మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణ మందులు, ఆరు ఔషధ మిశ్రమాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎన్‌పీపీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. యాంటాసిడ్‌లు, మల్టీవిటమిన్‌లు, యాంటీబయాటిక్ ఔషధాలు చౌకగా లభించే మందులలో ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరలకు సంబంధించిన సమాచారాన్ని డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే తెలియజేయాలని ఫార్మా కంపెనీలను ఎన్‌పీపీఏ ఆదేశించింది. నిత్యావసర ఔషధాల ధర ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక మధుమేహం కేసులు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. మందుల ధర తగ్గింపు వల్ల దేశంలోని 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలగనుంది. కాగా గత నెలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు వార్షిక సవరించిన సీలింగ్ ధరలను, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment