సాక్షి ఏలూరు : జిల్లా క్షయ నివారణ కేంద్రం లో అక్రమార్కులు తిష్టవేశారు. తోటి సిబ్బంది నుంచే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పెట్రోల్ అలవెన్స్ నుంచి వ్యక్తిగత రుణాల మంజూరు వరకూ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇటీవల ఈ విభాగపు జిల్లా అధికారి ఆర్.సుధీర్‌బాబు అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ శాఖలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లక్షలాది రూపాయలు అటు ప్రభుత్వం నుంచి ఇటు సిబ్బంది నుంచి దోచుకుంటున్న వైనం బయటపడుతోంది.
పెట్రోల్ అలవెన్సులో రూ. 200 సమర్పణ
క్షయ నివారణ విభాగంలో 22 మంది శాశ్వత , 46 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి జీతం నుంచి ప్రతి నెలా రూ.200 ఉన్నతాధికారికి కమిషన్ రూపంలో ముట్టేది. ఈ విషయాన్ని ఏడాది క్రితం ‘సాక్షి’ బయటపెట్టింది. దీంతో అప్పటి నుంచి ఈ తతంగం ఆగింది. అయితే ఆ సొమ్ముంతా ఇటీవల ఒకేసారి వసూలు చేశారు. అంతర్గత ఆడిట్ అధికారులను సంతృప్తి పరచాలంటూ శాశ్వత ఉద్యోగుల నుంచి రూ.4 వేలు, తాత్కాలిక ఉద్యోగుల నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేశారని ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇది కాకుండా పెట్రోల్ అలవెన్సు నుంచి రూ. 200 ప్రతినెలా అయ్యవారికి ఇచ్చేయాలి. నెలలో 20 రోజులకు ట్రావెల్ అలవెన్స్ తీసుకునే వెసులుబాటు ఎనిమిది మంది ఫీల్డు సిబ్బందికి ఉంది, వీరు ఆ అలవెన్స్ నుంచి రూ.650 పై అధికారికి ముట్టజెప్పాల్సిందేనని సమాచారం. అంతేకాకుండా ఆరు నెలల క్రితం రూ. 2.40 లక్షలతో ల్యాబ్ పరికరాలను కొనుగోలు చేశారు. దీనిలో సగం సొమ్ము పక్కదారి పట్టిందనే ఆరోపణలు ఉన్నాయి.
వ్యక్తిగత రుణానికీ కమీషన్
తొమ్మిది మంది ఉద్యోగులు ఈనెల 9న ఏలూరు ఆర్‌ఆర్ పేటలోని డీసీసీబీ బ్యాంకు నుంచి ఒక్కొక్కరు రూ. 50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. రుణం మంజూరు కోసం ఒక్కొక్కరు రూ. 3 వేల చొప్పున తమ శాఖాధిపతికి సమర్పించుకున్నారంటే వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దాదాపు రూ.కోటి బడ్జెట్ ఉండే ఈ విభాగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఓ తాత్కాలిక ఉద్యోగి చేతుల్లో ఉన్నాయి.
శాశ్వత ఉద్యోగి అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఉన్నా ఆయన్ను ఆర్థిక కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. దీనిపై ప్రశ్నించినా ప్రయోజనం లేదు. తాత్కాలిక ఉద్యోగి చెప్పుచేతల్లోనే సిబ్బంది అంతా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా ఉన్నతాధికారులు ఈ శాఖపై పూర్తి విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
అక్రమాల పుట్ట!
Published Mon, Dec 16 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement