
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులపై త్వరలో చార్జీల భారం పడనుంది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికుల సామానులను, బ్యాగులకు ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న క్లాక్ రూమ్స్, లాకర్ చార్జీలను పెంచాలని రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చార్జీల పెంపుపై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం క్లాక్‌రూమ్, లాకర్ సేవలను ఆధునికీకరించడంతోపాటు కంప్యూటరైజ్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించనుది. ఇలా బిడ్లను దక్కించుకున్న వారు ప్రతి ఏడాది ఈ రేట్లను పెంచడానికి వీరికి అనుమతినివ్వనుంది. అధిక పర్యాటక కేంద్రాలు, డిమాండ్ బాగా ఉన్న కొన్ని స్టేషన్లలో ఈ ఛార్జీ ఎంత వసూలు చేయాలనేది సంబంధిత అధికారి నిర్ణయిస్తారని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు.
తాజా నిర్ణయం ప్రకారం రైల్వే ప్రయాణికులు 24గంటల వరకు లాకర్‌ను వినియోగించుకుంటే ఇకపై రూ. 20 వసూలు చేయనుంది. ఇప్పటి వరకు లాకర్‌ను 24 గంటలపాటు వాడుకుంటే రూ.15 వసూలు చేస్తోంది. అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే వినియోగదారుడు రూ.30 చార్జ్ చెల్లించాలి. ఇక క్లాక్ రూమ్ రెంట్ ను 24 గంటలకు రూ.15గా నిర్ణయించారు. 2000వ సంవత్సరంలో ఇది ఏడు రూపాయలు ఉండగా అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే 20 వసూలు చేసేవారు. అయితే 2013లో వీటిని సవరించి తొలి 24 గంటలకు రూ. 10 తర్వాతి 24 గంటలకు రూ.15లుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.