పరీక్షలన్నీ నార్మల్‌...  ఛాతీలో  సూది గుచ్చినట్లు నొప్పి | Examination of all the pain in the nerve chest | Sakshi
Sakshi News home page

పరీక్షలన్నీ నార్మల్‌...  ఛాతీలో  సూది గుచ్చినట్లు నొప్పి

Published Mon, Jun 11 2018 1:12 AM | Last Updated on Mon, Jun 11 2018 1:12 AM

Examination of all the pain in the nerve chest - Sakshi

జనరల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌
నా వయస్సు 47 ఏళ్లు. బరువ# 72 కిలోలు. ఏడాది కిందట ఛాతిలో నొప్పి వస్తే ఈసీజీ, ఎకో, టీఎంటీ, ఎక్స్‌రే పరీక్షలు చేయించాను. అంతా నార్మల్‌ అని వచ్చింది. గ్యాస్‌ట్రబుల్‌ ఏదైనా ఉందేమోనని ఎండోస్కోపీ, రక్తపరీక్ష, ఎక్స్‌రే చేయించాను. అవి కూడా నార్మలే. నాకు ఎలాంటి దురలవాట్లు లేవు. ఛాతీలో సూది గుచ్చినట్లుగా చురుక్కువుని నొప్పి వచ్చి కొద్దిసేపు అలాగే ఉంటోంది. గత మూడేళ్లుగా ఈ సమస్య ఉంది. అయితే రిపోర్టుల్లో ఏమీ ఉండటం లేదు. ఏ జబ్బూ లేకపోతే ఎందుకీ లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తగిన సలహా ఇవ్వండి.  – ఎన్‌. భానుప్రసాద్, భీమవరం 
మీరు కార్డియాక్‌ వర్కప్, ఎండోస్కోపిక్‌ వర్కప్‌ చేయించుకున్నారు కాబట్టి, అవి నార్మల్‌గానే ఉన్నాయి కాబట్టి మీకు గుండె సవుస్య, అసిడిటీకి సంబంధించిన సవుస్యలేదనే చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో మరీ ఎక్కువగా ఆందోళన చెందకండి. అయితే ఇలాంటి నాన్‌–కార్డియాక్‌ పెయిన్స్‌ (గుండెకు సంబంధంలేని నొప్పుల)కు పిత్తాశయంలో రాళ్లు, పాంక్రియాటైటిస్, సర్వైకల్‌ స్పాండిలోసిస్, ఇంటర్‌కాస్టల్‌ వుయాల్జియా (పక్కటెవుుకల్లో నొప్పి) వంటివి కూడా కారణాలు కావచ్చు. కాబట్టి మీరు మరొకసారి మీ డాక్టర్‌ను కలిసి, మీ సమస్యను విపులంగా చర్చించి, ఇక్కడ పేర్కొన్న వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా వారు చికిత్స సూచిస్తారు. 

నోటి నుంచి రక్తం పడింది... ప్రమాదమా?
నాకు 56 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా నుంచి గుండెజబ్బు, డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నాను. హృద్రోగం కోసం చికిత్స కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులకు చక్కెర వ్యాధి వచ్చింది. వారం క్రితం పరీక్ష చేయించుకుంటే నాకు షుగర్‌ 340 ఎంజీ/డీఎల్‌ ఉంది. ఇన్సులిన్‌ తీసుకుంటున్నా చక్కెర పాళ్లు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. షుగర్‌ నియంత్రణలో ఉండటం లేదు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఇన్సులిన్‌ తీసుకోవడం లేదు. ఆ సమయంలో ఒకసారి నోటి నుంచి రక్తం పడింది. ఇలా మూడుసార్లు జరిగింది. నాకు తగిన సలహా ఇవ్వండి. 
– ఎమ్‌డీ. గఫూర్‌బేగ్, గుంటూరు 

డయాబెటిస్, హృద్రోగం... ఈ రెండూ ఉన్నవాళ్లు ఇన్సులిన్‌ మొదలుపెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ఆపాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు కూడా డాక్టర్‌ను సంప్రదించాక మాత్రమే వారి సలహా మేరకు ఆపాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా నోటి నుంచి రక్తం పడటం అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఒక్కోసారి మీరు వాడే ఇతర మందులైన యాస్పిరిన్, రక్తాన్ని పలచబార్చే మందుల వంటి వాటి  వల్ల కూడా ఇలా బ్లీడింగ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా మెడికల్‌ స్పెషలిస్ట్‌కు చూపించుకోండి. వారి సలహా మేరకు చికిత్స తీసుకోండి.

కార్డియో మయోపతి అంటున్నారు... జాగ్రత్తలు ఏమిటి? 
నా వయసు 63 ఏళ్లు. నాకు కార్డియోవుయోపతి అనే సమస్య ఉందనీ, అయితే దానికి ఆపరేషన్‌ అవసరం లేదనీ, కాకపోతే జీవితాంతం వుందులు వాడాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. నాకు ఏవిధమైన ఇతర రుగ్మతలు, చెడు అలవాట్లు లేవు. నా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? – వేణుగోపాల రావు, నెల్లూరు 
మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీకు ఉన్న సమస్య ‘హైపర్‌ట్రాఫిక్‌ కార్డియోవుయోపతి’ అనిపిస్తోంది. ఇది సాధారణంగా గుండెలోని ఛాంబర్స్‌ వుందంగా తయారవ్వడం వల్ల వచ్చే సమస్య. ఒక్కోసారి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు వుందులు తప్పనిసరిగా వాడాల్సిందే. వుందులు వాడకపోతే అకస్మాత్తుగా కార్డియాక్‌ సవుస్య వచ్చి ఒక్కోసారి ప్రాణాలకే ముప్పురావచ్చు లేదా పక్షవాతం వంటి సవుస్యకు దారితీసే అవకాశం  కూడా ఉంది. అందువల్ల క్రవుం తప్పకుండా వుందులు వాడుతూ తరచూ కార్డియాలజిస్ట్‌ నేతృత్వంలో పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే... మీరు శ్రవు ఎక్కువగా ఉండే ఎక్సర్‌సైజ్‌లను నివారించండి. 

ఒంటి మీద గడ్డలు...  ఎవరిని  సంప్రదించాలి?  
నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా? 
– డి. ఆనంద్, నిజామాబాద్‌

మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు  ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్‌ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్‌ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్‌ ఆంకాలజిస్టును సంప్రదించండి.

క్షయ వ్యాధి... తిరగబెట్టే  అవకాశం  ఉందా? 
నా వయస్సు 45 ఏళ్లు. మూడేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్‌ వచ్చింది. హెచ్‌ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్‌ వచ్చింది. ఆర్నెల్ల పాటు చికిత్స తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే అప్పుడు నెగెటివ్‌ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులుతో తగ్గి, నెగెటివ్‌ అని వచ్చాక కూడా అది మళ్లీ  తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  – రవీందర్, సంగారెడ్డి 
పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత  క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. వారిలో ఏవైనా ఇతర కారణాల వల్ల (ఉదాహరణకు... డయాబెటిస్, వయసు పైబడటం, హెచ్‌ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి బాగా తగ్గిపోతే... క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్‌’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే క్షయ వచ్చి తగ్గిన వారు... మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర వంటి మంచి జీవనశైలి అలవాట్లను అనుసరిస్తుండాలి. అలాగే ఇలాంటివారికి డయాబెటిస్‌ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధి తిరగబెట్టినట్లు మీకు అనుమానం వస్తే ఒకసారి పల్మునాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్‌ ఎమ్‌. గోవర్ధన్‌
సీనియర్‌ ఫిజీషియన్, కేర్‌ హాస్పిటల్స్,  నాంపల్లి, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement