టీబీ అండ్‌ కరోనా | Special Story About Tuberculosis And Corona Virus | Sakshi
Sakshi News home page

టీబీ అండ్‌ కరోనా

Published Thu, Jul 2 2020 12:33 AM | Last Updated on Thu, Jul 2 2020 5:11 AM

Special Story About Tuberculosis And Corona Virus - Sakshi

టీబీ అనగానే దాని ప్రధాన లక్షణం దగ్గడం గుర్తొస్తుంది. కరోనాలో ముఖ్య లక్షణం దగ్గే. టీబీ వ్యాధి రోగి దగ్గుతున్నప్పుడు అతడిలోనుంచి సూక్ష్మజీవులు ఆరోగ్యకరమైన వ్యక్తిని తాకుతాయి. రోగి తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు, రోగి శ్వాస నుంచి వచ్చిన సూక్ష్మజీవులు కూడా ఆరోగ్యవంతుడిని తాకవచ్చు. కోవిడ్‌–19లో కూడా అచ్చం అలాగే. కాకపోతే... ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌ అనే బ్యాక్టీరియాతో  టీబీ వస్తుంది. నావల్‌ కరోనా వైరస్‌ వల్ల కోవిడ్‌–19 వస్తుంది. టీబీ మనిషి ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కరోనా కూడా అంతే. అయితే టీబీ కేవలం ఊపిరితిత్తులనే కాదు...  మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్‌ వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది.

కరోనా వైరస్‌ మాత్రం ఊపిరితిత్తులను మాత్రమే గాక కొంతవరకు జీర్ణవ్యవస్థలోని పేగులనూ, చాలా అరుదైన సందర్భాల్లో మెదడునూ ప్రభావితం చేస్తుంది. ఇక టీబీకీ పూర్తి చికిత్స అందుబాటులోఉంది. కరోనాకు ఇంకా లేదు. కానీ లక్షణాలన్నీ ఒకేలా ఉండటంతో కొన్ని సందర్భాల్లో దేహంలో టీబీ ఉన్నప్పటికీ... ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్‌–19ను తలపించవచ్చు. అందుకే టీబీని గురించి తెలుసుకుంటే... అది చికిత్స ఇంకా అందుబాటులో లేని కోవిడ్‌–19 కాదనీ... టీబీ కావచ్చని తెలుసుకోవచ్చు. టీబీ, కరోనాల పోలికలూ, తేడాల పట్ల అవగాహన పెంచుకునేందుకే ఈ కథనం.

టీబీ ఎలా వ్యాప్తిచెందుతుంది..?
టీబీ వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. అప్పటికే టీబీ ఉన్న వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి సోకిన సూక్ష్మక్రిమి మొదట ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ పెరగడం మొదలుపెడుతుంది. అలాగే ఈ సూక్ష్మక్రిమి గాలి, వెలుతురు (సరైన వెంటిలేషన్‌) లేని చోట బాగా పెరుగుతుంది. ధారాళమైన గాలి, వెలుతురు ఉన్న చోట రోగ క్రిమి మనుగడ సాధించలేదు. (అందుకే టీబీకి మంచి మందులు కనుగొనక ముందు టీబీ రోగులను వేరు చేసి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే చోట్ల ఉంచి నయం చేసేవారు. ఆ క్షయ వ్యాధి చికిత్స కేంద్రాలను శానిటోరియమ్స్‌ అనేవారు).  

ఇక టీబీ వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ తలుపులు మూసి ఉండే ఏసీ గదుల్లో ఉంటే... వారి నుంచి అక్కడ పనిచేసే ఇతరులకూ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కరోనా విషయంలోనూ అంతే. అది కూడా టీబీ లాగే వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం కరోనాకు మందు లేకపోవడం వల్ల ఈ రోగులు సైతం గాలీ, వెలుతురు బాగా వచ్చే (మంచి వెంటిలేషన్‌ ఉండే) గదిలో ఒక్కరే (ఐసోలేషన్‌లో) ఉండిపోవాలి. 

ల్యాటెంట్‌ టీబీ ఇన్ఫెక్షన్‌ అంటే...? 
మన సమాజంలో ఉన్న చాలా మందిలో టీబీ సూక్ష్మక్రిమి లోపల ఉంటుంది. కానీ వారిలో రోగలక్షణాలూ ఉండవు. పూర్తిగా ఆరోగ్యవంతుల్లా   ఉంటారు. వీళ్ల నుంచి ఆరోగ్యవంతుడికి వ్యాధి వ్యాపించదు. వీళ్లకు టీబీ పరీక్ష నిర్వహించినప్పుడు టీబీ ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కొందరిలో అనేక కారణాల వల్ల వాళ్లలో సహజంగా ఉండే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. (ఉదా: డయాబెటిస్, మహిళల్లో గర్భధారణ వల్ల, క్యాన్సర్, ట్రాన్స్‌ప్లాంట్‌ జరిగినప్పుడు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు, ఎస్‌ఎల్‌ఈ లేదా హెచ్‌ఐవీ సోకడం వంటి కారణాల వల్ల). అలాంటి వారిలో టీబీ క్రిమి మళ్లీ క్రియాశీలం అయి, వ్యాధి బయటపడుతుంది. మన దేశంలోనైతే... ప్రత్యేకంగా వ్యాధి లక్షణాలను బయటపడ్డప్పుడే చికిత్స అవసరం. లక్షణాలు లేకపోతే మందులు అవసరం లేదు.

టీబీ నిర్ధారణ... 

కళ్ల పరీక్ష: దగ్గినప్పుడు పడే తెమడను పరీక్షించడం ద్వారా టీబీ బ్యాసిల్లై (సూక్ష్మక్రిమి) ఉందా లేదా అని పరీక్షించి, నిర్ధారణ చేయవచ్చు. రెండు రోజుల వ్యవధిలో రోగి నుంచి రెండు కళ్లె శాంపిళ్లను సేకరించి పరీక్ష చేసి దీన్ని నిర్ధారణ చేస్తారు. 

ఛాతీ ఎక్స్‌రే: ఊపిరితిత్తులకు సోకిన టీబీని ఎక్స్‌–రే ద్వారా గుర్తించవచ్చు. అలాగని కేవలం ఎక్స్‌–రే ద్వారానే పూర్తి నిర్ధారణ కూడా సాధ్యం కాదు.  
∙చర్మం పరీక్ష: టీబీ నిర్ధారణకు చర్మ పరీక్షను చాలా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ఇది ల్యాటెంట్‌ టీబీ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. అయితే నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఛెస్ట్‌ ఫిజీషియన్స్‌ (ఎన్‌సీసీపీ), ఐసీఎస్‌ (ఇండియన్‌ ఛెస్ట్‌ సొసైటీ) మార్గదర్శకాల మేరకు... లక్షణాలేమీ కనిపించని ల్యాటెంట్‌ టీబీకి చికిత్స అవసరం లేదు. 
టీబీ ఇంటర్‌ఫెరాన్‌ గామా రిలీజ్‌ ఎస్సే (ఐజీఆర్‌ఏఎస్‌): దీన్ని ఎక్కువగా క్వాంటిఫెరాన్‌ టీబీ గోల్డ్‌ టెస్ట్‌ అని పిలుస్తారు. ఇది సరికొత్త నిర్ధారణ పరీక్ష. దాంతోపాటు చర్మపు పరీక్షకంటే అధునాతనమైనది, కచ్చితమైనది. ఇక ఇది టీబీ సూక్ష్మక్రిమికి మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి ఏ మేరకు స్పందిస్తుందో అన్న విషయాలనూ తెలుపుతుంది. 

టీబీ సీరలాజికల్‌ పరీక్షలు: ఇవి రోగి రక్తాన్ని సేకరించి నిర్వహించే పరీక్షలు. 
కల్చర్‌ పరీక్ష : టీబీ సూక్ష్మజీవుల పెరుగుదలను పరీక్షించడం వల్ల టీబీ చికిత్స ప్రక్రియను ఎంపిక చేసేకునేందుకు అవకాశం ఉన్న పరీక్ష ఇది. 
కరోనా పరీక్ష: గొంతులో ఉన్న స్వాబ్స్‌ సేకరించడం ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష చేసి వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ చేస్తారు. 
టీబీ చికిత్స : టీబీని పూర్తిగా నయం చేయడానికి రోగి క్రమం తప్పకుండా ఫిజీషియన్‌ పర్యవేక్షణలో ఉండటం అవసరం. మందుల క్రమం అస్సలు తప్పడానికి వీల్లేదు. 

కరోనా చికిత్స : ఇప్పటికైతే కరోనా వల్ల వచ్చే కోవిడ్‌–19కు లక్షణాల ఆధారంగానే చికిత్స ఉంది. రెమ్‌డిస్‌విర్, ఫావిపిరావిర్‌ లాంటి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ అవి మైల్డ్‌గా, మాడరేట్‌గా ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం కాకుండా నియంత్రించేవే తప్ప... పూర్తిగా నయం చేసే మందులు కావు. అయితే టీబీకి పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. ఒకవేళ పూర్తి చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకారిగా మారవచ్చు. మృత్యువుకూ దారి తీయవచ్చు. కరోనాకు మందులేకపోయినా... ఒకవేళ మైల్డ్‌గా ఉండి మందులేమీ వాడకపోయినా తగ్గవచ్చు. అందుకే కరోనాకైనా మందులు వాడాల్సిన అవసరం ఉండదేమోగానీ...టీబీకి మాత్రం తప్పక వాడాల్సిందే. 

దగ్గు, జ్వరంతో వ్యాధిని కల్పించే కారకాల్లో టీబీ... బ్యాక్టీరియా వల్ల; కోవిడ్‌–19 కరోనా వైరస్‌ వల్ల వచ్చి... లక్షణాలూ, వ్యాపించే తీరు దాదాపుగా ఒకేలా ఉన్నప్పటికీ టీబీ – కరోనాల విషయంలో పోలికలూ, తేడాలను గుర్తించి, రెండింటి పట్ల అవగాహన పెంచుకుని, ఇరు వ్యాధుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం.
వ్యాప్తిలోనూ పోలికే... 

టీబీ సూక్ష్మక్రిమి సోకినంతనే ఆరోగ్యవంతుడు వ్యాధిబారిన పడడు. అతడిలో రోగ లక్షణాలేమీ బయటపడవు. అలాంటి వారిని ల్యాటెంట్‌ టీబీ ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లుగా చెబుతారు. అయితే ఏదైనా కారణం వల్ల వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధి బయటపడుతుంది. అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు టీబీని పూర్తిగా నయం చేయగల మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం... ఆ కాలపరిమితి పొడవునా తప్పనిసరిగా మందులు వాడాలి.

అలాగే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులోనూ కరోనా వైరస్‌ సోకగానే అతడికి కోవిడ్‌–19 రాకపోవచ్చు. అలా లక్షణాలేమీ కనపడకుండానే కొందరిలో తగ్గిపోవచ్చు. సరికొత్త పరిశోధనల ప్రకారం ఇలా లక్షణాలేమీ లేనివారు (ఎసింప్టమ్యాటిక్‌) కోవిడ్‌–19ను వ్యాప్తి చేయలేరు. కానీ కొద్దిపాటి లక్షణాలు కనిపించడం ప్రారంభం కాగానే (ప్రి–సింప్టమ్యాటిక్‌) మాత్రం కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని అధ్యయనాల్లో తేలింది. 

టీబీ అండ్‌ కరోనా లక్షణాలలో పోలికలు
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు టీబీ క్రిమి పెరగడం ప్రారంభిస్తుంది. అది తనను వృద్ధి చేసుకుంటూ ఉండటంతో రోగలక్షణాలు బయటపడతాయి. ఒకసారి వృద్ధి చెందడం మొదలుపెట్టాక అది వేర్వేరు కణజాలాలపై దాడి చేసి వాటిని నాశనం చేయడం మొదలుపెడుతుంది. అది ఊపిరితిత్తుల కణజాలాన్ని నాశనం చేయడం మొదలుపెడితే కొందరిలో ఊపిరితిత్తులకు కన్నం పడే అవకాశం కూడా ఉంది. ఊపిరితిత్తుల్లో సూక్ష్మక్రిమి ఉన్నప్పడు... కనిపించే లక్షణాలివి... 
∙విపరీతమైన దగ్గు... కనీసం మూడు వారాల పాటు ఎడతెరిపి లేకుండా దగ్గుతుంటే టీబీ కావచ్చని అనుమానించవచ్చు ∙

ఛాతీలో నొప్పి ∙బలహీనంగా ఉండటం, విపరీతమైన నీరసం ∙బరువు గణనీయంగా తగ్గడం  ఆకలి లేకపోవడం ∙చలిజ్వరం ∙జ్వరం  ప్రధానంగా సాయంత్రాలు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుండటం ∙రాత్రివేళల్లో చెమటలు పట్టడం. అయితే అది ఎలాంటి దగ్గు అయినప్పటికీ మూడు వారాల పాటు అదేపనిగా కనిపిస్తే తప్పక టీబీ అని అనుమానించాలి. అయితే జ్వరం అనేది టీబీ, కరోనా...  ఈ రెండు జబ్బుల్లో ఉన్నప్పటికీ... కరోనా విషయంలో మాత్రం ఇలా రాత్రిళ్లు చెమటలు పట్టడం, సాయంత్రాలు మాత్రమే ఉష్ణోగ్రత పెరగడం ఉండకపోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement