ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. చికిత్స అందించే విధానాల్లో నూతన ప్రక్రియలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన వైద్యులు మరో అద్భుతం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగికి 40 కి.మీ. దూరం నుంచి టెలీసర్జరీ టెక్నిక్ ద్వారా వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో, రోగికి కోత పెట్టడం నుంచి కణితిని తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వరకు మొత్తం ప్రక్రియ పూర్తయింది. డార్క్ గ్లాసెస్ ధరించి, రోబోట్‌ను ఆపరేట్ చేస్తూ, వైద్యులు రోగి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ ప్రభావిత కణాలను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ వారంలో బాధితుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు.
వైద్యుల బృందం గురుగ్రామ్‌లోని ఎస్‌ఎన్ ఇన్నోవేషన్‌లో ఉండగా, 52 ఏళ్ల రోగి ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చికిత్స అందుకున్నాడు. ఆపరేషన్ సమయంలో ఇంటర్నెట్‌తో పాటు సాంకేతికతకు అంతరాయం ఏర్పడకుండా వైద్యప్రక్రియ విజయవంతంగా జరిగింది. క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, జెనిటో-యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ రావల్‌తో పాటు అతని వైద్య బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా డాక్టర్ రావల్ మాట్లాడుతూ దేశంలోని ఏ మూలన ఉన్న రోగులకైనా టెలిసర్జరీ ద్వారా చికిత్స సాధ్యమవుతుందన్నారు. ఆపరేషన్ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాను ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నట్లు భావిస్తూ, పేషెంట్ ఎదురుగా పడుకుండగా మానిటర్‌లో చూస్తూ చికిత్స చేశానన్నారు. సాధారణ ఆపరేషన్‌లో రోగి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్‌లో త్రీడీ నాణ్యతతో మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఈ ఆపరేషన్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా జరిగింది. దీనికి ఐదు సన్నని రోబోటిక్ చేతులు ఉన్నాయి. దీనికి త్రీడీ హెచ్‌డీ సెట్ అనుసంధానమై ఉంది. ఇది సర్జన్‌కు మరింత స్పష్టమైన దృశ్యం కనిపించేలా చేస్తుంది.ఈ పద్ధతిలో రోగి చిన్నపాటి కోతకు గురవుతాడు. రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. క్యాన్సర్ సోకిన అవయవం లేదా కణం తొలగించిన తర్వాత, కుట్లు వేస్తారు.ఈ పద్ధతిలో రోగి సంప్రదాయ శస్త్రచికిత్సా విధానం కంటే త్వరగా కోలుకుంటాడు. బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యుల దీనిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment