రోగం..వేగం | World Tuberculosis Day TB claims 4500 lives a day worldwide | Sakshi
Sakshi News home page

రోగం..వేగం

Published Fri, Mar 23 2018 12:56 PM | Last Updated on Fri, Mar 23 2018 12:56 PM

World Tuberculosis Day TB claims 4500 lives a day worldwide - Sakshi

జిల్లా క్షయ నివారణ కేంద్రం

హెచ్‌ఐవీ, స్వైన్‌ఫ్లూ, డెంగీ వ్యాధులతో ఒకరిద్దరు చనిపోతేనే పెద్దగా హడావుడి చేస్తారు. కానీ క్షయ వ్యాధితో ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నా  ప్రభుత్వం స్పందించడం లేదు. చాపకింద నీరులా ఈ వ్యాధి సమాజంలో పాకుతూనే ఉంది. ఈ వ్యాధి ఉన్న మనిషి ఒక్కసారి దగ్గితే కొన్ని లక్షల బ్యాక్టీరియా బయటకు వచ్చి ఎదురుగా ఉన్న వ్యక్తిలోకి వెళ్లి వ్యాధిని కలుగజేస్తుంది. ఎదుటి వ్యక్తి బలంగా ఉన్నంత సేపు ఈ వ్యాధి బయటపడదు. ఎప్పుడైతే అతనికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో క్షయ తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభిస్తుంది. ఈ నెల 24వ తేదీన ప్రపంచ క్షయ అవగాహన దినం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ప్రత్యేక కథనం.  

కర్నూలు(హాస్పిటల్‌):జిల్లాలో 15 సంవత్సరాలుగా 86,614 మంది టీబీ రోగులు డాట్స్‌ పద్ధతి ద్వారా మందులు వాడారు. అందులో 67,359 మంది క్షయ వ్యాధి నుంచి విముక్తి పొందారు. 15 ఏళ్ల క్రితం  క్షయ వ్యాధికి గురైన వారిలో ప్రతి వంద మందిలో 26 మంది చనిపోయేవారు. ఆ సంఖ్య ప్రస్తుతం ఆరుకు తగ్గించగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షయ వ్యాధికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని జిల్లా క్షయ నివారణ కేంద్రంతో పాటు నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని టీబీ ఆసుపత్రులు, నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్, కోవెలకుంట్ల, గోనెగండ్ల, పత్తికొండ, ఆలూరు, వెలుగోడు, నంద్యాల(గ్రామీణ), బనగానపల్లి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు, ఆదోని(గ్రామీణ), ఆళ్లగడ్డలలో టీబీ యూనిట్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 54 మైక్రోస్కోప్‌ సెంటర్లు ఉన్నాయి.  మైక్రోస్కోప్‌ సెంటర్‌లో వ్యాధి నిర్ధారణ చేసి నివారణకు గాను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. అక్కడి వైద్యులు పరీక్షించి రోగి గ్రామ పరిధిలోని సబ్‌సెంటర్‌కు చెందిన ఆరోగ్య కార్యకర్తల ద్వారా డాట్స్‌ పద్ధతిలో మందులు ఇస్తారు. 

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికం
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి క్షయ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది పడే వారు చాలా మంది ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లలోని వైద్యులను సంప్రదిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో వీరు 30 శాతానికి పైగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వీరు ప్రైవేటు వైద్యులు సూచించే ప్రైవేటు మందులను కొని చికిత్సకు వాడుతున్నారు. ప్రస్తుతం ఇలా ప్రైవేటుగా చికిత్స చేయించుకునే వారికి కూడా ప్రభుత్వం మందులు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు వైద్యుల వద్దకు వచ్చే రోగుల వివరాలను తప్పనిసరిగా తమకు అందజేయాలని వైద్యులను అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం 2,500లకు పైగానే ఉంటోంది. 

విస్తరిస్తున్న ఎండిఆర్‌ టీబీ
మధ్యలో మందులు మానేసి వ్యాధి అదుపులోకి రాకపోతే దానిని ‘మల్టీడ్రగ్‌ రెసిస్టెన్స్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ వ్యాధి’(ఎండిఆర్‌టీబీ)గా గుర్తిస్తారు. వీరి గళ్ల నమూనాలను సేకరించి కర్నూలు మెడికల్‌ కాలేజి, నంద్యాలలో ఏర్పాటు చేసిన సీబీ న్యాట్‌ మిషన్‌ ద్వారా పరీక్షిస్తారు. జిల్లాలో రెండేళ్ల కాలంలో 3వేల మందికి పైగా పరీక్ష చేయగా అందులో 488 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే రెండేళ్ల పాటు రూ.2లక్షల విలువగల మందులను ఉచితంగా అందజేస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
క్షయ వ్యాధి భవిష్యత్‌లో రాకుండా ఉండేందుకు పుట్టిన వెంటనే పసిబిడ్డలకు బి.సి.జి సూది మందు వేస్తారు. క్షయ వ్యాధి వచ్చిన వారు దగ్గినప్పుడు నోటికి గుడ్డ అడ్డుపెట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. వ్యాధి నిర్ధారణ అయ్యాక వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. వ్యాధి లక్షణాలు తగ్గినప్పటికీ వైద్యం, మందులు ఆపకూడదు. మందులు వాడే సమయంలో రియాక్షన్‌ లాంటివి వస్తే భయపడకుండా వైద్యులను సంప్రదించాలి. 

వ్యాధి వ్యాపించే విధం
మైకోబాక్టీరియం ట్యూబర్‌ క్యూలోసిస్‌ అనే బ్యాక్టీరియా ద్వారా క్షయ వస్తుంది. దీనికి చిన్నా పెద్దా తేడా, లింగబేధం లేదు. పేద, ధనిక అన్న తారతమ్యమూ లేదు.   క్షయ రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో కలిసి వ్యాధినిరోదక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాపిస్తాయి. రెండు వారాలకు మించి ఎడతెరపి లేని దగ్గు, సాయంత్రం పూట జ్వరం రావడం, ఛాతిలో నొప్పి రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఉమ్మి(గళ్ల)లో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మేలు.

క్రమం తప్పకుండా మందులు వాడాలి
క్షయ వ్యాధి ముందుగా భయపెడుతుంది. కానీ దానిని సకాలంలో గుర్తించి క్రమంగా మందులు వాడితే అదుపులోకి వస్తుంది. దాని లక్షణాలు సద్దుమణిగాక మందులు వాడేస్తేనే ఇబ్బంది.అది మరింత శక్తిని పుంజుకుని మనిషిని అమాంతం నేలకూలుస్తుంది. ఈ వ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజూ వాడే మందులు వచ్చాయి. అలాగే ప్రైవేటుగానూ మందులు లభిస్తున్నాయి. అన్నీ మంచి మందులే. రోగి క్రమం తప్పకుండా వాడటమే ప్రధానం.  –డాక్టర్‌ కె.శివకృష్ణ, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు,ఎన్‌ఆర్‌ పేట, కర్నూలు

టీబీ రోగికి ప్రతి నెలా రూ.500  
కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ఎండ్‌ టీబీ  ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులతో పాటు ప్రతి నెలా రూ.500లు ఇచ్చే విధంగా ఏప్రిల్‌ నుంచి అమలు చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు క్షయ నివారణ వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాం.  –డాక్టర్‌ శ్రీదేవి, ఇన్‌చార్జ్‌ జిల్లా క్షయ నియంత్రణాధికారిణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement