న్యూఢిల్లీ : అతి ముఖ్యమైన 56 మందుల ధరల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. క్యాన్సర్, డయాబెటీస్, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్, రక్తపోటులకు వాడే మెడిసిన్ ధరలను సగటున 25 శాతం తగ్గిస్తున్నట్టు పేర్కొంది. అతి ముఖ్యమైన మెడిసిన్ ధరలను తగ్గిస్తూ...సాధారణంగా వాడే గ్లూకోజ్, సోడియం క్లోరైడ్ ఇన్ జెక్షన్స్ వంటి చిన్నచిన్న మందుల ధరలను పెంచుతున్నట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్ పీపీఏ) ప్రకటించింది.
డ్రగ్ ప్రైస్ అథారిటీ ఎన్ పీపీఏ ప్రకటించిన ఈ కొత్త ధరల విధానం మేజర్ ఫార్మాస్యూటికల్ సంస్థలపై ప్రభావం చూపనుంది. అబోట్ హెల్త్ కేర్, సిప్లా, లుపిన్, అలెంబిక్, అల్కెం ల్యాబోరేటరీస్, నోవర్టిస్, బయోకాన్, హెట్రో హెల్త్ కేర్, ర్యాంబాక్సీ(ప్రస్తుతం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్) వంటి సంస్థలు ఈ కొత్త ధరల విధానం అమలుచేయనున్నాయి.
సగటున మందుల ధరలను 25 శాతం తగ్గించామని, దీంతో కొన్ని మందులు 10 నుంచి 15 శాతం, మరికొన్ని 45 నుంచి 50 శాతం తగ్గనున్నాయని ఎన్ పీపీఏ చైర్మన్ బుపేంద్ర సింగ్ తెలిపారు. అయితే తక్కువ పరిమాణంలో ఉండే ప్యాక్ ల ధరలను పెంచుతున్నట్టు పేర్కొన్నారు. డ్రగ్స్(ప్రైస్ కంట్రోల్) అమెండ్ మెంట్ ఆర్డర్ 3016 ప్రకారం 56 షెడ్యూల్డ్ ధరల్లో ఎన్ పీపీఏ మార్పులు చేసింది. నిర్థిష్ట చికిత్సా విభాగంలో వాడుతున్న సగటు మెడిషన్లను ఆధారం చేసుకుని ఎన్ పీపీఏ ఈ మందులపై ధరలను తగ్గించింది. ఈ మందుల అమ్మకాలు దాదాపు 1శాతం మేర పెరిగాయి.