క్యాన్సర్‌కు నమ్మకమే ఆన్సర్‌ | Doctor Nethravathi Success Story | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు నమ్మకమే ఆన్సర్‌

Published Tue, Sep 24 2024 9:36 AM | Last Updated on Tue, Sep 24 2024 10:11 AM

Doctor Nethravathi Success Story

పేషెంటైనఓ డాక్టర్‌ విజయ గాథ!  

బ్లడ్‌ క్యాన్సర్‌ సోకిన డాక్టర్‌ నేత్రావతి... తన గురించి తన ఆరేళ్ల కొడుకు ఎక్కడ భయపడతాడో, అసలే ఆందోళనలో ఉన్న తనను చూసి అతడెక్కడ బెంగపడతాడో అని తనకు జబ్బును ఆ చిన్నారి నుంచి దాచిపెట్టింది. తాను స్వయానా డాక్టర్‌. అందునా ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ కావడంతో కోవిడ్‌ కేసులు చాలా ఎక్కువగా చూస్తుండేది. దాంతో మొదట్లో తనలో కనిపించిన లక్షణాలను చూసి తనకూ కోవిడ్‌ సోకిందేమో అనుకుంది. 

ఎట్టకేలకు అది చాలా తీవ్రమైన ఓ తరహా బ్లడ్‌ క్యాన్సర్‌ అని తేలింది. చికిత్స జరగకపోతే బతికేది రెండువారాలూ... మహా అయితే మూడు వారాలు!! ఇప్పుడామె పూర్తిగా కోలుకుని, తనలా క్యాన్సర్‌ బారిన పడి ఆందోళనతో బెంబేలెత్తుతున్నవారికీ కౌన్సెలింగ్‌ చేయడం, ధైర్యం చెప్పడం చేస్తోంది. అదీ తాను చికిత్స తీసుకున్న మణిపాల్‌ హాస్పిటల్‌లోనే. ఈలోపు మరికాస్త ఎదిగిన కొడుకు ఆమె వీడియోలను చూసి... ‘అమ్మా... నువ్వెంత ధైర్యవంతురాలివి. నిజంగా నువ్వు విజేతవమ్మా’’ అంటుంటే... క్యాన్సర్‌ మీద కంటే పెద్ద విజయమిది అంటోంది ఆ తల్లి. ఆ విజయగాధను విందాం రండి.
  
డాక్టర్‌ నేత్రావతి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితులకు ఊరట కలిగిస్తున్న సమయమది. అప్పట్లో 2020 – 2021 నాటి రోజుల్లో కరోనా వైరస్‌ ఉద్ధృతంగా ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఆ క్షణాల్లో ఒకనాడు తనకూ జ్వరంగా ఉంది. ఒళ్లంతా నొప్పులు. తీవ్రమైన అలసట. ఒకవైపు చెయ్యి లాగేస్తోంది. విపరీతమైన నిద్రలేమి. ఒకవేళ నిద్రపడితే అకస్మాత్తుగా మెలకువ వచ్చి చూసుకుంటే ఒళ్లంతా చల్లటి చెమటలు. ఈ లక్షణాలన్నీ దాదాపుగా కోవిడ్‌నే తలపిస్తున్నాయి. అందునా తాను రోజూ కరోనా రోగులకు సేవలందిస్తూ ఉండటంతో కోవిడ్‌ సోకిందేమోనని మొదట అనుకుంది.

తీరా చూస్తే తీవ్రమైన బ్లడ్‌క్యాన్సర్‌... 
అసలు సమస్య తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకుని రి΄ోర్టు చూసుకుంటే ప్లేట్‌లెట్‌ కౌంట్‌ 10,000 కంటే కిందికి పడి΄ోయింది. (ఇవి కనీసం 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి). హిమోగ్లోబిన్‌ కౌంట్‌ ఐదు కంటే తక్కువ! (ఇది మహిళల్లో 12 నుంచి 15 వరకు ఉండాలి). తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా చాలా ఎక్కువగా పెరిగి΄ోయి ఉంది. అవేవీ కోవిడ్‌కు సంబంధించినవి కావు. ఏదో తేడా కొడుతోంది అనుకుంది. మణిపాల్‌ హాస్పిటల్‌లోని హిమటో ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ మల్లికార్జున కళాషెట్టిని సంప్రదించింది. వ్యాధి నిర్ధారణలో అది ‘అక్యూట్‌ ప్రోమైలోసైటిక్‌ ల్యూకేమియా – ఏపీఎల్‌’ అనే బ్లడ్‌ క్యాన్సర్‌గా తేలింది.

నాకే ఎందుకిలా... 
డాక్టర్‌ నేత్రావతి మంచి ఆరోగ్యస్పృహ ఉన్న వ్యక్తి. తానే స్వయానా డాక్టర్‌. ప్రతి వీకెండ్‌కూ బెంగళూరు కబ్బన్‌ పార్కులో పచ్చటి చెట్ల మీది నుంచి వచ్చే పచ్చి గాలి పీలుస్తూ కొడుకూ, భర్తతో సైక్లింగ్‌ చేస్తుంటుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తుంటుంది. వేళకు నిద్రలేవడం, సమయానికి నిద్ర΄ోవడంతో పాటు డాక్టర్‌ కావడంతో మంచి ఆరోగ్య స్పృహతో ఉండటం, ఆరోగ్యకరమైనవి తినడం ఇవన్నీ చేస్తుండేది. తీరా బ్లడ్‌ క్యాన్సర్‌ కనిపించాక... అందరూ చెప్పే మాటే తన నోటి నుంచీ వచ్చింది. అందరిలాగే తానూ అనుకుంది... ‘‘నాకే ఎందుకిలా?!’’ 

ఆమె వెతలు ఆమె మాటల్లోనే...
‘‘ఎట్టకేలకు చికిత్స మొదలైంది. నిజానికి క్యాన్సర్‌ వ్యాధి కంటే దాని చికిత్సా... అది మనిషి మీద చూపే శారీరక, మానసిక దుష్ప్రభావాలే ఎక్కువగా కుంగదీస్తుంటాయి. నాకున్న ΄÷డవాటి ఒత్తైన జుట్టును చూస్తూ చూస్తూ కోల్పోవాల్సి వచ్చింది. కీమోతో నోట్లోని, కడుపులోని మ్యూకస్‌ పారలు తీవ్రంగా దెబ్బతిని, ‘మ్యూకోసైటిస్‌’ అనే ఇన్ఫెక్షన్‌ వస్తుంది. కీమో మొదలైన రెండు లేదా మూడు వారాల పాటు నోట్లో ఉండే మ్యూకస్‌ పారలు దెబ్బతినడం వల్ల నోట్లో తెల్లటి చీముమచ్చలు వస్తాయి. దాంతో తినడం, తాగడం, మాట్లాడటం కష్టమయ్యేది. కీమోథెరపీలోని మందులు ప్రమాదకరమైన క్యాన్సర్‌ కణాలను తుదముట్టిస్తూనే ఆరోగ్యకరమైన మంచి కణాలనూ దెబ్బతీస్తుంటాయి. దాంతో ఈ దుష్ప్రభావాలన్నీ కనిపిస్తుంటాయి. కష్టమనిపించనప్పునడు నా ఆరేళ్ల కొడుకు రూపాన్ని కళ్లముందుకు తెచ్చుకున్నా.’’

డాక్టరే పేషెంట్‌ అయితే...
‘‘ఈ చికిత్స ప్రక్రియల సమయంలో మరెన్నో కాంప్లికేషన్లు కనిపించాయి. ఉదాహరణకు గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరింది. కిడ్నీ సరిగా పనిచేయడం మానేసింది. రక్తపోటు పడిపోయింది. ఎందుకు వస్తోందో తెలియని తరచూ వచ్చే జ్వరాల మధ్య ఒక్కోసారి శ్వాస ఆడేది కాదు. ఊపిరి అందడమే కష్టమయ్యేది.’’ ‘‘ఇలాంటి దశలో చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. తమను తాము తమాయించుకోలేరు. ఇక ఆ బాధితురాలు ఒక డాక్టరైతే... లోపల ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కాబట్టి అది ఆవేదన మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఒక్కమాటలో చెప్పాలంటే జబ్బుకూ, నాకూ జరిగే ఈ పోరులో... నా మానసిక బలం, నా మీద నాకున్న విశ్వాసం ఇవన్నీ గతంలో నేనేనాడూ చూడని స్థాయికి పెరిగాయి. నేను తట్టుకోగలిగే నా సహనపు చివరి అంచు సరిహద్దును మరింత ఆవలకు నెట్టాను’’ అంటూ తన ఆవేదనను కళ్లకు కట్టారు డాక్టర్‌ నేత్రావతి. 

చివరగా...
డాక్టర్‌ నేత్రావతి చెబుతున్న మాటలివి... ‘‘జబ్బు తర్వాత మంచి క్రమశిక్షణతో కూడిన జీవితం క్రమం తప్పకుండా ఫాలోఅప్, డాక్టర్‌ సలహాలు ఖచ్చితంగా పాటించడం. ఇతరులు చెప్పే ప్రత్యామ్నాయ చికిత్సలను పెడచెవిన పెట్టడం, ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం, ఎనిమిది గంటల నిద్ర, మధ్యాహ్నం ఓ చిన్న పవర్‌న్యాప్‌... ఇవన్నీ చేస్తూ ఎప్పటికప్పడు కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌లో తెల్లరక్తకణాలు నార్మల్‌గా ఉన్నాయేమో చూసుకుంటూ ఉన్నా.

ఇప్పుడు అంత ప్రమాదకరం కాదు... 
‘అక్యూ ప్రోమైలోసైటిక్‌ ల్యూకేమియా – ఏపీఎల్‌’ అని పిలిచే ఆ బ్లడ్‌ క్యాన్సర్‌ ఒకప్పుడు చాలా ప్రమాదకరం. కానీ ఇటీవల కొత్త చికిత్సా ప్రక్రియలు వస్తున్న కొద్దీ దాని గురించిన భయం తగ్గుతూ వస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఈ జబ్బుకు చికిత్స తీసుకున్నవారిలో 99% మంది నాలుగేళ్లు పైబడి జీవిస్తుంటే... ఐదేళ్లకు పైబడి జీవిస్తున్నవారు 86% మంది ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement