లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్షయ నివారించదగిన వ్యాధే. సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వాస్తవంగా 2023 నాటికే క్షయ రహిత సమాజం నిర్మాణం కావాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ, క్షయ వ్యాధి గ్రస్తులు చికిత్స పొందడంలో అలసత్వం వహించడంతో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘నేను క్షయను నివారించగలను’ అనే నినాదంతో వ్యాధిపై ఈ ఏడాది అవగాహన కలిగిస్తున్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు.
వ్యాప్తి ఇలా....
క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చే వ్యాధి కారక మైక్రో బ్యాక్టీరియా ఇతరులలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు మందులు ప్రారంభించిన రెండు వారాల తర్వాత అతని నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు.
లక్షణాలివే..
రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.
నియంత్రణ సాధ్యమే..
క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌టీఈపీ)లో భాగంగా రోగులకు ఉచితంగా మందులు అందచేస్తోంది. క్షయ రోగులు చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ రెండు గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుడు, గోరు చిక్కుడు, నాన్‌వెజ్‌కి సంబంధించి కైమా వంటివి తీసుకుంటే మంచిది. క్షయకు చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 500లు ఇస్తోంది.
నివారించదగిన వ్యాధే
క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చు. ప్రభుత్వం మంచి మందులు సరఫరా చేస్తోంది. కొందరు రెండు, మూడు నెలలు మందులు వాడి మానేయడంతో మొండి క్షయగా రూపాంతరం చెందుతోంది. ప్రతిరోజూ పల్మనాలజీ ఓపీకి 20 నుంచి 30 మంది క్షయ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే తీసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. – డాక్టర్ కె.శిరీష, పల్మనాలజిస్టు, జీజీహెచ్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment