సౌందర్యానికి మోకరిల్లినవాడు | A Thing of Beauty is a Joy Forever | Sakshi
Sakshi News home page

సౌందర్యానికి మోకరిల్లినవాడు

Published Sun, Oct 26 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

సౌందర్యానికి మోకరిల్లినవాడు

సౌందర్యానికి మోకరిల్లినవాడు

కొన్ని పేర్లు మరింత మృదువుగా తోచడానికి కారణం, అవి నిజంగానే సుతిమెత్తగా ధ్వనించడమా? లేక, వాళ్ల జీవితం కొంతైనా తెలిశాక, కరిగిపోయిన మనలోపలి గరుకుదనం కారణమా? జాన్ కీట్స్‌ను తడుముతూవుంటే ‘పూర్ణంగా వికసించిన గులాబిపువ్వు’ను చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంది.
 
‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్. అందమైనది ఎప్పటికీ ఆనందమైనదే. దాని మనోహరత్వం పెరుగుతూనేవుంటుంది; అది ఎన్నటికీ శూన్యంలోకి గతించదు’. రొమాంటిక్ మూవ్‌మెంట్‌కు ప్రాతినిధ్యం వహించగలిగే వాక్యం ఇది. తర్కాలతో విసిగిపోయిన కాలంలో అనుభూతిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కీట్స్. అతడు సౌందర్యాన్ని ‘కంటితో’ ఎంతగా ‘తాగే’వాడంటే, తనకే ‘తెలియని వివశత్వంతో’ తల తూగిపోయేది. ‘సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం; ఇది తెలిస్తే ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదు,’ అన్నాడు.
 
పూబాలకుడి లాంటి కీట్స్ జీవితంలో ఎదలోకి దిగిన ముళ్లు కూడా ఉన్నాయి. అశ్వశాల నిర్వాహకుల ఇంట పుట్టాడు. సాహిత్య వాసన లేని కుటుంబం. కీట్స్‌కు పదేళ్లున్నప్పుడు తండ్రి గుర్రం మీంచి పడి చనిపోయాడు. మూడు నెలలకే తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముడితోపాటు కీట్స్ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. ఆమె దగ్గర ఆస్తిలేదు. ఉన్నది తగాదాల్లో ఉంది. అందువల్ల బంధువులు లేరు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన కీట్స్- మనుషులతో గొడవ పడేవాడు, కానీ పుస్తకాలతో స్నేహం చేసేవాడు. షేక్‌స్పియర్ ఎందుకు అంత గొప్పవాడయ్యాడో చాలా త్వరగా తెలుసుకున్నాడు.
 
సర్జన్ కావాలని ఉండేది. కొంతకాలం శిక్షణ కూడా పొందాడు. ఒకవైపు పాఠం జరుగుతుంటే, గదిలో పరుచుకునే సూర్యకిరణాలవెంట ఊర్ధ్వలోకాల్లోకి ఎగిరిపోయేవాడు. తనలాంటివాడు శస్త్రచికిత్సలు చేయలేడని గ్రహించాడు. ఆలోచనలకన్నా సంవేదనలతో కూడిన జీవితాన్ని కోరుకున్నాడు. ‘ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు/ తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను/ అక్షరరూపంలో పుస్తకాలలోకి’ అనువదించబూనుకున్నాడు. ‘కవిత్వం ఆకులు చిగిర్చినంత సహజంగా రాకపోతే అది అసలు రాకపోవటమే మంచిది’ అన్నాడు. ‘మూఢులకు తమవైన స్వప్నాలుంటాయి; అందుకే వాళ్లు స్వర్గాన్ని (కూడా) ఒక వర్గం కోసమే నేస్తూవుంటారు’ అన్నాడు. అయితే, లండన్ పత్రికల్లో వచ్చిన సమీక్షలు అతడి మనసును గాయపరిచాయి.
 
ఆ పరిస్థితుల్లో అతడికి పెద్ద ఊరట ఫానీ బ్రాన్. ‘కవిత్వపు రెక్కల’ మీద ఆమె దగ్గర వాలేవాడు. ‘దేహం చాలనంతగా’ ప్రేమించేవాడు. ‘ప్రేమ నా మతం. దానికోసం ప్రాణమైనా ఇస్తా’ అనేవాడు. కానీ ప్రాణాన్ని బలి కోరడానికి ప్రేమకేం పని? ఆ కర్కశ కార్యాన్ని మృత్యువు తలకెత్తుకుంది. క్షయవ్యాధి రూపంలో కీట్స్‌ను వెంటాడింది. ఏ ‘తియ్యటి పాపం’ చేయనివ్వకుండానే పూర్తిగా ఆక్రమించుకుంది. అదే క్షయతో తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఇప్పుడు తన వంతా?
 
చలి, దగ్గు బాధిస్తున్నాయి. అనారోగ్యంతో పేదఖైదీలాగా బందీ అయ్యాడు. దుప్పటిమీద కక్కుకున్న రక్తపు చుక్కలు కాలుడు పంపిన హెచ్చరికల్లా తోస్తున్నాయి. ‘మరో జీవితమంటూ ఉందా? నేను మేల్కొన్నాక దీన్నంతా ఒక కలగా తెలుసుకుంటానా? (మరో జీవితం) ఉండేవుండాలి, (లేదంటే) ఇలాంటి యాతనల్ని భరించడం కోసమే మనం సృష్టించబడివుండం’.
 
మద్యం ఆర్చేది కాదు, నల్లమందు తీర్చేదికాదు, ‘వృద్ధ దాదిలాంటి కాలం’ కూడా ఏ పరిష్కారమూ చూపించలేదు. అందుకే, నెగెటివ్ కేపబిలిటీ సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు కీట్స్. అనిశ్చితాలు, ద్వంద్వాలు, మర్మాలు, సందేహాలు ఎన్ని చుట్టుముట్టినా భరించగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ‘పోనివ్వని నిద్రలా మోపిన మృత్యువు బరువును’ ఓర్చుకున్నాడు. వీలైనంత త్వరగా మరణాన్ని తన్నుకుపోవడానికి ఆకాశంలోని గద్దలా కాచుకుని పడుకున్నాడు. ‘నేను త్వరగా నిశ్శబ్దపు సమాధిలోకి ఒరిగిపోవాలి... ఆ నెమ్మదైన సమాధికి దేవుడికి ధన్యవాదాలు... ఓ! నా మీద పరుచుకుంటున్న చల్లటి మట్టిని అనుభూతిస్తున్నాను... నా మీద డైసీ పువ్వులు పెరుగుతున్నాయి’.
 తన సమాధి ఫలకం మీద కీట్స్ ఇలా రాయాలని కోరుకున్నాడు: ‘ఇక్కడ నిద్రించేవారి పేరు నీటి మీద రాసిన రాత’. పాతికేళ్ల వయసులో(1795-1821) కీట్స్ శాశ్వతనిద్రలోకి జారుకున్న నేలలో పూసిన పూల గంధం విశ్వాన్ని చుట్టింది. ఆ సువాసనలను పీల్చినవాళ్లే భావకవులైనారు. ‘ఏడవకు, కళ్లు తుడుచుకో, ఈ పూవు మళ్లీ వచ్చే ఏడు పూస్తుంది’.
 - ఆర్.ఆర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement