గుండెకు క్షయ ముప్పు
* గుర్తించిన కేర్ వైద్యులు
* మెడికల్ జర్నల్‌లో డాక్టర్ నరసింహన్ కథనం
సాక్షి, హైదరాబాద్: క్షయ అనగానే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా తన రూటు మార్చుకుంది. గుండె వంటి కీలక అవయవాలకూ వ్యాపిస్తోంది. సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతోంది. కేర్ ఆసుపత్రి కార్డియాక్ ఎలక్ట్రోల్ ఫిజియాలజీ చీఫ్ డాక్టర్ నరసింహన్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించారు. ఇప్పటికే గుండెకు క్షయ సోకిన 18 మందికి చికిత్స కూడా అందించారు.
ఈ నేపథ్యంలో కేర్ ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుండెకు అరుదుగా సోకే క్షయకుగల కారణాలను ఆయన వివరించారు. సాధారణంగా క్షయ వ్యాధిని తీవ్రమైన దగ్గు, తెమడ వంటి లక్షణాలతో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చన్నారు. అయితే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా గుండెకు కూడా సోకుతుండడంతో త్వరగా వ్యాధిని గుర్తించలేక ప్రమాదకరంగా పరిణమిస్తోందన్నారు. దీనిపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్నట్లు, ఇటీవలే ఓ మెడికల్ జర్నల్‌లో తాను రాసిన కథనం కూడా ప్రచురితమైనట్లు డాక్టర్ నరసింహన్ వెల్లడించారు. పరిశోధనల్లో భాగంగా ఈ బ్యాక్టీరియా గుండెలోని మయోకార్డియం కండరానికి ఇన్ఫెక్షన్ కలిగించే విషయం తెలిసిందన్నారు. దీన్ని పరీక్షల ద్వారా గుర్తించి నయం చేయవచ్చన్నారు. అయితే సకాలంలో గుర్తించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ స్వప్న, కేర్ సీనియర్ మేనేజర్ ఎం.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.