచ్చే వ్యాక్సిన్‌పై ఎన్నే ఏళ్లుగానో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ పరిశోధనల ఫలితమే ఎంటీబీ వ్యాక్సిన్(ఎంటీబీవీఏసీ). ఇది మానవుల నుంచి సేకరించిన బ్యాక్టీరియా నుంచే క్షయ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేలా వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేశారు. అయితే ఇది ఎంత ప్రభావవంతంగా ఉందనే దానిపై పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ Biofabri సహకారంతో 2025లో భారత్‌లో పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఆదివారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని(మార్చి 24) పురస్కరించుకుని ఈ విషయాన్ని బయోఫాబ్రి ప్రకటించింది. ఆ ట్రయల్స్ ద్వారా ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేస్తారు. ఈ ఎంటీబీ వ్యాక్సిన్ బీజీజీ కంటే ప్రభావవంతమైనది, ఎక్కువకాలం పనిచేసే వ్యాక్సిన్‌గా పేర్కొన్నారు పరిశోధకులు. ఇది పెద్దలు, యుక్త వయసులు వారికి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్‌గా అని చెప్పొచ్చన్నారు. ఈ మేరకు బయోఫ్యాబ్రి సీఈవో ఎస్టేబాన్ రోడ్రిగ్జ్ మాట్లాడు.. ఈ క్షయ వ్యాధి కారణంగా ఏటా 1.6 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోతున్నారు. అంంతేగాక ప్రపంచవ్యాప్తంగా క్షయకు సంబంధించిన కేసులు దాదాపు 28% ఉన్నాయని అన్నారు. ఈ కొత్త వ్యాక్సిన్ కొత్త ఆశను రేకెత్తించేలా భారత్‌లోనే పెద్దలు,కౌమర దశలో ఉన్నవారిపై ట్రయల్స్ నిర్వహించడం అనేది గొప్ప మైలురాయి అని అన్నారు. ఇక బయోఫ్యాబ్రి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..ప్రభావవంతమైన వ్యాక్సిన్ కోసం పడ్డ అన్వేషణ ఇన్నేళ్లకు ఫలించింది. దీనికి తోడు భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్‌తో పెద్ద ప్రొత్సాహం అందినట్లయ్యిందన్నారు. ఈ కొత్త టీబీ వ్యాక్సిన్‌ని ఆవిష్కరించడంలో డాక్టర్ ఎస్టేబాన్ రోడ్రిగ్జ్, డాక్టర్ కార్లోస్ మార్టిన్ల భాగస్వామ్యం ఎంతగానో ఉందన్నారు. ఈ ట్రయల్స్‌కి ముందే ఈ వ్యాక్సిన్ అనేక మైలు రాళ్లను సాధించింది. వాటిలో ఫేజ్2 డోస్ ఫైండింగ్ ట్రయల్ ఇటీవలే పూర్తైయ్యింది. ఇక నవజాత శిశువులలో డబుల్ బ్లైండ్, కంట్రోల్డ్ ఫేజ్3 క్లినికల్ ట్రయల్ 2023లో ప్రారంభమైంది. కాగా, ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇక దక్షిణాఫ్రికా నుంచి ఏడు వేల మంది, మడగాస్కర్ నుంచి 60 మంది, సెనెగల్ నుంచి 60 మంది నవజాత శిశువులకు టీకాలు వేయనున్నారు. ప్రధానంగా శిశువుల్లో ఈ ఎంటీబీ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని, సామర్థాన్ని అంచనావేయడమే లక్ష్యం. అంతేగాదు హెచ్ఐవీ-నెగిటివ్, హెచ్ఐవీ-పాజిటివ్ పెద్దలు ,కౌమారదశలో ఉన్నవారిపై కూడా ఈ వ్యాక్సిన్ ప్రభావంపై అంచనా వేయనుండటం గమనార్హం. ఈ ట్రయల్స్‌ని 2024 ద్వితీయార్ధంలో సబ్-సహారా ఆఫ్రికాలో ప్రారంబించనున్నారు. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
క్షయకు చెక్ పెట్టొచ్చు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్షయ నివారించదగిన వ్యాధే. సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వాస్తవంగా 2023 నాటికే క్షయ రహిత సమాజం నిర్మాణం కావాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ, క్షయ వ్యాధి గ్రస్తులు చికిత్స పొందడంలో అలసత్వం వహించడంతో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘నేను క్షయను నివారించగలను’ అనే నినాదంతో వ్యాధిపై ఈ ఏడాది అవగాహన కలిగిస్తున్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు. వ్యాప్తి ఇలా.... క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చే వ్యాధి కారక మైక్రో బ్యాక్టీరియా ఇతరులలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు మందులు ప్రారంభించిన రెండు వారాల తర్వాత అతని నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. లక్షణాలివే.. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. నియంత్రణ సాధ్యమే.. క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)లో భాగంగా రోగులకు ఉచితంగా మందులు అందచేస్తోంది. క్షయ రోగులు చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ రెండు గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుడు, గోరు చిక్కుడు, నాన్‌వెజ్‌కి సంబంధించి కైమా వంటివి తీసుకుంటే మంచిది. క్షయకు చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 500లు ఇస్తోంది. నివారించదగిన వ్యాధే క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చు. ప్రభుత్వం మంచి మందులు సరఫరా చేస్తోంది. కొందరు రెండు, మూడు నెలలు మందులు వాడి మానేయడంతో మొండి క్షయగా రూపాంతరం చెందుతోంది. ప్రతిరోజూ పల్మనాలజీ ఓపీకి 20 నుంచి 30 మంది క్షయ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే తీసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. – డాక్టర్ కె.శిరీష, పల్మనాలజిస్టు, జీజీహెచ్, విజయవాడ -
కోవిడ్‌తో క్షయకు అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల ఒక వ్యక్తి క్షయవ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ అని, అయితే ప్రస్తుతం వైరల్ వ్యాధి కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి తగిన ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కోవిడ్ సంబంధిత ఆంక్షల కారణంగా క్షయవ్యాధి కేసుల సంఖ్య 2020లో సుమారు 25%తగ్గిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల కోవిడ్ బారిన పడిన రోగులలో టీబీ కేసులు అకస్మాత్తుగా పెరిగాయంటూ కొన్ని వార్తా నివేదికలు వచ్చాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతిరోజూ డజనుకు పైగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తున్న వైద్యులలో ఇది ఆందోళన రేకెత్తించిందని తెలిపింది. ‘కోవిడ్ పేషెంట్లకు క్షయ రోగ నిర్ధారణ పరీక్షలు, అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు కోవిడ్ పరీక్షలు సిఫారసు చేసినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. సార్స్ కోవ్ 2 వైరస్ సంక్రమణతో ఒక వ్యక్తి క్రియాశీల టీబీ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది ‘ఇది బ్లాక్ ఫంగస్ వంటి అవకాశవాద సంక్రమణ‘అని పేర్కొంది. కోవిడ్ కారణంగా టీబీ కేసులు పెరిగాయని సూచించడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని తెలిపింది. టీబీ కేసులు, కోవిడ్ కేసులు రెండింటినీ కనుగొనే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్రాలను కోరింది. ‘కోవిడ్ సంబంధిత ఆంక్షల ప్రభావం కారణంగా, 2020లో టీబీ కేస్ నోటిఫికేషన్లు 25 శాతం తగ్గాయి. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ఓపీడీ సెట్టింగుల ద్వారా, కేస్ నిర్ధారణ క్యాంపెయిన్ ద్వారా ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి’అని వివరించింది. -
కరోనా కన్నా టీబీ మరణాలే ఎందుకు ఎక్కువ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్, టీబీ (ట్యూబర్కులోసిస్) సోకిన వారిలో కామన్‌గా కనిపించే లక్షణం దగ్గు. దగ్గు తీవ్రతను బట్టి రోగ తీవ్రతను అంచనా వేయవచ్చు. కాస్త దమ్ము రావడం కూడా కామన్‌గా కనిపించే లక్షణమే. టీబీ రాకుండా నిరోధించేందుకు వ్యాక్సిన్ ఉంది. టీబీని సకాలంలో గుర్తిస్తే నయం చేసేందుకు మందులు ఉన్నాయి. అదే కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. నయం చేసేందుకు సరైన మందు ఇప్పటికి అందుబాటులోకి రాలేదు. దేశంలో టీబీ వల్ల రోజుకు 1200 మంది మరణిస్తుంటే కరోనా వైరస్ వల్ల అందులో సగం మంది కూడా మరణించడం లేదు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు వెయ్యి మందికి పైగా మరణించగా, ఇప్పుడు మరణాల సంఖ్య రోజుకు 500ల దిగువకు పడిపోయింది. అయినా భారతీయులు నేటికి టీబీకి భయపడడం లేదుగానీ కరోనాకు భయపడుతున్నారు. టీబీతో పోలిస్తే కరోనా ఒకరి నుంచి ఒకరి అది వేగంగా విస్తరించడమే భయానికి కారణం కావచ్చు. అయితే కరోనా కట్టడి చేయడంలో తలముక్కలై ఉన్న వైద్యాధికారులు టీబీ రోగులను పూర్తిగా విస్మరించారు. గడచిన ఏడాదిలో పుల్మరో టీబీ (ముందుగా ఊపిరి తిత్తులకు వ్యాపించి అక్కడి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం)తో బాధ పడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ల్యాబ్‌లకుగానీ ఆస్పత్రులకుగానీ వెళ్లలేదు. అందుకు వారికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణం కాగా, వెళ్లిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లోగానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో గానీ టీబీ మందులు దొరకలేదు. టీబీ రోగులకు రెండు, మూడు నెలలకు సరిపోయే మందులను ముందస్తుగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అదీ జరగలేదు. అనేక మంది టీబీ రోగులు కూడా కరోనా కాబోలనుకొని పరీక్షలు చేయించుకొని నెగటివ్ అని తేలగానే ఇంటికి వచ్చారు. కరోనాతోపాటు టీబీ పరీక్షలు నిర్వహించడం కాస్త క్లిష్టమైన విషయం కావడంతో భారత వైద్యులు టీబీ పరీక్షలను పూర్తిగా విస్మరించారు. పర్యవసానంగా వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ టీబీని సకాలంలో గుర్తిస్తే చికిత్సతో సులభంగానే నయం చేయవచ్చు. (చదవండి: ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?) -
టీబీ అండ్ కరోనా
టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో టీబీ వస్తుంది. నావల్ కరోనా వైరస్ వల్ల కోవిడ్–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు... మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది. కరోనా వైరస్ మాత్రం ఊపిరితిత్తులను మాత్రమే గాక కొంతవరకు జీర్ణవ్యవస్థలోని పేగులనూ, చాలా అరుదైన సందర్భాల్లో మెదడునూ ప్రభావితం చేస్తుంది. ఇక టీబీకీ పూర్తి చికిత్స అందుబాటులోఉంది. కరోనాకు ఇంకా లేదు. కానీ లక్షణాలన్నీ ఒకేలా ఉండటంతో కొన్ని సందర్భాల్లో దేహంలో టీబీ ఉన్నప్పటికీ... ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్–19ను తలపించవచ్చు. అందుకే టీబీని గురించి తెలుసుకుంటే... అది చికిత్స ఇంకా అందుబాటులో లేని కోవిడ్–19 కాదనీ... టీబీ కావచ్చని తెలుసుకోవచ్చు. టీబీ, కరోనాల పోలికలూ, తేడాల పట్ల అవగాహన పెంచుకునేందుకే ఈ కథనం. టీబీ ఎలా వ్యాప్తిచెందుతుంది..? టీబీ వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. అప్పటికే టీబీ ఉన్న వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిన సూక్ష్మక్రిమి మొదట ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ పెరగడం మొదలుపెడుతుంది. అలాగే ఈ సూక్ష్మక్రిమి గాలి, వెలుతురు (సరైన వెంటిలేషన్) లేని చోట బాగా పెరుగుతుంది. ధారాళమైన గాలి, వెలుతురు ఉన్న చోట రోగ క్రిమి మనుగడ సాధించలేదు. (అందుకే టీబీకి మంచి మందులు కనుగొనక ముందు టీబీ రోగులను వేరు చేసి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట్ల ఉంచి నయం చేసేవారు. ఆ క్షయ వ్యాధి చికిత్స కేంద్రాలను శానిటోరియమ్స్ అనేవారు). ఇక టీబీ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ తలుపులు మూసి ఉండే ఏసీ గదుల్లో ఉంటే... వారి నుంచి అక్కడ పనిచేసే ఇతరులకూ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కరోనా విషయంలోనూ అంతే. అది కూడా టీబీ లాగే వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడం వల్ల ఈ రోగులు సైతం గాలీ, వెలుతురు బాగా వచ్చే (మంచి వెంటిలేషన్ ఉండే) గదిలో ఒక్కరే (ఐసోలేషన్‌లో) ఉండిపోవాలి. ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ అంటే...? మన సమాజంలో ఉన్న చాలా మందిలో టీబీ సూక్ష్మక్రిమి లోపల ఉంటుంది. కానీ వారిలో రోగలక్షణాలూ ఉండవు. పూర్తిగా ఆరోగ్యవంతుల్లా ఉంటారు. వీళ్ల నుంచి ఆరోగ్యవంతుడికి వ్యాధి వ్యాపించదు. వీళ్లకు టీబీ పరీక్ష నిర్వహించినప్పుడు టీబీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కొందరిలో అనేక కారణాల వల్ల వాళ్లలో సహజంగా ఉండే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. (ఉదా: డయాబెటిస్, మహిళల్లో గర్భధారణ వల్ల, క్యాన్సర్, ట్రాన్స్‌ప్లాంట్ జరిగినప్పుడు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు, ఎస్‌ఎల్‌ఈ లేదా హెచ్ఐవీ సోకడం వంటి కారణాల వల్ల). అలాంటి వారిలో టీబీ క్రిమి మళ్లీ క్రియాశీలం అయి, వ్యాధి బయటపడుతుంది. మన దేశంలోనైతే... ప్రత్యేకంగా వ్యాధి లక్షణాలను బయటపడ్డప్పుడే చికిత్స అవసరం. లక్షణాలు లేకపోతే మందులు అవసరం లేదు. టీబీ నిర్ధారణ... కళ్ల పరీక్ష: దగ్గినప్పుడు పడే తెమడను పరీక్షించడం ద్వారా టీబీ బ్యాసిల్లై (సూక్ష్మక్రిమి) ఉందా లేదా అని పరీక్షించి, నిర్ధారణ చేయవచ్చు. రెండు రోజుల వ్యవధిలో రోగి నుంచి రెండు కళ్లె శాంపిళ్లను సేకరించి పరీక్ష చేసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఛాతీ ఎక్స్‌రే: ఊపిరితిత్తులకు సోకిన టీబీని ఎక్స్–రే ద్వారా గుర్తించవచ్చు. అలాగని కేవలం ఎక్స్–రే ద్వారానే పూర్తి నిర్ధారణ కూడా సాధ్యం కాదు. ∙చర్మం పరీక్ష: టీబీ నిర్ధారణకు చర్మ పరీక్షను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఇది ల్యాటెంట్ టీబీ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే నేషనల్ కాలేజ్ ఆఫ్ ఛెస్ట్ ఫిజీషియన్స్ (ఎన్‌సీసీపీ), ఐసీఎస్ (ఇండియన్ ఛెస్ట్ సొసైటీ) మార్గదర్శకాల మేరకు... లక్షణాలేమీ కనిపించని ల్యాటెంట్ టీబీకి చికిత్స అవసరం లేదు. టీబీ ఇంటర్ఫెరాన్ గామా రిలీజ్ ఎస్సే (ఐజీఆర్ఏఎస్): దీన్ని ఎక్కువగా క్వాంటిఫెరాన్ టీబీ గోల్డ్ టెస్ట్ అని పిలుస్తారు. ఇది సరికొత్త నిర్ధారణ పరీక్ష. దాంతోపాటు చర్మపు పరీక్షకంటే అధునాతనమైనది, కచ్చితమైనది. ఇక ఇది టీబీ సూక్ష్మక్రిమికి మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి ఏ మేరకు స్పందిస్తుందో అన్న విషయాలనూ తెలుపుతుంది. టీబీ సీరలాజికల్ పరీక్షలు: ఇవి రోగి రక్తాన్ని సేకరించి నిర్వహించే పరీక్షలు. కల్చర్ పరీక్ష : టీబీ సూక్ష్మజీవుల పెరుగుదలను పరీక్షించడం వల్ల టీబీ చికిత్స ప్రక్రియను ఎంపిక చేసేకునేందుకు అవకాశం ఉన్న పరీక్ష ఇది. కరోనా పరీక్ష: గొంతులో ఉన్న స్వాబ్స్ సేకరించడం ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేసి వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. టీబీ చికిత్స : టీబీని పూర్తిగా నయం చేయడానికి రోగి క్రమం తప్పకుండా ఫిజీషియన్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. మందుల క్రమం అస్సలు తప్పడానికి వీల్లేదు. కరోనా చికిత్స : ఇప్పటికైతే కరోనా వల్ల వచ్చే కోవిడ్–19కు లక్షణాల ఆధారంగానే చికిత్స ఉంది. రెమ్డిస్విర్, ఫావిపిరావిర్ లాంటి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి మైల్డ్‌గా, మాడరేట్‌గా ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించేవే తప్ప... పూర్తిగా నయం చేసే మందులు కావు. అయితే టీబీకి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకారిగా మారవచ్చు. మృత్యువుకూ దారి తీయవచ్చు. కరోనాకు మందులేకపోయినా... ఒకవేళ మైల్డ్‌గా ఉండి మందులేమీ వాడకపోయినా తగ్గవచ్చు. అందుకే కరోనాకైనా మందులు వాడాల్సిన అవసరం ఉండదేమోగానీ...టీబీకి మాత్రం తప్పక వాడాల్సిందే. దగ్గు, జ్వరంతో వ్యాధిని కల్పించే కారకాల్లో టీబీ... బ్యాక్టీరియా వల్ల; కోవిడ్–19 కరోనా వైరస్ వల్ల వచ్చి... లక్షణాలూ, వ్యాపించే తీరు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ టీబీ – కరోనాల విషయంలో పోలికలూ, తేడాలను గుర్తించి, రెండింటి పట్ల అవగాహన పెంచుకుని, ఇరు వ్యాధుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. వ్యాప్తిలోనూ పోలికే... టీబీ సూక్ష్మక్రిమి సోకినంతనే ఆరోగ్యవంతుడు వ్యాధిబారిన పడడు. అతడిలో రోగ లక్షణాలేమీ బయటపడవు. అలాంటి వారిని ల్యాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఏదైనా కారణం వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధి బయటపడుతుంది. అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు టీబీని పూర్తిగా నయం చేయగల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం... ఆ కాలపరిమితి పొడవునా తప్పనిసరిగా మందులు వాడాలి. అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులోనూ కరోనా వైరస్ సోకగానే అతడికి కోవిడ్–19 రాకపోవచ్చు. అలా లక్షణాలేమీ కనపడకుండానే కొందరిలో తగ్గిపోవచ్చు. సరికొత్త పరిశోధనల ప్రకారం ఇలా లక్షణాలేమీ లేనివారు (ఎసింప్టమ్యాటిక్) కోవిడ్–19ను వ్యాప్తి చేయలేరు. కానీ కొద్దిపాటి లక్షణాలు కనిపించడం ప్రారంభం కాగానే (ప్రి–సింప్టమ్యాటిక్) మాత్రం కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని అధ్యయనాల్లో తేలింది. టీబీ అండ్ కరోనా లక్షణాలలో పోలికలు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు టీబీ క్రిమి పెరగడం ప్రారంభిస్తుంది. అది తనను వృద్ధి చేసుకుంటూ ఉండటంతో రోగలక్షణాలు బయటపడతాయి. ఒకసారి వృద్ధి చెందడం మొదలుపెట్టాక అది వేర్వేరు కణజాలాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేయడం మొదలుపెడితే కొందరిలో ఊపిరితిత్తులకు కన్నం పడే అవకాశం కూడా ఉంది. ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిమి ఉన్నప్పడు... కనిపించే లక్షణాలివి... ∙విపరీతమైన దగ్గు... కనీసం మూడు వారాల పాటు ఎడతెరిపి లేకుండా దగ్గుతుంటే టీబీ కావచ్చని అనుమానించవచ్చు ∙ ఛాతీలో నొప్పి ∙బలహీనంగా ఉండటం, విపరీతమైన నీరసం ∙బరువు గణనీయంగా తగ్గడం ఆకలి లేకపోవడం ∙చలిజ్వరం ∙జ్వరం ప్రధానంగా సాయంత్రాలు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండటం ∙రాత్రివేళల్లో చెమటలు పట్టడం. అయితే అది ఎలాంటి దగ్గు అయినప్పటికీ మూడు వారాల పాటు అదేపనిగా కనిపిస్తే తప్పక టీబీ అని అనుమానించాలి. అయితే జ్వరం అనేది టీబీ, కరోనా... ఈ రెండు జబ్బుల్లో ఉన్నప్పటికీ... కరోనా విషయంలో మాత్రం ఇలా రాత్రిళ్లు చెమటలు పట్టడం, సాయంత్రాలు మాత్రమే ఉష్ణోగ్రత పెరగడం ఉండకపోవచ్చు. -
క్షయను రూపుమాపే కొత్త మందు
పారీస్: మందులకు లొంగకుండా ప్రపంచంలోని అనేక మందిని వేధిస్తున్న క్షయ వ్యాధికి నూతన చికిత్సా విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుత వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందికి క్షయ వ్యాధిని శాశ్వతంగా దూరం చేయవచ్చన్నారు. ప్రస్తుతమున్న చికిత్సా విధానం ద్వారా కేవలం 55 శాతం మందికే క్షయ వ్యాధిని తగ్గించవచ్చు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఈ నూతన విధానం సత్ఫలితాలను అందించినట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న బెలారస్ దేశంలోని డాక్టర్లు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ చికిత్సలో ముఖ్యమైనది బెడాక్విలైన్ ఔషధం. చికిత్సలో భాగంగా 181 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు కొన్ని నెలల పాటు బెడాక్విలైన్ ఔషధంతోపాటు ఇతర యాంటీబయాటిక్స్ కూడా అందించారు. మొత్తం కోర్సును పూర్తిచేసిన 168 మందిలో 144 మంది క్షయ నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. -
పరీక్షలన్నీ నార్మల్... ఛాతీలో సూది గుచ్చినట్లు నొప్పి
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయస్సు 47 ఏళ్లు. బరువ# 72 కిలోలు. ఏడాది కిందట ఛాతిలో నొప్పి వస్తే ఈసీజీ, ఎకో, టీఎంటీ, ఎక్స్‌రే పరీక్షలు చేయించాను. అంతా నార్మల్ అని వచ్చింది. గ్యాస్ట్రబుల్ ఏదైనా ఉందేమోనని ఎండోస్కోపీ, రక్తపరీక్ష, ఎక్స్‌రే చేయించాను. అవి కూడా నార్మలే. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఛాతీలో సూది గుచ్చినట్లుగా చురుక్కువుని నొప్పి వచ్చి కొద్దిసేపు అలాగే ఉంటోంది. గత మూడేళ్లుగా ఈ సమస్య ఉంది. అయితే రిపోర్టుల్లో ఏమీ ఉండటం లేదు. ఏ జబ్బూ లేకపోతే ఎందుకీ లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. భానుప్రసాద్, భీమవరం మీరు కార్డియాక్ వర్కప్, ఎండోస్కోపిక్ వర్కప్ చేయించుకున్నారు కాబట్టి, అవి నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు గుండె సవుస్య, అసిడిటీకి సంబంధించిన సవుస్యలేదనే చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి. అయితే ఇలాంటి నాన్–కార్డియాక్ పెయిన్స్ (గుండెకు సంబంధంలేని నొప్పుల)కు పిత్తాశయంలో రాళ్లు, పాంక్రియాటైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, ఇంటర్‌కాస్టల్ వుయాల్జియా (పక్కటెవుుకల్లో నొప్పి) వంటివి కూడా కారణాలు కావచ్చు. కాబట్టి మీరు మరొకసారి మీ డాక్టర్‌ను కలిసి, మీ సమస్యను విపులంగా చర్చించి, ఇక్కడ పేర్కొన్న వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వారు చికిత్స సూచిస్తారు. నోటి నుంచి రక్తం పడింది... ప్రమాదమా? నాకు 56 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా నుంచి గుండెజబ్బు, డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నాను. హృద్రోగం కోసం చికిత్స కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు చక్కెర వ్యాధి వచ్చింది. వారం క్రితం పరీక్ష చేయించుకుంటే నాకు షుగర్ 340 ఎంజీ/డీఎల్ ఉంది. ఇన్సులిన్ తీసుకుంటున్నా చక్కెర పాళ్లు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. షుగర్ నియంత్రణలో ఉండటం లేదు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఇన్సులిన్ తీసుకోవడం లేదు. ఆ సమయంలో ఒకసారి నోటి నుంచి రక్తం పడింది. ఇలా మూడుసార్లు జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎమ్డీ. గఫూర్బేగ్, గుంటూరు డయాబెటిస్, హృద్రోగం... ఈ రెండూ ఉన్నవాళ్లు ఇన్సులిన్ మొదలుపెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆపాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు కూడా డాక్టర్‌ను సంప్రదించాక మాత్రమే వారి సలహా మేరకు ఆపాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా నోటి నుంచి రక్తం పడటం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు వాడే ఇతర మందులైన యాస్పిరిన్, రక్తాన్ని పలచబార్చే మందుల వంటి వాటి వల్ల కూడా ఇలా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మెడికల్ స్పెషలిస్ట్‌కు చూపించుకోండి. వారి సలహా మేరకు చికిత్స తీసుకోండి. కార్డియో మయోపతి అంటున్నారు... జాగ్రత్తలు ఏమిటి? నా వయసు 63 ఏళ్లు. నాకు కార్డియోవుయోపతి అనే సమస్య ఉందనీ, అయితే దానికి ఆపరేషన్ అవసరం లేదనీ, కాకపోతే జీవితాంతం వుందులు వాడాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నాకు ఏవిధమైన ఇతర రుగ్మతలు, చెడు అలవాట్లు లేవు. నా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? – వేణుగోపాల రావు, నెల్లూరు మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు ఉన్న సమస్య ‘హైపర్‌ట్రాఫిక్ కార్డియోవుయోపతి’ అనిపిస్తోంది. ఇది సాధారణంగా గుండెలోని ఛాంబర్స్ వుందంగా తయారవ్వడం వల్ల వచ్చే సమస్య. ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు వుందులు తప్పనిసరిగా వాడాల్సిందే. వుందులు వాడకపోతే అకస్మాత్తుగా కార్డియాక్ సవుస్య వచ్చి ఒక్కోసారి ప్రాణాలకే ముప్పురావచ్చు లేదా పక్షవాతం వంటి సవుస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది. అందువల్ల క్రవుం తప్పకుండా వుందులు వాడుతూ తరచూ కార్డియాలజిస్ట్ నేతృత్వంలో పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే... మీరు శ్రవు ఎక్కువగా ఉండే ఎక్సర్‌సైజ్‌లను నివారించండి. ఒంటి మీద గడ్డలు... ఎవరిని సంప్రదించాలి? నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా? – డి. ఆనంద్, నిజామాబాద్ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్ ఆంకాలజిస్టును సంప్రదించండి. క్షయ వ్యాధి... తిరగబెట్టే అవకాశం ఉందా? నా వయస్సు 45 ఏళ్లు. మూడేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్ వచ్చింది. ఆర్నెల్ల పాటు చికిత్స తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే అప్పుడు నెగెటివ్ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులుతో తగ్గి, నెగెటివ్ అని వచ్చాక కూడా అది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రవీందర్, సంగారెడ్డి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. వారిలో ఏవైనా ఇతర కారణాల వల్ల (ఉదాహరణకు... డయాబెటిస్, వయసు పైబడటం, హెచ్ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి బాగా తగ్గిపోతే... క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే క్షయ వచ్చి తగ్గిన వారు... మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర వంటి మంచి జీవనశైలి అలవాట్లను అనుసరిస్తుండాలి. అలాగే ఇలాంటివారికి డయాబెటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధి తిరగబెట్టినట్లు మీకు అనుమానం వస్తే ఒకసారి పల్మునాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్ సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
రోగం..వేగం
హెచ్ఐవీ, స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధులతో ఒకరిద్దరు చనిపోతేనే పెద్దగా హడావుడి చేస్తారు. కానీ క్షయ వ్యాధితో ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. చాపకింద నీరులా ఈ వ్యాధి సమాజంలో పాకుతూనే ఉంది. ఈ వ్యాధి ఉన్న మనిషి ఒక్కసారి దగ్గితే కొన్ని లక్షల బ్యాక్టీరియా బయటకు వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిలోకి వెళ్లి వ్యాధిని కలుగజేస్తుంది. ఎదుటి వ్యక్తి బలంగా ఉన్నంత సేపు ఈ వ్యాధి బయటపడదు. ఎప్పుడైతే అతనికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో క్షయ తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ఈ నెల 24వ తేదీన ప్రపంచ క్షయ అవగాహన దినం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్):జిల్లాలో 15 సంవత్సరాలుగా 86,614 మంది టీబీ రోగులు డాట్స్ పద్ధతి ద్వారా మందులు వాడారు. అందులో 67,359 మంది క్షయ వ్యాధి నుంచి విముక్తి పొందారు. 15 ఏళ్ల క్రితం క్షయ వ్యాధికి గురైన వారిలో ప్రతి వంద మందిలో 26 మంది చనిపోయేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం ఆరుకు తగ్గించగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షయ వ్యాధికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని జిల్లా క్షయ నివారణ కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని టీబీ ఆసుపత్రులు, నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్, కోవెలకుంట్ల, గోనెగండ్ల, పత్తికొండ, ఆలూరు, వెలుగోడు, నంద్యాల(గ్రామీణ), బనగానపల్లి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, ఆదోని(గ్రామీణ), ఆళ్లగడ్డలలో టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 54 మైక్రోస్కోప్ సెంటర్లు ఉన్నాయి. మైక్రోస్కోప్ సెంటర్లో వ్యాధి నిర్ధారణ చేసి నివారణకు గాను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. అక్కడి వైద్యులు పరీక్షించి రోగి గ్రామ పరిధిలోని సబ్సెంటర్కు చెందిన ఆరోగ్య కార్యకర్తల ద్వారా డాట్స్ పద్ధతిలో మందులు ఇస్తారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి క్షయ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది పడే వారు చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లలోని వైద్యులను సంప్రదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో వీరు 30 శాతానికి పైగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వీరు ప్రైవేటు వైద్యులు సూచించే ప్రైవేటు మందులను కొని చికిత్సకు వాడుతున్నారు. ప్రస్తుతం ఇలా ప్రైవేటుగా చికిత్స చేయించుకునే వారికి కూడా ప్రభుత్వం మందులు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు వైద్యుల వద్దకు వచ్చే రోగుల వివరాలను తప్పనిసరిగా తమకు అందజేయాలని వైద్యులను అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం 2,500లకు పైగానే ఉంటోంది. విస్తరిస్తున్న ఎండిఆర్ టీబీ మధ్యలో మందులు మానేసి వ్యాధి అదుపులోకి రాకపోతే దానిని ‘మల్టీడ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్‌క్యూలోసిస్ వ్యాధి’(ఎండిఆర్టీబీ)గా గుర్తిస్తారు. వీరి గళ్ల నమూనాలను సేకరించి కర్నూలు మెడికల్ కాలేజి, నంద్యాలలో ఏర్పాటు చేసిన సీబీ న్యాట్ మిషన్ ద్వారా పరీక్షిస్తారు. జిల్లాలో రెండేళ్ల కాలంలో 3వేల మందికి పైగా పరీక్ష చేయగా అందులో 488 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే రెండేళ్ల పాటు రూ.2లక్షల విలువగల మందులను ఉచితంగా అందజేస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్షయ వ్యాధి భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు పుట్టిన వెంటనే పసిబిడ్డలకు బి.సి.జి సూది మందు వేస్తారు. క్షయ వ్యాధి వచ్చిన వారు దగ్గినప్పుడు నోటికి గుడ్డ అడ్డుపెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. వ్యాధి నిర్ధారణ అయ్యాక వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ వైద్యం, మందులు ఆపకూడదు. మందులు వాడే సమయంలో రియాక్షన్ లాంటివి వస్తే భయపడకుండా వైద్యులను సంప్రదించాలి. వ్యాధి వ్యాపించే విధం మైకోబాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా క్షయ వస్తుంది. దీనికి చిన్నా పెద్దా తేడా, లింగబేధం లేదు. పేద, ధనిక అన్న తారతమ్యమూ లేదు. క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో కలిసి వ్యాధినిరోదక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాపిస్తాయి. రెండు వారాలకు మించి ఎడతెరపి లేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, ఛాతిలో నొప్పి రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఉమ్మి(గళ్ల)లో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మేలు. క్రమం తప్పకుండా మందులు వాడాలి క్షయ వ్యాధి ముందుగా భయపెడుతుంది. కానీ దానిని సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే అదుపులోకి వస్తుంది. దాని లక్షణాలు సద్దుమణిగాక మందులు వాడేస్తేనే ఇబ్బంది.అది మరింత శక్తిని పుంజుకుని మనిషిని అమాంతం నేలకూలుస్తుంది. ఈ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజూ వాడే మందులు వచ్చాయి. అలాగే ప్రైవేటుగానూ మందులు లభిస్తున్నాయి. అన్నీ మంచి మందులే. రోగి క్రమం తప్పకుండా వాడటమే ప్రధానం. –డాక్టర్ కె.శివకృష్ణ, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు,ఎన్ఆర్ పేట, కర్నూలు టీబీ రోగికి ప్రతి నెలా రూ.500 కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ఎండ్ టీబీ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులతో పాటు ప్రతి నెలా రూ.500లు ఇచ్చే విధంగా ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాం. –డాక్టర్ శ్రీదేవి, ఇన్చార్జ్ జిల్లా క్షయ నియంత్రణాధికారిణి -
క్షయ.. ప్రభుత్వానికేది దయ
ప్రాణాంతకమైన జబ్బు అంటే.. అప్పటి రోజుల్లో గుండెజబ్బు లేదా క్షయ అని అనేవారు. క్షయ వస్తే.. ఇక చావే అన్నట్లు ఉండేది. అనంతరం క్షయకు చికిత్స వచ్చింది. తర్వాత తర్వాత కేన్సర్ వంటివి వచ్చాయి. దీంతో టీబీ గురించి పెద్దగా వినిపించడం తగ్గింది. అయితే, వ్యాధి ప్రబలడం మాత్రం తగ్గలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. పైగా.. మన దేశంలో 41 శాతం మంది టీబీ రోగులకు సరైన వైద్యం కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా క్షయ బారిన పడుతున్న వారిలో 27 శాతం మంది భారత్‌కు చెందినవారే కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. మొత్తం క్షయ మృతుల్లోనూ 29 శాతం మనవారే.. –సాక్షి, తెలంగాణ డెస్క్ ఏటికేడు క్షయ బారిన పడుతున్న వారు, మృతుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వాలు అశించినంతగా స్పందించడం లేదు. క్షయ వ్యాధి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నది స్వల్పమే. అలాగే వ్యాధి రాకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ పూర్తిగా విఫలమవుతోంది. ఏటా ఎక్కువ మంది ప్రాణాలను బలికొంటున్న వ్యాధుల జాబితాలో క్షయ టాప్–5లో ఉంది. మృతుల్లో 30 నుంచి 69 ఏళ్ల మధ్య వారే ఎక్కువ. -
'క్షయ నిర్మూలనకు బృహత్ ప్రణాళిక'
ధర్మశాల: దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు బృహత్ ప్రణాళికను కేంద్రం రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2025 నాటికి ఈ భయంకరమైన వ్యాధిని తరిమికొట్టాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని, ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికపై కేంద్రం పునఃపరిశీలన చేస్తోందని చెప్పారు. ఈ మేరకు శనివారం ఇక్కడ జరిగిన ‘క్షయ రహిత భారతదేశం’ సదస్సులో ఆయన తెలిపారు. క్షయ సమస్యను అధిగమించేందుకు జాతీయ ప్రణాళికతో రాబోతున్నామని, ప్రస్తుతం దాన్ని పునఃపరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ప్రణాళిక రూపొందించే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే నెలలో దీనిపై సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు. -
వైద్యం.. అందనంత దూరం
► మన్యం ఆస్పత్రులలో నిపుణుల కొరత ► పీహెచ్‌సీల్లోనూ ఇదే దుస్థితి.. ► అత్యవసర కేసులన్నీ కేజీహెచ్‌కే ► వ్యాధులతో ఆదివాసీలు విలవిల పాడేరు: మన్యంలో వైద్యసేవలు మెరుగు పడటం లేదు. మన్యంలో మలేరియా, క్షయ, రక్తహీనత వ్యాధులపై నియంత్రణ కానరావడం లేదు. అనేక వ్యాధులతో గిరిజనులు సతమతమవుతున్నారు. ప్రతి చిన్నదానికి వైద్యసేవల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాల్సిన పరిస్థితి. సకాలంలో వైద్యమందక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. 2011-12 లో పాడేరు, అరకులో నెలకొల్పిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఏళ్ల తరబడి నామమాత్రంగానే ఉన్నాయి. వీటిల్లో నిర్దుష్టంగా సేవలు అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల క్రితం వీటికి కొత్త భవనాలు నిర్మించారు. వైద్యనిపుణులను మాత్రం నియమించ లేదు. రెండింటిలోనూ 15 మంది వైద్యాధికారుల పోస్టులకు సగం మంది కాంట్రాక్టు డాక్టర్లే ఉన్నారు. ఈ ఏరియా ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్, ఆర్థోపెడీషియన్, జనరల్ సర్జన్, అనెస్థిస్ట్, పెథాలజిస్ట్, చిన్నపిల్లల నిపుణుల నియామకం ఊసే లేదు. ప్రధానంగా పిల్లల, స్త్రీ వైద్యనిపుణుల కొరత మూలంగా వైద్యసేవలు అందక మాతా శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయినా చర్యలు లేవు. ఏజెన్సీ ఆస్పత్రులలో గర్భిణులకు పరీక్షలు చేసే స్కానింగ్మిషన్లు కానరావు. అరకు, పాడేరు ఏరియా ఆస్పత్రులతోపాటు చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రులలో ఈ వైద్యనిపుణులను నియమించడం అత్యవసరం. ప్రతీ మండలంలో మూడు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లోనూ సిబ్బంది కొరత ఎక్కువే. ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల సంఖ్య 200 లకు పైనే. ప్రధానంగా 4 డాక్టర్ పోస్టులు, 11 స్టాఫ్ నర్సు పోస్టులు, 9 ఆరోగ్య విస్తరణ అధికారులు, 25 ఫార్మసిస్ట్ పోస్టులు, 50 ఎంపీహెచ్ఏ (మేల్), 59 ఎంపీహెచ్ఏ (ఫిమేల్), 29 (మేల్, ఫిమేల్) హెల్త్ సూపర్వైజర్ పోస్టుల ఖాళీలతో గ్రామాలలో వైద్యసేవలు కుంటుపడ్డాయి. మలేరియా నియంత్రణపై అలక్ష్యం.. మన్యాన్ని ఏటా మలేరియా వణికిస్తోంది. నియంత్రణ చర్యలు కానరావడం లేదు. ఏప్రిల్ 16 నుంచి దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాల్సి ఉన్నా నేటి వరకు మందు సరఫరా కాలేదు. 23 టన్నుల ఏసీఎం మందు పంపిణీ జరగకపోవడంతో పిచికారీ పనులు ప్రారంభంకాలేదు. గిరిజనులకు దోమ తెరల పంపిణీకి కూడా రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏజెన్సీలో మలేరియా తీవ్రత దృష్ట్యా దోమ తెరలు పంపిణీకి అధికారులు ప్రతిపాదించినా నేటికీ ఇవి మన్యానికి చేరలేదు. ఆరోగ్యశాఖ మంత్రికి సమస్యల మాల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం పాడేరు, అరకు మండలాల్లో మంగళవారం పర్యటించనున్నారని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ వై.వేంకటేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించి ఇక్కడ 100 పడకల ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అరకులో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనాలను ప్రారంభించి తిరిగి విశాఖపట్నం చేరుకుంటారన్నారు. మన్యంలో పర్యటిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏజెన్సీలోని వైద్య ఆరోగ్య సేవల దుస్థితిని సమీక్షించి మన్యంలో వైద్యసేవల మెరుగుకు చర్యలు తీసుకోవాలని గిరిజన వర్గాలు, గిరిజన ప్రజలు, వివిధ సంఘాల వారు కోరుతున్నారు. -
అమితాబ్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 'నేనొక ట్యూబర్కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను. 2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు. దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు. -
అమితాబ్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 'నేనొక ట్యూబర్కులోసిస్ (క్షయవ్యాధి) రోగిని. కానీ, సురక్షితంగా భయటపడ్డాను. త్వరలోనే భారత్ పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది' అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అన్నారు. తాను క్షయవ్యాధి బారినపడి బయటపడిని కాబట్టే ఈ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నడుంకట్టానని అన్నారు. త్వరలోనే ప్రపంచ ట్యూబర్కులోసిస్ దినోత్సవం నేపథ్యంలో బచ్చన్ ఈ విషయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 'నువ్వెందుకు ఈ వ్యాధి విషయంలో సేవలు అందిస్తున్నావని నన్ను ఎంతోమంది అడిగారు. కానీ దీని వెనుక ఓ మెడికల్ హిస్టరీ ఉంది. ప్రచారం చేయడానికి కారణమేమిటంటే నేను ఈ వ్యాధి బారినపడి బయటపడ్డాను. 2000లో నాకు టీబీ ఉందని తెలిసింది. దీంతో దాదాపు సంవత్సరంపాటు వైద్య చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంతో ఉన్నాను' అని అమితాబ్ అన్నారు. దీంతోపాటు 'నాకు వెన్నెముకతో సంబంధం ఉన్న టీబీ కావడంతో చాలా అసౌకర్యంగా అనిపించేది. కూర్చోలేకపోయేవాడిని. సరిగా కిందికి నడుంవాల్చలేకపోయేవాడిని. ఆ గేమ్ షో నిర్వహించే సమయంలో రోజుకు ఎనిమిది నుంచి 10 పెయిన్ కిల్లర్స్ వాడేవాడిని. ఇప్పుడు నేను ఈ విషయం బయటకు చెప్పడానికి కారణం ఏమిటంటే.. ఒక వ్యాధి బారినపడి సురక్షితంగా బయటపడటం ఇప్పటికే ఆ వ్యాధితో బాధపడుతున్నవారికి మనోధైర్యాన్నిస్తుంది. నేను పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకొని నా మనుమరాలు ఆరాధ్యతో చక్కగా ఆడుకోగలుగుతున్నాను. త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా అవతరిస్తుంది' అని అమితాబ్ చెప్పారు. -
మన్యంలో మరణాలను అరికట్టండి
{పసవాలపై ప్రత్యేక శ్రద్ధ ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ పాడేరు: ఏజెన్సీలో వివిధ వ్యాధుల వల్ల చోటుచేసుకుంటున్న మరణాల నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ వైద్యాధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఏజెన్సీలోని ఎస్పీహెచ్వోలు, వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికార్లతో సమీక్షించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియాకు తోడు క్షయ కూడా మరణాలకు కారణమవుతోందన్నారు. క్షయ రోగులను గుర్తించిన వెంటనే వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసి చికిత్స అందించే బాధ్యత ఎస్పీహెచ్వోలదేఅన్నారు. ఏజెన్సీలో 589 టీబీ కేసులు ఉన్నాయని, వీటిలో 492 మం దికి పౌష్టికాహారం లేక క్షయ సోకినట్లు గుర్తించినట్టు తెలిపారు.గర్భిణులు అధికశాతం మంది రక్తహీనతకు గురవ్వడం, కాన్పులకు సకాలంలో ఆస్పత్రులకు చేరకపోవడం వల్ల, నెలలు నిండక ముందు ప్రసవం, ఇళ్ల వద్ద ప్రసవాలు వంటి కారణాలతో చోటుచేసుకుంటున్న మరణాలను నియంత్రించాలన్నారు. గిరిజన మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి సంబంధిత పీహెచ్సీ పరిధిలోని వైద్యాధికారి, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు నిర్ణీత సమయానికి మందులు, పౌష్టికాహారం అందించి ప్రసవతేదీకి రెండు రోజుల ముందే ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరణాలు నియంత్రించ వచ్చని సూ చించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేస్తున్న హెల్త్ కాల్‌సెంటర్ పనితీరును పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. కాల్ సెంటర్ టోల్‌ఫ్రీకి1800 4250 0004 నంబ రును కేటాయించినట్లు తెలిపా రు. గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు సకాలంలో అందించడంపై ఎస్పీహెచ్వోలు పర్యవేక్షించాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియాపై దృష్టి సారించాలన్నారు. ఆశ్రమాల్లో బాలికలకు హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సరోజిని మాట్లాడుతూ ఆస్పత్రి కాన్పుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరణాలను నివారించాలన్నారు. జి.మాడుగుల, దారకొండ, తాజంగి పీహెచ్‌సీల పరిధిలో ఇటీవల సంభవించిన 5 బాలింత మరణాలపై సంబంధిత వైద్యాధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, జేడీ అరుణ్‌కుమారి మాట్లాడుతూ ఏఎన్ఎంలు సమర్థంగా విధుల నిర్వహణకు ట్యాబ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వాటి వినియోగంపై 8 నుంచి 11వ తేదీ వరకు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టన్ ఎన్.వసుంధర, డీఎంవో తులసి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయలక్ష్మి, ఎన్ఆర్హెచ్ఎం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దేవి, ఏడీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
పల్మునాలజీ కౌన్సెలింగ్
టీబీ శాశ్వతంగా నయం అవుతుంది మా అమ్మ వయసు 55 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతూ రక్తహీతన (అనీమియా)కు గురైంది. ఇటీవలే పరీక్షలు చేయిస్తే ఆమెకు టీబీ ఉన్నట్లు తెలిసింది. టీబీ శాశ్వతంగా నయమవుతుందా? అలా నయమవ్వాలంటే ఏం చేయాలి? దయచేసి వివరించండి. - మహాలక్ష్మి, కంబం సరైన రీతిలో చికిత్స తీసుకుంటే టీబీ వ్యాధి పూర్తిగా, శాశ్వతంగా నయమవుతుంది. ఇది మైక్రో బ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవి వల్ల సంక్రమించే వ్యాధి. జ్వరం, తెమడ పడుతూ దగ్గురావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టీబీకి ఐసోనియాజిడ్, రిఫామ్పిసిన్, పైరజినమైడ్, ఎథాంబుటాల్ అనే నాలుగు రకాల మందులను కాంబినేషన్స్‌లో ఉపయోగించి చికిత్స చేస్తారు. ఈ మందుల మోతాదును రోగి బరువును పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. పూర్తి చికిత్స కోసం కనీసం ఆర్నెల్లు మందులు వాడాల్సి ఉంటుంది. మొదటి రెండు నెలలను ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు. ఇందులో నాలుగు రకాల మందులనూ ఉపయోగిస్తారు. చివరి నాలుగు నెలలనూ కంటిన్యూయేషన్ ఫేజ్ అంటారు. ఇందులో కేవలం ఐసోనియజిడ్, రిఫామ్పిసిన్ మందులను మాత్రమే వాడతారు. టీబీ చికిత్సలో రోగి ఓపికగా పూర్తికాలం పాటు మందులు వాడి తీరాలి. కొన్నాళ్ల తర్వాత లక్షణాలు తగ్గినట్లు కనపడగానే, తనకు వ్యాధి నయమైనట్లుగా భావించి, మందులను వదిలేస్తే వ్యాధి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అందుకే రోగి మందులు వాడుతూ క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండాలి. చికిత్స సమయంలో రోగి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలామందిలో ఆకలి తగ్గడం, తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగులు బరువు తగ్గుతారు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్ల వంటివి తీసుకోవడం వల్ల రోగులు మెరుగ్గా కోలుకుంటారు. డయబెటిస్ వ్యాధి కూడా టీబీతో బాధపడే రోగులను ప్రభావితం చేసే అంశమవుతుంది. ఎందుకంటే చక్కెరను సక్రమంగా అదుపులో పెట్టుకోని రోగుల్లో వ్యాధి నయం కావడం అంత తేలిక కాదు. ఇక చివరగా టీబీ వచ్చిన రోగులకు తప్పనిసరిగా హెచ్ఐబీ స్క్రీనింగ్ పరీక్ష చేయించాలి. ఎందుకంటే వ్యాధి నిరోధకత తగ్గడం వల్ల చాలామందిలో టీబీ బయటపడుతుంది. వ్యాధి నిరోధకత తగ్గిందంటే అది హెచ్ఐవీ వల్లనా అనేది తెలుసుకొని, ఒకవేళ హెచ్ఐవీని కనుగొంటే దానికి కూడా చికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక మీ అమ్మగారి రక్తహీనత సమస్యకు వస్తే అది క్రమంగా ట్యాబ్లెట్లతో పరిష్కరించవచ్చు. ఒకవేళ ఆమెకు రక్తహీనత చాలా తీవ్రంగా ఉంటే రక్తం ఎక్కించడం అవసరం కావచ్చు. డాక్టర్ ఎం.వి. నాగార్జున పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
గుండెకు క్షయ ముప్పు
* గుర్తించిన కేర్ వైద్యులు * మెడికల్ జర్నల్‌లో డాక్టర్ నరసింహన్ కథనం సాక్షి, హైదరాబాద్: క్షయ అనగానే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా తన రూటు మార్చుకుంది. గుండె వంటి కీలక అవయవాలకూ వ్యాపిస్తోంది. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతోంది. కేర్ ఆసుపత్రి కార్డియాక్ ఎలక్ట్రోల్ ఫిజియాలజీ చీఫ్ డాక్టర్ నరసింహన్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే గుండెకు క్షయ సోకిన 18 మందికి చికిత్స కూడా అందించారు. ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండెకు అరుదుగా సోకే క్షయకుగల కారణాలను ఆయన వివరించారు. సాధారణంగా క్షయ వ్యాధిని తీవ్రమైన దగ్గు, తెమడ వంటి లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా గుండెకు కూడా సోకుతుండడంతో త్వరగా వ్యాధిని గుర్తించలేక ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నారు. దీనిపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్నట్లు, ఇటీవలే ఓ మెడికల్ జర్నల్‌లో తాను రాసిన కథనం కూడా ప్రచురితమైనట్లు డాక్టర్ నరసింహన్ వెల్లడించారు. పరిశోధనల్లో భాగంగా ఈ బ్యాక్టీరియా గుండెలోని మయోకార్డియం కండరానికి ఇన్ఫెక్షన్ కలిగించే విషయం తెలిసిందన్నారు. దీన్ని పరీక్షల ద్వారా గుర్తించి నయం చేయవచ్చన్నారు. అయితే సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ స్వప్న, కేర్ సీనియర్ మేనేజర్ ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నిర్మూలన ఊసేది ?
తెలంగాణలో 41,826 కేసులు నమోదు షుగర్, ఎయిడ్స్, కాలుష్యంతో విజృంభణ మందులకూ లొంగని స్థితికి వ్యాధి సాక్షి, హైదరాబాద్: క్షయవ్యాధి మళ్లీ విస్తరిస్తోంది. దాన్ని నిర్మూలన కార్యక్రమాలు సఫలం కావడంలేదు. ‘టీబీపై 2014 జాతీయ వార్షిక నివేదిక’ ప్రకారం దేశం లో నమోదవుతున్న క్షయ కేసుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. ఉమ్మడిరాష్ట్రంలో 1,03,707 కేసులు నమోదు కాగా, తెలంగాణవి 41,826 కేసులున్నాయి. హైదరాబాద్‌లోనే 6,612 టీబీ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 5,791, మహబూబ్‌నగర్ జిల్లాలో 4,076 కేసులను క్షయవ్యాధిగా గుర్తిం చారు. ప్రపంచవ్యాప్తంగా 80.6 లక్షల మంది క్షయ రోగులుంటే, మనదేశంలో 20.3 లక్షల మంది ఉన్నా రు. అంటే 25 శాతం రోగులు భారతలో ఉన్నారు. షుగర్, ఎయిడ్స్ ఉంటే క్షయ వచ్చే ప్రమాదం... పారిశ్రామికీకరణ, వాతావరణ కాలుష్యం పెరగడంతో క్షయ వ్యాధి కూడా విజృంభిస్తోంది. దీనికి తోడు షుగర్, ఎయిడ్స్ వంటివి ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గి క్షయరావడానికి అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఎయిడ్స్ రోగుల్లో 56 శాతం మందికి క్షయ సోకుతోంది. టీబీ ఉన్న రోగుల్లో 4 శాతం ఎయిడ్స్ రోగులున్నారు. మందులకు లొంగని స్థితికి...: 2006 నుంచి టీబీ మందులకు కూడా లొంగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రుల్లోనూ మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా టీబీ పెరగడానికి ఒక కారణమని కేంద్రప్రభుత్వ నివేదిక పేర్కొంది. పరిశోధనలు జరగాలి ప్రస్తుత మందులకు టీబీ పూర్తిగా తగ్గే అవకాశం లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేర్ ఆసుపత్రి ఊపిరితిత్తులు, శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎ. రఫీ అంటున్నారు. -
కేజీహెచ్‌లో టీబీ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు
ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ వెల్లడి విశాఖ మెడికల్ : క్షయ వ్యాధిని త్వరితగతిన గుర్తించడంలో కీలకపాత్ర వహించే డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ కేంద్రాన్ని కేజీహెచ్‌లో నెలకొల్పినట్టు ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఎన్టీసీపీ చైర్మన్ డాక్టర్ ఎస్వీ కుమార్ తెలిపారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వసుంధర సమన్వకర్తగా, ఛాతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాంబశివరావు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగధిపతి డాక్టర్ దేవీమాధవీ, కేజీహెచ్ పిల్లల విభాగధిపతి పద్మలత, మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.లక్ష్మి, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయబాబు, కేజీహెచ్ డీఎంసీ మెడికల్ ఆఫీసర్ బాలసుందరం సభ్యులుగా ఉన్న జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమ(ఆర్ఎన్టీసీపీ) కోర్ కమిటీ సమావేశం శుక్రవారం మెడికల్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయను ప్రభుత్వం నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించినందున ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయినా ఈ వ్యాధికి చికిత్స అందించి, సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేయాలన్నారు. జనాభాలో రెండు శాతం మందికే టీ బీ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి మరొకరికి సోకడం వల్ల 48 శాతం మందికి వ్యాపిస్తోందని చెప్పారు. ఈ వ్యాధి హెచ్ఐవీ రోగుల్లో పది రెట్లు తొందరగా వ్యాప్తించే అవకాశం ఉందన్నారు. లక్ష మందిలో 203 మందికి టీబీ సోకుతుండగా వీటిలో 140 కేసులు మాత్రమే గుర్తించగలుగుతున్నామన్నారు. దేశంలో 5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్‌ను, లక్ష మందికి ఒక డిజిగ్నేటెడ్ మైక్రోస్కోప్ సెంటర్ (డీఎంసీ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో 63 డీఎంసీ కేంద్రాలున్నాయని, ఆంధ్రా వైద్యకళాశాల, కేజీహెచ్ పరిధిలో ఒక డీఎంసీ సెంటర్ పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రంలో అధునాతన ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. -
మురికివాడల్లో పెరుగుతున్న టీబీ పీడితుల సంఖ్య
పుణే: నగరంలోని మురికివాడలు క్షయవ్యాధికి అడ్డాలుగా మారిపోయాయి. పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) గణాంకాలప్రకారం ఈ ఏడాది నగరంలో మొత్తం 3,683 టీబీ కేసులు నమోదు కాగా అందులో 80 శాతం మంది మురికివాడ వాసులే. వాస్తవానికి 1951లో ఈ నగర జనాభా సంఖ్య ఆరు లక్షలే. ఆ తర్వాత చెన్నై, బెంగళూర్, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలతోపాటు అనేక ప్రాంతాల నుంచి నగరానికి వలసలు మొదలయ్యాయి.దీంతో ప్రస్తుత జనాభా సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. ఉపాధి వేటలో అనేకమంది ఇక్కడికి రావడం ప్రారంభించారు. అయితే ఇలా వలస వచ్చినవారికి గృహవసతి కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యింది. కార ణాలు అనేకం నగరంలోని మురికివాడల్లో టీబీ వ్యాధిపీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంసీ అధికారి ఒకరు చెప్పారు.అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు, జనాభా సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం, మురికివాడల్లో నివసించేవారికి తగినంత గాలి,వెలుతురు అందకపోవడం వల్లనే వారంతా వ్యాధిపీడితులుగా మారిపోతున్నారన్నారు. పట్టణీకరణ శరవేగంగా జరిగిపోవడం కూడా ఇటువంటి దయనీయ పరిస్థితులకు దోహదం చేస్తోందన్నారు. అనారోగ్యం వారికి పట్టదు మురికివాడల్లో నివసించే వారి జీవనస్థితిగతులను రాజకీయ నాయకులు పట్టిం చుకోరని, వారిని తమ ఓటుబ్యాంకుగా మాత్రమే భావిస్తారంటూ సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నగరంలో మురికివాడల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని వివరించారు. -
పాలను వేడి చేయకుండా తాగితే వచ్చే వ్యాధి?
మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో హార్మోన్లను ఉత్పత్తి చేయని భాగం? ఎ) కాలేయం బి) క్లోమం సి) బీజకోశాలు డి) బి, సి 2. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకుంటే వచ్చే వ్యాధి? ఎ) డయాబెటిస్ ఇన్సిపిడిస్ బి) గ్లూకోసేమియా సి) కీటోసిస్ డి) డయాబెటిస్ మెలిటస్ 3. కంటిలో రొడాప్సిన్, ఐడాప్సిన్ అనే పదార్థాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్? ఎ) సి బి) డి సి) ఎ డి) ఇ 4. విటమిన్లతో సంబంధం లేని వ్యాధి? ఎ) గౌట్ బి) క్షయ సి) మశూచి డి) పైవన్నీ 5. కిందివాటిలో పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఎ) క్వాషియార్కర్ బి) మరాస్మస్ సి) జీరాఫ్తాలియా డి) పైవన్నీ 6. అయోడిన్‌తో సంబంధమున్న అంతస్రావ గ్రంథి? ఎ) పీయూష బి) అధివృక్క సి) అవటు డి) క్లోమం 7. ఆల్ఫా, బీటా కణాలను కలిగి ఉన్న భాగం? ఎ) కాలేయం బి) క్లోమం సి) పిత్తాశయం డి) ప్లీహం 8. రక్తంలో ఉండాల్సిన చక్కెర శాతం? ఎ) 70 mg/1ml బి) 160 mg/1ml సి) 120 mg/1ml డి) 200 mg/1ml 9. హైపోథలామస్ శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది? ఎ) గుండె బి) మూత్రపిండాలు సి) మెదడు డి) క్లోమం 10. తల్లి పాలలో ఎక్కువగా లభ్యమయ్యే విటమిన్? ఎ) ఎ బి) సి సి) బి డి) ఇ 11. ఎండు చేపల్లో లభించే విటమిన్? ఎ) డి బి) ఎ సి) ఇ డి) కె 12. విటమిన్-సి అధికంగా దేంట్లో లభ్య మవుతుంది? ఎ) అంబ్లికా బి) సింఖోనా సి) డాకస్ డి) మ్యూసా 13. ఎండుఫలాల్లో ఎక్కువగా లభించే మూలకం? ఎ) ఐ బి) Na సి) K డి) Fe 14. గాయాలను మాన్చడం, విరిగిన ఎముకలను అతికించడంలో తోడ్పడే విటమిన్? ఎ) ఎ బి) సి సి) బి డి) ఇ 15. ‘ఆడమ్స్ ఆపిల్’ అని ఏ గ్రంథిని పేర్కొంటారు? ఎ) అధివృక్క బి) పార్శ్వ అవటు సి) అవటు డి) పాంక్రియాస్ 16. టిటాని వ్యాధితో సంబంధం ఉన్న అంతస్రావ గ్రంథి? ఎ) పారాథైరాయిడ్ బి) థైరాయిడ్ సి) అడ్రినల్ డి) పిట్యూటరీ 17. నాడీవ్యవస్థకు అవసరమైన ూ్చ+ అయాన్ లను నియంత్రించే హార్మోన్ ఏది? ఎ) ప్రొలాక్టిన్ బి) వాసోప్రెస్సిన్ సి) ఆల్డోస్టీరాన్ డి) కార్టిసోల్ 18. మానవుడిలో మరుగుజ్జుతనానికి కారణమైన హార్మోన్ ఏది? ఎ) పారాథైరాక్సిన్ బి) ఆక్సిటోసిన్ సి) వాసోప్రెస్సిన్ డి) థైరాక్సిన్ 19. ఏఐగ వైరస్‌కు మరో పేరేమిటి? ఎ) ఆర్థ్రో వైరస్ బి) పారామిక్సోవైరస్ సి) HTLV-III డి) HTLV-I 20. పాలను వేడి చేయకుండా తాగితే వచ్చే వ్యాధి? ఎ) లెప్రసీ బి) ధనుర్వాతం సి) కోరింతదగ్గు డి) క్షయ 21. ఏ విటమిన్ లోపం వల్ల ‘ఎనుచిసం’ అనే వ్యాధి వస్తుంది? ఎ) ఇ బి) కె సి) ఎ డి) ఏదీకాదు 22. ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి అయినప్పుడు జరిగే మార్పు? ఎ) గ్లూకోజ్ గ్లైకోజన్‌గా మారుతుంది బి) గ్లైకోజన్ గ్లూకోజ్‌గా మారుతుంది సి)గ్లూకోజ్ కార్బోహైడ్రేట్‌గా మారుతుంది డి) ఎ, బి 23. ఢిల్లీ బోయిల్స్ అనే వ్యాధిని వ్యాప్తి చేసేది? ఎ) హౌస్ ఫ్లై బి) సాండ్ ఫ్లై సి) సీ-సీ ఫ్లై డి) పైవన్నీ 24. కిందివాటిలో మధుమేహ దినం (Diabetes Day) ఏది? ఎ) ఆగస్ట్ - 20 బి) డిసెంబర్ - 1 సి) నవంబర్ - 14 డి) మార్చి - 8 25. ప్రపంచ క్షయ దినం? ఎ) మార్చి -14 బి) మార్చి - 24 సి) సెప్టెంబర్ - 20 డి) మే - 5 26. కిందివాటిలో ఏ అవయవం ప్రభావం వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది? ఎ) కాలేయం బి) క్లోమం సి) మూత్రపిండం డి) గుండె 27. డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నదెవరు? ఎ) కోల్ఫ్ బి) రెనలానెక్ సి) రాబర్ట కోచ్ డి) జోల్ 28. కిందివాటిలో ఖీఈ వ్యాధి కానిది? ఎ) గనేరియా బి) సిపిలిస్ సి) క్షయ డి) పైవన్నీ 29. కిందివాటిలో భిన్నమైంది ఏది? ఎ) రింగ్వార్మ బి) రౌండ్వార్మ సి) హుక్వార్మ డి) ఎర్తవార్మ 30. వైరస్ అంటే అర్థమేమిటి? ఎ) స్ఫటికం బి) జీవకణం సి) విషపదార్థం డి) లవణం 31. బ్యాక్టీరియా ప్రతిసారి ఎన్ని పిల్ల కణాలను ఉత్పత్తి చేస్తుంది? ఎ) 4 బి) 2 సి) 16 డి) అనేకం 32. మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో ఎన్ని గంటలు నిల్వ ఉంటుంది? ఎ) 2 బి) 4 సి) 24 డి) 12 33. కిందివాటిలో అంటువ్యాధి కానిది? ఎ) క్షయ బి) గజ్జి సి) ఎయిడ్స డి) పైవన్నీ 34. చలిజ్వరం అని దేన్ని పిలుస్తారు? ఎ) కలరా బి) టైఫాయిడ్ సి) క్షయ డి) మలేరియా 35. తెల్ల రక్తకణాల్లో ఏవి తక్కువ సంఖ్యలో ఉంటాయి? ఎ) బేసోఫిల్స్ బి) న్యూట్రోఫిల్స్ సి) ఎసిడోఫిల్స్ డి) లింఫోసైట్స్ 36. మొదటిసారిగా గుండె మార్పిడి చేసిందెవరు? ఎ) విలియం హార్వే బి) క్రిస్టియన్ బెర్నాల్డ్ సి) డబ్ల్యూజే కాఫ్ డి) పైన పేర్కొన్నవారెవరూ కాదు 37. కీటకాల్లో రక్త సరఫరా ఎన్ని గదుల ద్వారా జరుగుతుంది? ఎ) 16 బి) 13 సి) 4 డి) 2 38. గుండె గదుల సంఖ్యకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది? ఎ) గద్ద -4, ఏనుగు-4, చేప-2, కప్ప-2 బి) ఏనుగు-3, కప్ప-3, చేప-2, గద్ద-4 సి) చేప-2, కప్ప-3, గద్ద-4, ఏనుగు-4 డి) చేప-3, కప్ప-4, గద్ద-3, ఏనుగు-2 39. రక్తవర్గాలను కనుగొన్నదెవరు? ఎ) లాండ్ స్టీనర్ బి) విలియం హార్వే సి) క్రిస్టియన్ బెర్నాల్డ్ డి) కురియన్ 40. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? ఎ) 1900 బి) 1898 సి) 1902 డి) 1934 41. ఏ శిలీంద్రం వల్ల చెరకులో ఎర్రకుళ్లు తెగులు వస్తుంది? ఎ) పిరుక్యులేరియా ఒరెజై బి) స్పెసిలో థీకా సొర్గి సి) కొలిటో ట్రైఖా ఫాల్కేటం డి) ఏక్సీనియా ట్రిటిసి 42. అమీబియాసిస్ (జిగట విరేచనాలు) దేని వల్ల వస్తుంది? ఎ) బ్యాక్టీరియా బి) వైరస్ సి) శిలీంద్రం డి) ప్రోటోజోవా 43. క్యాన్సర్‌ను కలుగజేసే వైరస్? ఎ) ఆంకోజెనిక్ బి) పారామిక్సో సి) వేరియోలా డి) రాబ్డి 44. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి దేన్ని ఉపయోగిస్తారు? ఎ) ఆక్సిన్లు బి) జిబ్బరెలిన్లు సి) సైటోకైనిన్లు డి) ఇథిలిన్ 45. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాక్టీరియా దేని ద్వారా వృద్ధి చెందుతుంది? ఎ) ద్విదావిచ్ఛితి బి) అంతఃసిద్ధబీజాలు సి) సంయోగం డి) పైవన్నీ 46. గుండెలో ముఖ్యమైన కవాటం ఏది? ఎ) మిట్రల్ బి) ట్రైకుస్పిడ్ సి) పెరికార్డియం డి) ఏదీకాదు 47. కపాలనాడుల సంఖ్య? ఎ) 12 బి) 24 సి) 31 డి) 10 48. మానవ రక్తంలో ఎర్రరక్తకణాల ఉపయోగం? ఎ) వ్యాధి నిరోధకత బి) ై2, ఇై2 ల రవాణా సి) రక్తం ఉత్పత్తి డి) హార్మోన్ల రవాణా సమాధానాలు 1) ఎ; 2) డి; 3) సి; 4) డి; 5) డి; 6) సి; 7) బి; 8) సి; 9) సి; 10) ఎ; 11) బి; 12) ఎ; 13) డి; 14) బి; 15) సి; 16) ఎ; 17) సి; 18) డి; 19) సి; 20) డి; 21) ఎ; 22) ఎ; 23) బి; 24) ిసి; 25) బి; 26) ఎ; 27) ఎ; 28) సి; 29) ఎ; 30) సి; 31) బి; 32) బి; 33) సి; 34) డి; 35) ఎ; 36) బి; 37) బి; 38) సి; 39) ఎ; 40) సి; 41) సి; 42) డి; 43) ఎ; 44) బి; 45) బి; 46) ఎ; 47) బి; 48) బి కాంపిటీటివ్ కౌన్సెలింగ్ నేను ఆర్ట్స విద్యార్థిని. పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నాను. బయాలజీలో చదివిన అంశాలను మరచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? - టి.తిరుమలేష్, వికారాబాద్. బయాలజీ పాఠ్యాంశాలను చదవడం సులభమే. కాకపోతే కొన్ని క్లిష్టమైన అంశాలను గుర్తుంచుకోవడం కష్టతరమవుతుంది. సన్నద్ధమయ్యేటప్పుడు ప్రతి అంశాన్ని సాధారణీకరించుకొని చదివితే ఎక్కువకాలం గుర్తుంచుకునే అవకాశముంటుంది. ముందుగా మన చుట్టూ ఉన్న పరిసరాలు, జీవజాలం, మానవుడు, వీటి మధ్య ఉన్న సంబంధాలు, అవసరాలు మొదలైన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిని తెలుసుకొని తదనుగుణంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఉదాహరణకు జీవజాలం అనే అంశాన్ని తీసుకుంటే.. దీనిపై ఏ స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారో గమనించి, వాటికి తగినట్లుగా జీవజాలం పుట్టుక నుంచి జీవపరిణామం వరకు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మొదటగా పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ వరకు ఉన్న జీవశాస్త్ర పాఠ్యపుస్తకాలను చదివి మౌలికాంశాలపై పట్టు సాధించాలి. చదివేటప్పుడే క్లిష్టంగా ఉన్న అంశాలను నోట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సంఖ్యా సంబంధ అంశాలను ఏదో ఒక అంశంతో పోల్చుకొని గుర్తుంచుకుంటే మరచిపోవడానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకు వరిలో క్రోమోజోముల సంఖ్య ఎంత? అంటే దీనికి సమాధానం 24. రోజూ మనం ఎక్కువగా అన్నం (వరి)ను ఆహారంగా తీసుకుంటాం. రోజుకు 24 గంటలు. దీని ఆధారంగా వరిలోని క్రోమోజోముల సంఖ్య 24 అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలను స్వతహాగా కొన్ని వందల సంఖ్యలో గుర్తుంచుకోవాలి. అప్పుడు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సులభంగా సమాధానం గుర్తించవచ్చు. - తాటికొండ సుధాకర్‌రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
సౌందర్యానికి మోకరిల్లినవాడు
కొన్ని పేర్లు మరింత మృదువుగా తోచడానికి కారణం, అవి నిజంగానే సుతిమెత్తగా ధ్వనించడమా? లేక, వాళ్ల జీవితం కొంతైనా తెలిశాక, కరిగిపోయిన మనలోపలి గరుకుదనం కారణమా? జాన్ కీట్స్‌ను తడుముతూవుంటే ‘పూర్ణంగా వికసించిన గులాబిపువ్వు’ను చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంది. ‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్. అందమైనది ఎప్పటికీ ఆనందమైనదే. దాని మనోహరత్వం పెరుగుతూనేవుంటుంది; అది ఎన్నటికీ శూన్యంలోకి గతించదు’. రొమాంటిక్ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కీట్స్. అతడు సౌందర్యాన్ని ‘కంటితో’ ఎంతగా ‘తాగే’వాడంటే, తనకే ‘తెలియని వివశత్వంతో’ తల తూగిపోయేది. ‘సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం; ఇది తెలిస్తే ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు,’ అన్నాడు. పూబాలకుడి లాంటి కీట్స్ జీవితంలో ఎదలోకి దిగిన ముళ్లు కూడా ఉన్నాయి. అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. సాహిత్య వాసన లేని కుటుంబం. కీట్స్‌కు పదేళ్లున్నప్పుడు తండ్రి గుర్రం మీంచి పడి చనిపోయాడు. మూడు నెలలకే తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముడితోపాటు కీట్స్ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆమె దగ్గర ఆస్తిలేదు. ఉన్నది తగాదాల్లో ఉంది. అందువల్ల బంధువులు లేరు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన కీట్స్- మనుషులతో గొడవ పడేవాడు, కానీ పుస్తకాలతో స్నేహం చేసేవాడు. షేక్స్పియర్ ఎందుకు అంత గొప్పవాడయ్యాడో చాలా త్వరగా తెలుసుకున్నాడు. సర్జన్ కావాలని ఉండేది. కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. ఒకవైపు పాఠం జరుగుతుంటే, గదిలో పరుచుకునే సూర్యకిరణాలవెంట ఊర్ధ్వలోకాల్లోకి ఎగిరిపోయేవాడు. తనలాంటివాడు శస్త్రచికిత్సలు చేయలేడని గ్రహించాడు. ఆలోచనలకన్నా సంవేదనలతో కూడిన జీవితాన్ని కోరుకున్నాడు. ‘ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు/ తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను/ అక్షరరూపంలో పుస్తకాలలోకి’ అనువదించబూనుకున్నాడు. ‘కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది’ అన్నాడు. ‘మూఢులకు తమవైన స్వప్నాలుంటాయి; అందుకే వాళ్లు స్వర్గాన్ని (కూడా) ఒక వర్గం కోసమే నేస్తూవుంటారు’ అన్నాడు. అయితే, లండన్ పత్రికల్లో వచ్చిన సమీక్షలు అతడి మనసును గాయపరిచాయి. ఆ పరిస్థితుల్లో అతడికి పెద్ద ఊరట ఫానీ బ్రాన్. ‘కవిత్వపు రెక్కల’ మీద ఆమె దగ్గర వాలేవాడు. ‘దేహం చాలనంతగా’ ప్రేమించేవాడు. ‘ప్రేమ నా మతం. దానికోసం ప్రాణమైనా ఇస్తా’ అనేవాడు. కానీ ప్రాణాన్ని బలి కోరడానికి ప్రేమకేం పని? ఆ కర్కశ కార్యాన్ని మృత్యువు తలకెత్తుకుంది. క్షయవ్యాధి రూపంలో కీట్స్‌ను వెంటాడింది. ఏ ‘తియ్యటి పాపం’ చేయనివ్వకుండానే పూర్తిగా ఆక్రమించుకుంది. అదే క్షయతో తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తన వంతా? చలి, దగ్గు బాధిస్తున్నాయి. అనారోగ్యంతో పేదఖైదీలాగా బందీ అయ్యాడు. దుప్పటిమీద కక్కుకున్న రక్తపు చుక్కలు కాలుడు పంపిన హెచ్చరికల్లా తోస్తున్నాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా? (మరో జీవితం) ఉండేవుండాలి, (లేదంటే) ఇలాంటి యాతనల్ని భరించడం కోసమే మనం సృష్టించబడివుండం’. మద్యం ఆర్చేది కాదు, నల్లమందు తీర్చేదికాదు, ‘వృద్ధ దాదిలాంటి కాలం’ కూడా ఏ పరిష్కారమూ చూపించలేదు. అందుకే, నెగెటివ్ కేపబిలిటీ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు కీట్స్. అనిశ్చితాలు, ద్వంద్వాలు, మర్మాలు, సందేహాలు ఎన్ని చుట్టుముట్టినా భరించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘పోనివ్వని నిద్రలా మోపిన మృత్యువు బరువును’ ఓర్చుకున్నాడు. వీలైనంత త్వరగా మరణాన్ని తన్నుకుపోవడానికి ఆకాశంలోని గద్దలా కాచుకుని పడుకున్నాడు. ‘నేను త్వరగా నిశ్శబ్దపు సమాధిలోకి ఒరిగిపోవాలి... ఆ నెమ్మదైన సమాధికి దేవుడికి ధన్యవాదాలు... ఓ! నా మీద పరుచుకుంటున్న చల్లటి మట్టిని అనుభూతిస్తున్నాను... నా మీద డైసీ పువ్వులు పెరుగుతున్నాయి’. తన సమాధి ఫలకం మీద కీట్స్ ఇలా రాయాలని కోరుకున్నాడు: ‘ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి మీద రాసిన రాత’. పాతికేళ్ల వయసులో(1795-1821) కీట్స్ శాశ్వతనిద్రలోకి జారుకున్న నేలలో పూసిన పూల గంధం విశ్వాన్ని చుట్టింది. ఆ సువాసనలను పీల్చినవాళ్లే భావకవులైనారు. ‘ఏడవకు, కళ్లు తుడుచుకో, ఈ పూవు మళ్లీ వచ్చే ఏడు పూస్తుంది’. - ఆర్.ఆర్. -
నిర్ల‘క్షయం పై పీఓ సీరియస్
ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న లోపాలు అనుబంధ ఆహారానికి నిర్ణయం మన్యంలో 500 మంది రోగులకు మేలు కొయ్యూరు: మన్యంలో మలేరియా తగ్గుము ఖం పట్టినా క్షయ మాత్రం అదుపులోకి రావ డం లేదు. దీనిపై దృష్టి సారించిన ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పీహెచ్సీ తనిఖీల్లో ను క్షయపై వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని చూ స్తున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని హె చ్చరిస్తున్నారు. మన్యంలో 500 మందికి పైగా ఉన్న క్షయ రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. క్షయపై సరైన పర్యవేక్షణ లేక చాలా మంది సకాలంలో గుర్తింపునకు నోచక వ్యాధి ముదిరి మరణిస్తున్నారు. మొదటి పరీక్ష అనంతరం మందులిస్తారు. రెండు నెల ల తరువాత రెండోసారి ఉ మ్ము పరీక్షను చేయాలి. కా నీ ఒకసారి మందులిచ్చాక రోగు లు ఏమవుతున్నారో, వారి ఆరోగ్యం ఎలా ఉందో ప ర్యవేక్షించే వారు కరవయ్యారు. కొందరికి సరైన అవగాహన లేక మందులు వాడుతూ సారా తాగి చని పోతున్నారు. రోగి ని ఆస్పత్రికి తీసుకువచ్చే బాధ్యత క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశ వర్కర్లదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి ఈ విషయం ఆశ వర్కర్లకు కూడా పూర్తిగా తెలియదు. క్షయను నయం చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా ఉం టున్నారని పీవో తనిఖీల్లో తేటతెల్లమవుతోం ది. సరైన రికార్డులు లేకపోవడం, మందులు ఒక పద్ధతి లో ఇవ్వకపోవడం బయట పడ్డాయి. పీవో వైఖరిని గమనిం చిన నర్సీపట్నం క్లస్టర్ ఎస్పీహెచ్వో గురువా రం తన పరిధిలో వైద్యులతో సమావేశం ఏర్పా టు చేశారు. అనుబంధ ఆహారం ఇస్తాం: పీవో క్షయ రోగులకు అనుబంధ ఆహారం ఇస్తామని ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ తెలిపారు. దీనిలో భాగంగానే క్షయ రోగులపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. ఆస్పత్రుల్లో వారిపై నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రికార్డులు సరిగా నిర్వహించకపోయినా, మందులు సరిగా ఇవ్వకపోయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
క్షయను పారదోలుదాం
గజ్వేల్: క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరుభా హెల్త్ప్రాజెక్ట్ చేపట్టనున్న టీబీ నివారణ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, దేశంలో క్షయ వ్యాధి వ్యాప్తి ఆందోళన క లిగించే విధంగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల న్నారు. దేశంలో నిమిషానికో టీబీ రోగి చనిపోతున్నారన్నారు. స క్రమంగా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. చికిత్సపై అవగాహన లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లో క్షయ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంకల్పించిన వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, టీబీ నియంత్రణ బోర్డు డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు, జిల్లా వైద్యాధికారిణి పద్మ, వరల్డ్ విజన్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జోబ్రెడ్డి, క్యాలిటీ మేనేజర్ జెస్సీ మధుకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, జగదేవ్‌పూర్, ములుగు జెడ్పీటీసీలు రాంచంద్రం, సింగం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఫొటో లేకపోవటంపై నేతల ఆగ్రహం వరల్డ్ విజన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోని సభా వేదికపై సీఎం కేసీఆర్ ఫొటో లేకపోవటంతో టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి తదితరులు వేదిక వద్దకు దూసుకెళ్లి నిర్వాహకులను నిలదీశారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలేకుండా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్య కలుగజేసుకొని నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. దీంతో నిర్వాహకులు జోబ్రెడ్డి సభాముఖంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. డెలివరీలు చేస్తలేరు... చిన్న గాయాలకూ పట్నం పంపుతుండ్రు అంతకుముందు గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యకు రోగులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ‘‘గజ్వేల్ ఆస్పటల్లా సరిగా వైద్యం చేస్తలేరు. చిన్న, చిన్న గాయాలకు పట్నంకు రాస్తుండ్రు. పైసల్లేని పేదోళ్లు ఈడికి డెలివరీలకు వస్తే సిద్దిపేటకు పోమ్ముంట్రుండ్రు. సీఎం కేసీఆర్ ఇలాకా ఇది. అస్పటల్ను బాగుచేయాలే’’ అని గజ్వేల్ మండలం శేర్పల్లి గ్రామానికి చెందిన చంద్రాగౌడ్ డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్యకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న ఈ కమ్యునిటీ ఆస్పత్రిని 100 పడకలుగా (ఏరియా) అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆస్పత్రిలోని పలువార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టెతస్కోప్ చేతబట్టి రోగులను పరీక్షించారు. పలువురు రోగులకు బీపీని పరీక్షించించి తగు సూచనలు చేశారు. -
వైద్య,ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు చేరాలి
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అన్ని గ్రామాలలోను ప్రత్యేక వైద్యశిబిరాలు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు: ఏజన్సీలోని ఎపిడమిక్ సీజన్‌ను సమర్ధంగా ఎదుర్కోవాలని, గిరిజనులకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు, వైద్యఅధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారులంతా ఎపిడమిక్ సీజన్ ముగిసేంత వరకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అనుక్షణం సమీక్షించాలని ఈ సందర్భంగా పీవో ఆదేశించారు. మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు, క్షయవ్యాధి నివారణకు చేపడుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలకు చేరాలని సూచించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యాధికారి, ఇతర సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు ఉండాలని, ఎస్పీహెచ్ఓలు కూడా ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యసిబ్బంది పనితీరును సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలతో గిరిజనులు మృతి చెందినా సంబంధిత వైద్యసిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. మరణాలకు సంబంధించి రోజువారీ నివేదికను తమకు అందజేయాలన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 4 లక్షల మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని తద్వారా పారిశుధ్యం, తాగునీటి వనరుల క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పాడేరు ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికాార్జునరెడ్డి, ఈఈ ఎంఆర్జీ నాయుడు, పీహెచ్ఓ చిట్టిబాబు, పీఏఓ భాగ్యలక్ష్మి, డీఎంఓ ప్రసాదరావు, ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్ని క్లష్టర్ల ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
‘వేయి’ కళ్లతో..
ఆదిలాబాద్ : బీడీ కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో చాలీ చాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడితే రూ.100 గిట్టడం లేదు. బతుకుమాటేమో గానీ తంబాకు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక బీడీ కార్మికులు రోజు 1000 బీడీలు చుడితే వచ్చేది రూ.143. అందులో పీఎఫ్ కటింగ్ పోనూ రూ.130 చేతికి అందుతాయి. పనిచేసిన రోజుకే కూలీ. లేనిపక్షంలో పస్తులుండాల్సిందే. దీంతో రోజు 1000 బీడీలు చుట్టేందుకు మహిళలు పడే శ్రమ అంతాఇంతా కాదు. కొంతమంది 500 బీడీలు, లేనిపక్షంలో అంతకంటే తక్కువే చుట్టి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. చేయూత అంతంతే.. జిల్లాలో 69,221 మంది బీడీ కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్, భైంసా, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 14 కంపెనీలు బీడీలు కొనుగోలు చేస్తున్నాయి. 1,321 మంది కమీషన్ ఏజెంట్ల ద్వారా బీడీ కార్మికులు ఆయా కంపెనీలకు తాము చుట్టిన బీడీలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేయూత కూడా అంతంతే. కార్మిక శాఖలో బీడీ కార్మికులు పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా చేయూత ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా కేవలం 3 వేల మంది కార్మికులకు మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నట్లు కార్మిక శాఖ అధికారులు వెళ్లడిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమ ఓర్చి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదన్న ఆవేదన మహిళ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ఉండేందుకు ఇల్లు లేదని, పిల్లలను చదివిద్దామన్నా స్కాలర్షిప్లు వంటివి అందడం లేదని, అనారోగ్యం పాలైతే మెడిక్లేయిమ్ వంటి సదుపాయాలు కూడా లేవని వారిలో నిరాశ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా వారికి వైద్య చికిత్సలు అందాల్సి ఉన్నప్పటికి సరైన అవగాహన లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్‌లో ఈ ఆస్పత్రి ఉంది. పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లను అందజేయాలి. అయితే కార్మికుల పీఎఫ్‌లో జమ అయిన డబ్బుల ఆధారంగా ఈ చెల్లింపులు జరుపుతారు. ఆ లెక్కన వారికి దక్కేది అరకొరే. దానిపై కూడా కార్మికులకు అవగాహన లేదు. వీటి పరంగా నూతన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ భృతిపై ఆశ.. ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ బతుకులు వెళ్లదీస్తున్న తమకు రూ.1000 గౌరవ భృతి కల్పిస్తామన్న టీఆర్ఎస్ సర్కారు ప్రకటన కొంత ఆశ గొలుపుతోంది. జిల్లాలో 69,221 మంది కార్మికులు ఉండగా, గౌరవ భృతి అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై సుమారు ప్రతినెల రూ.7 కోట్ల భారం పడుతుంది. అయితే ఇప్పటివరకు గౌరవ భృతికి సంబంధించి ప్రభుత్వ శాఖలకు విధివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రస్తుతం బీడీలు చుడుతున్న కార్మికులకే ఈ భృతి అందజేస్తారా, లేనిపక్షంలో బీడీలు చుడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇస్తారా అనే విషయంలోనూ సంశయనం వారిలో వ్యక్తమవుతోంది.