గజ్వేల్: క్షయవ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ఉద్యమ స్థాయిలో ప్రయత్నం జరగాల్సిన అవసరముందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ టి.రాజయ్య అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆరుభా హెల్త్‌ప్రాజెక్ట్ చేపట్టనున్న టీబీ నివారణ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, దేశంలో క్షయ వ్యాధి వ్యాప్తి ఆందోళన క లిగించే విధంగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల న్నారు. దేశంలో నిమిషానికో టీబీ రోగి చనిపోతున్నారన్నారు. స క్రమంగా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చన్నారు. చికిత్సపై అవగాహన లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు జిల్లాల్లో క్షయ నివారణ కార్యక్రమాన్ని చేపట్టడానికి సంకల్పించిన వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు, టీబీ నియంత్రణ బోర్డు డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు, జిల్లా వైద్యాధికారిణి పద్మ, వరల్డ్ విజన్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జోబ్‌రెడ్డి, క్యాలిటీ మేనేజర్ జెస్సీ మధుకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, వైస్ చైర్మన్ దుంబాల అరుణ, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ చార్జి భూంరెడ్డి, గజ్వేల్ ఎంపీపీ చిన్నమల్లయ్య, జగదేవ్‌పూర్, ములుగు జెడ్పీటీసీలు రాంచంద్రం, సింగం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ఫొటో లేకపోవటంపై నేతల ఆగ్రహం
వరల్డ్ విజన్ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోని సభా వేదికపై సీఎం కేసీఆర్ ఫొటో లేకపోవటంతో టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి తదితరులు వేదిక వద్దకు దూసుకెళ్లి నిర్వాహకులను నిలదీశారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలేకుండా కార్యక్రమాన్ని ఎలా చేపడతారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్య కలుగజేసుకొని నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. దీంతో నిర్వాహకులు జోబ్‌రెడ్డి సభాముఖంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
డెలివరీలు చేస్తలేరు... చిన్న గాయాలకూ పట్నం పంపుతుండ్రు
అంతకుముందు గజ్వేల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్యకు రోగులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ‘‘గజ్వేల్ ఆస్పటల్లా సరిగా వైద్యం చేస్తలేరు. చిన్న, చిన్న గాయాలకు పట్నంకు రాస్తుండ్రు. పైసల్లేని పేదోళ్లు ఈడికి డెలివరీలకు వస్తే సిద్దిపేటకు పోమ్ముంట్రుండ్రు. సీఎం కేసీఆర్ ఇలాకా ఇది. అస్పటల్‌ను బాగుచేయాలే’’ అని గజ్వేల్ మండలం శేర్‌పల్లి గ్రామానికి చెందిన చంద్రాగౌడ్ డిప్యూటీ సీఎం డాక్టర్ టీ.రాజయ్యకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని వెల్లడించారు. ప్రస్తుతం 50 పడకలుగా ఉన్న ఈ కమ్యునిటీ ఆస్పత్రిని 100 పడకలుగా (ఏరియా) అప్‌గ్రేడ్ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం ఆస్పత్రిలోని పలువార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టెతస్కోప్ చేతబట్టి రోగులను పరీక్షించారు. పలువురు రోగులకు బీపీని పరీక్షించించి తగు సూచనలు చేశారు.
క్షయను పారదోలుదాం
Published Wed, Aug 6 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement