పప్పులు, కూరగాయలు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ భగ్గునమండుతున్నాయి. దీన్నుంచి తమను రక్షించగలవారెవరో అర్ధంకాక సామాన్య పౌరులు విలవిల్లాడుతున్నారు. పట్టనట్టు వ్యవహరిస్తున్న పాలకుల తీరుపై ఆగ్రహిస్తున్నారు. సరిగ్గా తమ వంతు బాదుడుకూ ఇదే సమయమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భావించినట్టున్నారు. అన్ని రకాల సేవలపైనా 'స్వచ్ఛ భారత్' సెస్ పేరిట 0.5 శాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇది ఆదివారంనుంచి అమల్లోకొచ్చింది. 14 శాతంగా ఉండే సర్వీస్ టాక్స్ కాస్తా 14.5 శాతం అయింది. ఫలితంగా పన్ను పరిధిలోకొచ్చే అన్ని సేవలూ మరింత ప్రియమయ్యాయి. ఫోన్ చార్జీలు మొదలుకొని రెస్టరెంట్లలో తినుబండారాల వరకూ ప్రతి దానిపైనా ఈ సెస్ మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరాంతంలోగా 'స్వచ్ఛభారత్' సెస్ ద్వారా రూ. 3,800 కోట్ల ఆదాయం లభిస్తుందని, ఏటా ఇది రూ.10,000 కోట్ల వరకూ ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. నిరుడు స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రకటించి, మహాత్ముడి జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని స్వాగతించనివారంటూ లేరు. పరిశుభ్రత లోపించడంవల్ల ఏటా భారత్ 2 లక్షల 44 వేల కోట్లు నష్టపోతున్నదని ప్రపంచబ్యాంకు అంతటి సంస్థ చెప్పాక ఇలాంటి కార్యక్రమాన్ని కాదనేదెవరు? 2019లో రాబోయే మహాత్ముడి 150వ జయంతినాటికల్లా ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పటికల్లా మరుగుదొడ్డి లేని ఇల్లుకానీ, విద్యా సంస్థకానీ, కార్యాలయంకానీ ఉండరాదని...బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు తీర్చుకునే అలవాటుకు స్వస్తి చెప్పేలా ప్రజానీకంలో చైతన్యం పెంచాలని సంకల్పించారు. సకల రంగాలవారూ ఈ కార్యక్రమంలో భాగస్తులయ్యారు.
'స్వచ్ఛ భారత్' అంటే సినీ రంగ ప్రముఖులు మొదలుకొని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల వరకూ అందరూ రోడ్ల మీదికొచ్చి ఊడ్వడమేనన్నంతగా ఆ కార్యక్రమం సాగింది. అది తీసుకొచ్చిన మార్పేమిటో ఎవరి కంటా పడకుండానే ఆ కార్యక్రమం పేరిట ఇప్పుడు సెస్ వసూళ్లు కూడా మొదలయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశ పౌరులందరి ప్రమేయం ఉండేలా చూడటం కోసమే సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అపరిశుభ్రత వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్నాయని, వీటి బారినుంచి ప్రజలను కాపాడటానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సెస్ అవసరమని వివరించింది. దీన్ని మరో పన్నుగా భావించవద్దని కూడా విన్నవించింది.
పన్నులకూ, సెస్‌కూ తేడా ఉంటుంది. సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనం కోసం ఖర్చు పెట్టదల్చుకుని విధించేది. సామాన్య పౌరులకు సంబంధించినంతవరకూ పేర్లలో తేడా తప్ప ఆచరణలో రెండూ ఒకటే...తమనుంచి అదనంగా గుంజడం. కేంద్ర ప్రభుత్వానికొచ్చే లాభం వేరు. పన్ను ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుని తీరాలి. సెస్‌కు అలాంటి బెడద ఉండదు. సంపాదనంతా తనదే. తాజా సెస్‌పై విపక్షాల ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన అభ్యంతరం కూడా ఇదే. ఒకపక్క పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం గణనీయంగా తగ్గిస్తూ వాటిని బికారులుగా మారుస్తున్నదనీ...కొత్తగా వచ్చే ఆదాయానికి సెస్ పేరుపెట్టి అసలుకే వాటా ఇవ్వనవసరం లేని స్థితి కల్పించుకుంటున్నదని అవి ఆరోపిస్తున్నాయి. పైగా ఇప్పుడు విధించిన స్వచ్ఛ భారత్ సెస్ ద్వారా సమకూరే ఆదాయాన్ని కేంద్రం ఎలా ఖర్చు చేయదల్చుకున్నదన్న అంశంలో స్పష్టత లేదు.
ఎందుకంటే మౌలికంగా మరుగుదొడ్లు నిర్మించడంతోసహా పారిశుద్ధ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు కేంద్రం వసూలు చేయడం మొదలుపెట్టిన సెస్ ద్వారా లభించే మొత్తాన్ని రాష్ట్రాలకు బదలాయిస్తుందా...బదలాయిస్తే అది ఏమేరకు అన్న అంశాల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే మనకు సెస్‌లు బోలెడున్నాయి. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్, జాతీయ రహదార్ల సెస్, స్వచ్ఛ ఇంధనం సెస్...ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఏటా ఈ సెస్‌ల ద్వారా లక్షా 16 వేల కోట్ల రూపాయల మొత్తం కేంద్రానికి లభిస్తున్నది. ప్రధానమైన రెవెన్యూ ఆదాయంతో పోలిస్తే ఇది తక్కువే కావొచ్చుగానీ సెస్ అనేది కేంద్రానికి కీలక ఆదాయ వనరుగా మారిందన్నది నిజం. సర్‌చార్జిలు కూడా రాష్ట్రాలతో పంచుకోనవసరంలేని మరో ఆదాయ వనరు. ఇలా సెస్‌లు, సర్‌చార్జిల ద్వారా తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ అందులో తమకు వాటా దక్కనీయడం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి తాము అమలు చేయబోయే సరుకులు, సేవల పన్ను(జీఎస్‌టీ)వల్ల అలాంటి సమస్యలు చాలావరకూ తీరతాయని కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు చెప్పింది. అందుకోసమే పరోక్ష పన్నుల సంస్కరణలకు తోడ్పడే ఈ విధానానికి అందరూ సహకరించాలంటున్నది. ఇలాంటి సమయంలో స్వచ్ఛ భారత్ సెస్ తీసుకురావడం సరైందే అవుతుందా? విధించదల్చుకున్న పన్నులు, సెస్‌లు, సర్‌చార్జిలవంటి వాటిని బడ్జెట్ సమర్పించేటపుడు వెల్లడించే ఆనవాయితీ నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో తప్పుకున్నాయి. బడ్జెట్‌కు ముందో, తర్వాతో వాటిని విపరీతంగా పెంచడం...బడ్జెట్‌లో మాత్రం ఎలాంటి పన్నులూ, ఇతర బాదుళ్లూ లేవని ప్రకటించుకోవడం రివాజుగా మారింది. వాస్తవానికి మరో నాలుగు నెలల్లో ఎటూ కొత్త బడ్జెట్ వస్తుంది. ఈలోగా అందరితో చర్చించి, ఈ సెస్ ద్వారా సమకూర్చదల్చుకున్న నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారో చెప్పి...అందులో రాష్ట్రాల ప్రమేయం ఏమిటో వివరించి ఆ బడ్జెట్‌లో దాన్ని చూపవచ్చు. ప్రభుత్వం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు.
వాస్తవానికి మన దేశంలో పారిశుద్ధ్యాన్ని జీవనాధారంగా చేసుకున్నది అట్టడుగు వర్గాలవారే. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అయితేనేమి... రీసైక్లింగ్‌కు ఉపయోగపడేవాటిని సేకరించి అమ్ముకోవడంలో అయితేనేమి అలాంటివారు ఎన్నో అనారోగ్య సమస్యలను, ఇతర రకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వసూలు చేయడం ప్రారంభించిన సెస్ ద్వారా సమకూరే నిధుల్ని అలాంటివారి సాంఘిక భద్రతకూ, ఆరోగ్యానికీ, వారి పనిలో ఉపయోగపడే ట్రైసైకిళ్ల కొనుగోలుకూ, వారి అవసరాలకు ఉపయోగపడేలా చిన్న చిన్న రుణాలిచ్చేందుకూ, చెత్తను రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులకూ వినియోగిస్తే అర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.