న్యూఢిల్లీ: టీబీగా పిలిచే ట్యూబర్‌క్యులోసిస్ (క్షయ) నివారణకు దేశవ్యాప్తంగా ఉచితంగానే చికిత్స పొందే పరిస్థితి ఉన్నప్పటికీ కొందరు ఈ కేంద్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా హెచ్‌ఐవీ సోకిన రోగులకు టీబీ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉన్నా టీబీ పరీక్షలు చేసుకునేందుకు టీబీ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు కొనితెచ్చుకుంటున్నారు.
వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని నగరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీబీ విభాగం డెరైక్టర్ జనరల్ ఆర్‌ఎస్ గుప్తా మాట్లాడుతూ... ‘హెచ్‌ఐవీ సోకినవారికి టీబీ సంక్రమించే అవకాశం చాలా ఎక్కువ. అయితే హెచ్‌ఐవీ సోకినవారు, టీబీ సోకినవారు వైద్య కేంద్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఎక్కడ తమ వ్యాధి గురించి ఇతరులకు తెలిసిపోతుందోనన్న భయంతో నివారణ కేంద్రాలకు వెళ్లకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
హెచ్‌ఐవీ సోకినవారికి సరైన చికిత్స అందకపోతే మరణించే అవకాశం కాస్త ఆలస్యంగా ఉన్నా అదే వ్యక్తికి టీబీ ఉంటే చాలా త్వరగా మృత్యువు ఒడిలోకి చేరుతారు. టీబీ వ్యాధి ఉండి, హెచ్‌ఐవీ సోకినవారికి సరైన మందులు అందకపోతే 50-60 శాతం మరణించే అవకాశం ఉంద’న్నారు. హెచ్‌ఐవీ సోకినవారికి రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉన్నందున టీబీ పరీక్షను కూడా జరిపించుకోవాలని, సోకినట్లు తేలితే వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు.
మృత్యువాత పడుతున్న హెచ్‌ఐవీ రోగుల్లో 25 శాతం మంది టీబీ కారణంగానే మరణిస్తున్నట్లు చెప్పారు. దేశంలో దాదాపు 21 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు ఉన్నారని చెప్పారు. బరువు తగ్గినట్లు అనిపించినా, రాత్రి సమయంలో చెమటలు పడుతున్నా, మూడు వారాలకు మించి దగ్గు ఉన్నా హెచ్‌ఐవీ రోగులు వెంటనే టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
అయితే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న టీబీ కేంద్రాలు కూడా రోగుల పట్ల సమస్యగా మారాయన్నారు. ‘పాలసీ అండ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అలయెన్స్’ డెరైక్టర్ సోనాల్ మెహతా మాట్లాడుతూ... ప్రజలకు హెచ్‌ఐవీతోపాటు టీబీపై కూడా అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.
ముఖ్యంగా హెచ్‌ఐవీ రోగులకు టీబీపై సరైన అవగాహన కల్పించి, చికిత్సా కేంద్రాలకు వెళ్లేలా చే యాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హెచ్‌ఐవీ రోగులు నెలలో కనీసం ఒక్కసారైనా టీబీ పరీక్ష చేయించుకుంటే మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎయిమ్స్ వద్ద విద్యార్థుల మానవహారం క్షయ(టీబీ)పై అవగాహన కల్పించేందుకు వందలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు.
వరల్డ్ టీబీ డేను పురస్కరించుకొని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన మానవహారంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిమ్స్ డెరైక్టర్ మిశ్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీబీ పరీక్షలకు జంకుతున్న హెచ్‌ఐవీ రోగులు
Published Mon, Mar 24 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement