వైద్యం.. అందనంత దూరం
► మన్యం ఆస్పత్రులలో నిపుణుల కొరత
► పీహెచ్‌సీల్లోనూ ఇదే దుస్థితి..
► అత్యవసర కేసులన్నీ కేజీహెచ్‌కే
► వ్యాధులతో ఆదివాసీలు విలవిల
పాడేరు: మన్యంలో వైద్యసేవలు మెరుగు పడటం లేదు. మన్యంలో మలేరియా, క్షయ, రక్తహీనత వ్యాధులపై నియంత్రణ కానరావడం లేదు. అనేక వ్యాధులతో గిరిజనులు సతమతమవుతున్నారు. ప్రతి చిన్నదానికి వైద్యసేవల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాల్సిన పరిస్థితి. సకాలంలో వైద్యమందక గిరిజనులు మృత్యువాత పడుతున్నారు. 2011-12 లో పాడేరు, అరకులో నెలకొల్పిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు ఏళ్ల తరబడి నామమాత్రంగానే ఉన్నాయి. వీటిల్లో నిర్దుష్టంగా సేవలు అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల క్రితం వీటికి కొత్త భవనాలు నిర్మించారు. వైద్యనిపుణులను మాత్రం నియమించ లేదు.
రెండింటిలోనూ 15 మంది వైద్యాధికారుల పోస్టులకు సగం మంది కాంట్రాక్టు డాక్టర్లే ఉన్నారు. ఈ ఏరియా ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్, ఆర్థోపెడీషియన్, జనరల్ సర్జన్, అనెస్థిస్ట్, పెథాలజిస్ట్, చిన్నపిల్లల నిపుణుల నియామకం ఊసే లేదు. ప్రధానంగా పిల్లల, స్త్రీ వైద్యనిపుణుల కొరత మూలంగా వైద్యసేవలు అందక మాతా శిశు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అయినా చర్యలు లేవు. ఏజెన్సీ ఆస్పత్రులలో గర్భిణులకు పరీక్షలు చేసే స్కానింగ్‌మిషన్లు కానరావు. అరకు, పాడేరు ఏరియా ఆస్పత్రులతోపాటు చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రులలో ఈ వైద్యనిపుణులను నియమించడం అత్యవసరం. ప్రతీ మండలంలో మూడు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లోనూ సిబ్బంది కొరత ఎక్కువే. ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల సంఖ్య 200 లకు పైనే.
ప్రధానంగా 4 డాక్టర్ పోస్టులు, 11 స్టాఫ్ నర్సు పోస్టులు, 9 ఆరోగ్య విస్తరణ అధికారులు, 25 ఫార్మసిస్ట్ పోస్టులు, 50 ఎంపీహెచ్‌ఏ (మేల్), 59 ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్), 29 (మేల్, ఫిమేల్) హెల్త్ సూపర్‌వైజర్ పోస్టుల ఖాళీలతో గ్రామాలలో వైద్యసేవలు కుంటుపడ్డాయి.
మలేరియా నియంత్రణపై అలక్ష్యం..
మన్యాన్ని ఏటా మలేరియా వణికిస్తోంది. నియంత్రణ చర్యలు కానరావడం లేదు. ఏప్రిల్ 16 నుంచి దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాల్సి ఉన్నా నేటి వరకు మందు సరఫరా కాలేదు. 23 టన్నుల ఏసీఎం మందు పంపిణీ జరగకపోవడంతో పిచికారీ పనులు ప్రారంభంకాలేదు. గిరిజనులకు దోమ తెరల పంపిణీకి కూడా రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏజెన్సీలో మలేరియా తీవ్రత దృష్ట్యా దోమ తెరలు పంపిణీకి అధికారులు ప్రతిపాదించినా నేటికీ ఇవి మన్యానికి చేరలేదు.
ఆరోగ్యశాఖ మంత్రికి సమస్యల మాల
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం పాడేరు, అరకు మండలాల్లో మంగళవారం పర్యటించనున్నారని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ వై.వేంకటేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించి ఇక్కడ 100 పడకల ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం అరకులో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనాలను ప్రారంభించి తిరిగి విశాఖపట్నం చేరుకుంటారన్నారు. మన్యంలో పర్యటిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏజెన్సీలోని వైద్య ఆరోగ్య సేవల దుస్థితిని సమీక్షించి మన్యంలో వైద్యసేవల మెరుగుకు చర్యలు తీసుకోవాలని గిరిజన వర్గాలు, గిరిజన ప్రజలు, వివిధ సంఘాల వారు కోరుతున్నారు.