ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.
ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్‌ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్‌పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.
పెరగనున్న మందులు ఇవే..
» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్
» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml
» ఇంజెక్షన్‌లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg
» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml
» పిలోకార్పైన్ 2% డ్రాప్స్
» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg
» ఇంజెక్షన్‌లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg
» లిథియం మాత్రలు 300 mg
డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment