costlier
-
ఆ మందులు ఇక మరింత ఖరీదు.. ధర పెరగనున్న 8 మెడిసిన్లు!
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయతోపాటు బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడేవారికి మందుల భారం మరింత పెరగనుంది. ఆయా చికిత్సలకు వినియోగించే ఎనిమిది సాధారణ మందుల ధరలు మరింత ఖరీదు కానున్నాయి.ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఈ ఔషధాల 11 షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల ధరలను వాటి ప్రస్తుత సీలింగ్ ధరపై 50 శాతం పెంచడానికి ఆమోదించినట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం, మారకపు ధరలు పెరగడం వంటి కారణాలతో ఔషధ తయారీదారులు ధరలను పెంచడానికి దరఖాస్తు చేసుకోగా ఎన్పీపీఏ ఆమోదించినట్లు తెలుస్తోంది.పెరగనున్న మందులు ఇవే..» బెంజిల్ పెన్సిలిన్ 10 లక్షల IU ఇంజెక్షన్» అట్రోపిన్ ఇంజెక్షన్ 06.mg/ml» ఇంజెక్షన్లో వాడే స్ట్రెప్టోమైసిన్ పౌడర్ 750 mg, 1000 mg» సాల్బుటమాల్ టాబ్లెట్ 2 mg, 4 mg, రెస్పిరేటర్ ద్రావణం 5 mg/ml» పిలోకార్పైన్ 2% డ్రాప్స్» సెఫాడ్రోక్సిల్ టాబ్లెట్ 500 mg» ఇంజెక్షన్లో వినియోగించే డెస్ఫెర్రిఆక్సమైన్ 500 mg» లిథియం మాత్రలు 300 mgడ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO), 2013 నిబంధనల ప్రకారం 20 కొత్త ఔషధాల రిటైల్ ధరను కూడా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నిర్ణయించింది. అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన ఎల్-కార్నిటిన్ మెకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రిటైల్ ధరను కూడా నిర్ణయించింది. -
ఎస్బీఐ రుణ రేటు పెంపు.. పెరగనున్న ఈఎంఐ భారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్ఆర్) రుణ రేటును అన్ని కాలపరిమితులపై స్వల్పంగా 5 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెంచింది. పెరిగిన రేటు జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు 8 శాతం నుంచి 8.75 శాతం శ్రేణిలో ఉన్నాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఒక బ్యాంకు వినియోగదారులకు ఇచ్చే రుణాల ప్రాథమిక కనీస రేటు. తాజా ఎస్బీఐ రుణ రేటు పెంపు రుణ గ్రహీతలపై ఆ మేరకు ఈఎంఐ భారం (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) పెరగనుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఏడాది రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ రేటు 8 శాతంగా ఉంటుంది. నెల, మూడు నెలల రేటు 8.15 శాతం చొప్పున అమలవుతాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉంటుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.65%కి చేరుతుంది. మూడేళ్ల రేటు 8.75 శాతంగా ఉంటుంది. -
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్మెంట్ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్మెంట్లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. వందేళ్ల నాటిది! ఈ వన్ బీహెచ్‌కే సాధారణ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్‌కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్‌మెంట్‌కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు. -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా, ఖరీదైనవిగా లభించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే.. చౌకగా లభించేవి బట్టలు రత్నాలు,వజ్రాలు. మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్ ఛార్జర్లు పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది. స్మార్ట్‌వాచ్ వినికిడి పరికరాలు వ్యవసాయ ఉపకరణాలు కోకా బీన్స్, ఇంగువ ఖరీదైనవి అన్ని దిగుమతి వస్తువులు గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు అనుకరణ ఆభరణాలు స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఎక్స్ రే మెషిన్స్ చదవండి: Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! -
2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!
2021కు ఎండ్ కార్డు పడనుంది. వచ్చే 2022 జనవరి 1 నుంచి అనేక వినియోగ వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్ల, విధానాల్లో మార్పులు రానున్నాయి. జీఎస్టీలో మార్పులు, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లపై ప్రభావితం చేయనున్నాయి. కానీ ఈ సేవలను పొందే కస్టమర్లను ప్రభావితం చేయవు. ఆయా వ్యాపారులను మాత్రమే కొత్త జీఎస్టీ ప్రభావితం చేయనున్నాయి. కాగా పలు కన్య్సూమర్ గూడ్స్‌పై విధించే కొత్త జీఎస్టీ మాత్రం సామాన్యులపై పడే అవకాశం ఉంది. 2022 జనవరి 1 నుంచి ధరలు పెరిగే జాబితా ఇదే..! 1. బట్టలు, పాదరక్షలు దుస్తులు, పాదరక్షలు వంటి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 5 నుంచి 12 శాతం వరకు జీఎస్టీ స్లాబ్ రేట్లను పెంచింది. ఈ వస్తువులు జనవరి 1, 2022 నుంచి మరింత ఖరీదైనవిగా కానున్నాయి. రూ. 1,000 వరకు ఉన్న వస్తువులపై జీఎస్టీ గతంలో 5-12శాతంకి పెంచారు. వస్త్రాలు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, అలాగే టేబుల్క్లాత్లు లేదా సర్వియెట్‌లు వంటి ఉపకరణాలతో సహా వస్త్రాలపై జీఎస్టీ రేటు కూడా పెరిగింది. పాదరక్షలపై ప్రత్యక్ష పన్నును కూడా 5% నుంచి 12%కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నవంబర్ 18, 2021న మార్పులను తెలియజేసింది. బట్టలు, పాదరక్షల ధరల పెంపు చర్యను వివిధ వ్యాపార సంఘాలు వ్యతిరేకించాయి. ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్న సమయంలో రేట్ల పెంపుపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 2. క్యాబ్ అండ్ ఆటో రైడ్స్ ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5% జీఎస్టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. 3. స్విగ్గీ అండ్ జోమాటో జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు అందించే సేవలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపారు. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించనున్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది. జనవరి 1 నుంచి తగ్గే ధరల లిస్ట్..! 1. క్యాన్సర్ మందులు గతంలో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ మందులపై 18 శాతం జీఎస్టీను రేట్‌ను విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్టీ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో క్యాన్సర్ మందులు తగ్గే అవకాశం ఉంది. 2. ఫోర్టిఫైడ్ రైస్(బలవర్థకమైన బియ్యం) ఫోర్టిఫైడ్ రైస్‌పై కేంద్రం కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిపాదించింది. వీటిపై 18 శాతం నుంచి 5 శాతం జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 3. బయోడీజిల్ బయోడీజిల్ అనేది కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు లేదా రీసైకిల్ చేసిన రెస్టారెంట్ గ్రీజు నుంచి తయారు చేసిన పునరుత్పాదక ఇ, బయోడిగ్రేడబుల్ ఇంధనం. వీటిపై కేంద్రం గతంలో 18 శాతం మేర జీఎస్టీను వసూలు చేసేది. 2022 జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్టీను కేంద్రం వసూలు చేయనుంది. చదవండి: డిసెంబరు 31న జీఎస్టీ కౌన్సిల్ భేటీ -
రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రుణ గ్రహీతలపై భారీ భారాన్ని మోపనుంది. ఎస్బీఐ తన బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను 0.05శాతం లేదా 5 బేసిస్ పాయింట్లను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు సోమవారం (డిసెంబరు 10) నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఏడాదిపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 8.50 నుంచి 8.55కి పెరగగా, 2-3 సంవత్సరాల పరిమితి రుణాలపై వరుసగా 8.66 శాతంనుంచి 8.65 కి, 8.70 శాతంనుంచి 8.75 పెరుగుతాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన, రుణాలు, రీటెయిల్ట్ పర్సనల్ లోన్లు మరింత ప్రియం కానున్నాయి. -
రైల్వే ప్రయాణీకులపై ఆ చార్జీల బాదుడు: ప్రతీ ఏడాది
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులపై త్వరలో చార్జీల భారం పడనుంది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికుల సామానులను, బ్యాగులకు ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న క్లాక్ రూమ్స్, లాకర్ చార్జీలను పెంచాలని రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చార్జీల పెంపుపై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం క్లాక్‌రూమ్, లాకర్ సేవలను ఆధునికీకరించడంతోపాటు కంప్యూటరైజ్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించనుది. ఇలా బిడ్లను దక్కించుకున్న వారు ప్రతి ఏడాది ఈ రేట్లను పెంచడానికి వీరికి అనుమతినివ్వనుంది. అధిక పర్యాటక కేంద్రాలు, డిమాండ్ బాగా ఉన్న కొన్ని స్టేషన్లలో ఈ ఛార్జీ ఎంత వసూలు చేయాలనేది సంబంధిత అధికారి నిర్ణయిస్తారని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం రైల్వే ప్రయాణికులు 24గంటల వరకు లాకర్‌ను వినియోగించుకుంటే ఇకపై రూ. 20 వసూలు చేయనుంది. ఇప్పటి వరకు లాకర్‌ను 24 గంటలపాటు వాడుకుంటే రూ.15 వసూలు చేస్తోంది. అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే వినియోగదారుడు రూ.30 చార్జ్ చెల్లించాలి. ఇక క్లాక్ రూమ్ రెంట్ ను 24 గంటలకు రూ.15గా నిర్ణయించారు. 2000వ సంవత్సరంలో ఇది ఏడు రూపాయలు ఉండగా అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే 20 వసూలు చేసేవారు. అయితే 2013లో వీటిని సవరించి తొలి 24 గంటలకు రూ. 10 తర్వాతి 24 గంటలకు రూ.15లుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
గ్యాస్ సబ్సిడీపై జీఎస్టీ ‘బండ’
న్యూడిల్లీ: జీఎస్టీ ప్రభావంతో సామాన్యుల నెత్తిన ‘బండ’ పడింది. వస్తు, సేవల పన్ను ప్రభావంతో వంట గ్యాస్‌పై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ గణనీయంగా తగ్గనుందని తెలుస్తోంది. వంట గ్యాస్ వినియోగదారులు ఇక నుంచి గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెల రూ. 32 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఇకపై రూ.107మాత్రమే సబ్సిడీ రానుందని అఖిల భారత జాతీయ ఎల్పీజీ పంపిణీదారులు ఫెడరేషన్ కార్యదర్శి విపుల్ పురోహిత్ చెప్పారు. ఫలితంగా జూలై నుంచి ప్రతి వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్‌కు 32 రూపాయల వరకు భారం పడనుంది. దీంతోపాటు కొత్త కనెక్షన్లు తీసుకునే వినియోగదారులు రెండు సంవత్సరాల మాండేటరీ ఇన్స్పెక్షన్, ఇన్స్టాలేషన్, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలనున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సెకండ్ సిలిండర్‌కు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంతో వినియోగదారుల నెత్తిన భారం తప్పేలా కనిపించడం లేదు. జీఎస్టీ ప్రకారం ఎల్పీజీ 5 శాతం పన్ను పరిధిలో ఉంది. గతంలో ఢిల్లీ తదితర కొన్ని రాష్ట్రాలు దీనిపై పన్ను విధించకపోవడంతో వ్యాట్ 2 శాతం నుంచి 4 శాతం మధ్య ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ అమలుతో సిలిండర్ ధర రూ.12-15 వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ కూడా తగ్గనుంది. ఇప్పటి వరకు రూ.119.85 పైసలు రాయితీ ఇస్తుండగా జీఎస్టీ తర్వాత బుక్ చేసుకున్న వారి ఖాతాలో రూ.107 మాత్రమే పడనుంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కో సిలిండర్‌పై వినియోగదారులకు రూ.32 వరకు జీఎస్టీ బండ పడే అవకాశాలు ఖాయం. రవాణా మరియు లాజిస్టిక్స్ వంటి వేరియబుల్ ఖర్చులు కారణంగా ఇతర రాష్ట్రాలలో ధరలలో చిన్న వ్యత్యాసం ఉండనుంది. -
చుక్కలు తాకిన హెల్మెట్ ధరలు
మైసూరు : ద్విచక్రవాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో కూడా ఈ నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనను పాటించని వారికి పోలీసులు ఫైన్ విధిస్తుండడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ల కోనుడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో హెల్మెట్ల విక్రయాలు ఊపందుకున్నాయి. రోజుకు సగటున 500 నుండి 700 హెట్మెట్లు అమ్ముడవుతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో సమారు1.37 కోట్ల ద్విచక్రవాహనాలు ఉండగా హెల్మెట్లు కేవలం 20నుంచి 30లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో హెల్మెట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగి ధరలు సైతం అమాంతంగా పెరిగాయి. గతంలో రూ.400 ఉన్న సాధారణ హెల్మెట్ ధర ఇప్పుడు రూ.900 ఉండగా, ప్రభుత్వ గుర్తింపుగల ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ ధర రూ.2,500 నుంచి రూ.5,000 ధర పలుకుతోంది. -
'స్వచ్ఛ' బాదుడు!
పప్పులు, కూరగాయలు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ భగ్గునమండుతున్నాయి. దీన్నుంచి తమను రక్షించగలవారెవరో అర్ధంకాక సామాన్య పౌరులు విలవిల్లాడుతున్నారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహిస్తున్నారు. సరిగ్గా తమ వంతు బాదుడుకూ ఇదే సమయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భావించినట్టున్నారు. అన్ని రకాల సేవలపైనా 'స్వచ్ఛ భారత్' సెస్ పేరిట 0.5 శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది ఆదివారంనుంచి అమల్లోకొచ్చింది. 14 శాతంగా ఉండే సర్వీస్ టాక్స్ కాస్తా 14.5 శాతం అయింది. ఫలితంగా పన్ను పరిధిలోకొచ్చే అన్ని సేవలూ మరింత ప్రియమయ్యాయి. ఫోన్ చార్జీలు మొదలుకొని రెస్టరెంట్లలో తినుబండారాల వరకూ ప్రతి దానిపైనా ఈ సెస్ మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా 'స్వచ్ఛభారత్' సెస్ ద్వారా రూ. 3,800 కోట్ల ఆదాయం లభిస్తుందని, ఏటా ఇది రూ.10,000 కోట్ల వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రకటించి, మహాత్ముడి జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని స్వాగతించనివారంటూ లేరు. పరిశుభ్రత లోపించడంవల్ల ఏటా భారత్ 2 లక్షల 44 వేల కోట్లు నష్టపోతున్నదని ప్రపంచబ్యాంకు అంతటి సంస్థ చెప్పాక ఇలాంటి కార్యక్రమాన్ని కాదనేదెవరు? 2019లో రాబోయే మహాత్ముడి 150వ జయంతినాటికల్లా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికల్లా మరుగుదొడ్డి లేని ఇల్లుకానీ, విద్యా సంస్థకానీ, కార్యాలయంకానీ ఉండరాదని...బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పేలా ప్రజానీకంలో చైతన్యం పెంచాలని సంకల్పించారు. సకల రంగాలవారూ ఈ కార్యక్రమంలో భాగస్తులయ్యారు. 'స్వచ్ఛ భారత్' అంటే సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వరకూ అందరూ రోడ్ల మీదికొచ్చి ఊడ్వడమేనన్నంతగా ఆ కార్యక్రమం సాగింది. అది తీసుకొచ్చిన మార్పేమిటో ఎవరి కంటా పడకుండానే ఆ కార్యక్రమం పేరిట ఇప్పుడు సెస్ వసూళ్లు కూడా మొదలయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశ పౌరులందరి ప్రమేయం ఉండేలా చూడటం కోసమే సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అపరిశుభ్రత వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్నాయని, వీటి బారినుంచి ప్రజలను కాపాడటానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సెస్ అవసరమని వివరించింది. దీన్ని మరో పన్నుగా భావించవద్దని కూడా విన్నవించింది. పన్నులకూ, సెస్కూ తేడా ఉంటుంది. సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టదల్చుకుని విధించేది. సామాన్య పౌరులకు సంబంధించినంతవరకూ పేర్లలో తేడా తప్ప ఆచరణలో రెండూ ఒకటే...తమనుంచి అదనంగా గుంజడం. కేంద్ర ప్రభుత్వానికొచ్చే లాభం వేరు. పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుని తీరాలి. సెస్‌కు అలాంటి బెడద ఉండదు. సంపాదనంతా తనదే. తాజా సెస్‌పై విపక్షాల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన అభ్యంతరం కూడా ఇదే. ఒకపక్క పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం గణనీయంగా తగ్గిస్తూ వాటిని బికారులుగా మారుస్తున్నదనీ...కొత్తగా వచ్చే ఆదాయానికి సెస్ పేరుపెట్టి అసలుకే వాటా ఇవ్వనవసరం లేని స్థితి కల్పించుకుంటున్నదని అవి ఆరోపిస్తున్నాయి. పైగా ఇప్పుడు విధించిన స్వచ్ఛ భారత్ సెస్ ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్రం ఎలా ఖర్చు చేయదల్చుకున్నదన్న అంశంలో స్పష్టత లేదు. ఎందుకంటే మౌలికంగా మరుగుదొడ్లు నిర్మించడంతోసహా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కేంద్రం వసూలు చేయడం మొదలుపెట్టిన సెస్ ద్వారా లభించే మొత్తాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుందా...బదలాయిస్తే అది ఏమేరకు అన్న అంశాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మనకు సెస్‌లు బోలెడున్నాయి. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్, జాతీయ రహదార్ల సెస్, స్వచ్ఛ ఇంధనం సెస్...ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఏటా ఈ సెస్‌ల ద్వారా లక్షా 16 వేల కోట్ల రూపాయల మొత్తం కేంద్రానికి లభిస్తున్నది. ప్రధానమైన రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ సెస్ అనేది కేంద్రానికి కీలక ఆదాయ వనరుగా మారిందన్నది నిజం. సర్చార్జిలు కూడా రాష్ట్రాలతో పంచుకోనవసరంలేని మరో ఆదాయ వనరు. ఇలా సెస్‌లు, సర్‌చార్జిల ద్వారా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ అందులో తమకు వాటా దక్కనీయడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి తాము అమలు చేయబోయే సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ)వల్ల అలాంటి సమస్యలు చాలావరకూ తీరతాయని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. అందుకోసమే పరోక్ష పన్నుల సంస్కరణలకు తోడ్పడే ఈ విధానానికి అందరూ సహకరించాలంటున్నది. ఇలాంటి సమయంలో స్వచ్ఛ భారత్ సెస్ తీసుకురావడం సరైందే అవుతుందా? విధించదల్చుకున్న పన్నులు, సెస్‌లు, సర్చార్జిలవంటి వాటిని బడ్జెట్ సమర్పించేటపుడు వెల్లడించే ఆనవాయితీ నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో తప్పుకున్నాయి. బడ్జెట్‌కు ముందో, తర్వాతో వాటిని విపరీతంగా పెంచడం...బడ్జెట్లో మాత్రం ఎలాంటి పన్నులూ, ఇతర బాదుళ్లూ లేవని ప్రకటించుకోవడం రివాజుగా మారింది. వాస్తవానికి మరో నాలుగు నెలల్లో ఎటూ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈలోగా అందరితో చర్చించి, ఈ సెస్ ద్వారా సమకూర్చదల్చుకున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారో చెప్పి...అందులో రాష్ట్రాల ప్రమేయం ఏమిటో వివరించి ఆ బడ్జెట్లో దాన్ని చూపవచ్చు. ప్రభుత్వం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. వాస్తవానికి మన దేశంలో పారిశుద్ధ్యాన్ని జీవనాధారంగా చేసుకున్నది అట్టడుగు వర్గాలవారే. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అయితేనేమి... రీసైక్లింగ్‌కు ఉపయోగపడేవాటిని సేకరించి అమ్ముకోవడంలో అయితేనేమి అలాంటివారు ఎన్నో అనారోగ్య సమస్యలను, ఇతర రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వసూలు చేయడం ప్రారంభించిన సెస్ ద్వారా సమకూరే నిధుల్ని అలాంటివారి సాంఘిక భద్రతకూ, ఆరోగ్యానికీ, వారి పనిలో ఉపయోగపడే ట్రైసైకిళ్ల కొనుగోలుకూ, వారి అవసరాలకు ఉపయోగపడేలా చిన్న చిన్న రుణాలిచ్చేందుకూ, చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులకూ వినియోగిస్తే అర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.