‘వేయి’ కళ్లతో..
ఆదిలాబాద్ : బీడీ కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో చాలీ చాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బీడీలు చుడితే రూ.100 గిట్టడం లేదు. బతుకుమాటేమో గానీ తంబాకు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక బీడీ కార్మికులు రోజు 1000 బీడీలు చుడితే వచ్చేది రూ.143. అందులో పీఎఫ్ కటింగ్ పోనూ రూ.130 చేతికి అందుతాయి. పనిచేసిన రోజుకే కూలీ. లేనిపక్షంలో పస్తులుండాల్సిందే. దీంతో రోజు 1000 బీడీలు చుట్టేందుకు మహిళలు పడే శ్రమ అంతాఇంతా కాదు. కొంతమంది 500 బీడీలు, లేనిపక్షంలో అంతకంటే తక్కువే చుట్టి ఎంతో కొంత సంపాదిస్తున్నారు.
చేయూత అంతంతే..
జిల్లాలో 69,221 మంది బీడీ కార్మికులు ఉన్నట్లు కార్మిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్, భైంసా, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్ తదితర నియోజకవర్గాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 14 కంపెనీలు బీడీలు కొనుగోలు చేస్తున్నాయి. 1,321 మంది కమీషన్ ఏజెంట్ల ద్వారా బీడీ కార్మికులు ఆయా కంపెనీలకు తాము చుట్టిన బీడీలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ పరంగా చేయూత కూడా అంతంతే. కార్మిక శాఖలో బీడీ కార్మికులు పేరు నమోదు చేసుకుంటే ప్రభుత్వ పరంగా చేయూత ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా కేవలం 3 వేల మంది కార్మికులకు మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నట్లు కార్మిక శాఖ అధికారులు వెళ్లడిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమ ఓర్చి పనిచేస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించడం లేదన్న ఆవేదన మహిళ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. ఉండేందుకు ఇల్లు లేదని, పిల్లలను చదివిద్దామన్నా స్కాలర్‌షిప్‌లు వంటివి అందడం లేదని, అనారోగ్యం పాలైతే మెడిక్లేయిమ్ వంటి సదుపాయాలు కూడా లేవని వారిలో నిరాశ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈఎస్‌ఐ ఆస్పత్రుల ద్వారా వారికి వైద్య చికిత్సలు అందాల్సి ఉన్నప్పటికి సరైన అవగాహన లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్‌లో ఈ ఆస్పత్రి ఉంది. పిల్లల చదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందజేయాలి. అయితే కార్మికుల పీఎఫ్‌లో జమ అయిన డబ్బుల ఆధారంగా ఈ చెల్లింపులు జరుపుతారు. ఆ లెక్కన వారికి దక్కేది అరకొరే. దానిపై కూడా కార్మికులకు అవగాహన లేదు. వీటి పరంగా నూతన ప్రభుత్వం దృష్టి పెట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
గౌరవ భృతిపై ఆశ..
ఎన్నో ఏళ్లుగా బీడీలు చుడుతూ బతుకులు వెళ్లదీస్తున్న తమకు రూ.1000 గౌరవ భృతి కల్పిస్తామన్న టీఆర్‌ఎస్ సర్కారు ప్రకటన కొంత ఆశ గొలుపుతోంది. జిల్లాలో 69,221 మంది కార్మికులు ఉండగా, గౌరవ భృతి అమలు చేసిన పక్షంలో ప్రభుత్వంపై సుమారు ప్రతినెల రూ.7 కోట్ల భారం పడుతుంది. అయితే ఇప్పటివరకు గౌరవ భృతికి సంబంధించి ప్రభుత్వ శాఖలకు విధివిధానాలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రస్తుతం బీడీలు చుడుతున్న కార్మికులకే ఈ భృతి అందజేస్తారా, లేనిపక్షంలో బీడీలు చుడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు ఇస్తారా అనే విషయంలోనూ సంశయనం వారిలో వ్యక్తమవుతోంది.