క్షయ నిర్మూలన ఊసేది ?
- తెలంగాణలో 41,826 కేసులు నమోదు
- షుగర్, ఎయిడ్స్, కాలుష్యంతో విజృంభణ
- మందులకూ లొంగని స్థితికి వ్యాధి
సాక్షి, హైదరాబాద్: క్షయవ్యాధి మళ్లీ విస్తరిస్తోంది. దాన్ని నిర్మూలన కార్యక్రమాలు సఫలం కావడంలేదు. ‘టీబీపై 2014 జాతీయ వార్షిక నివేదిక’ ప్రకారం దేశం లో నమోదవుతున్న క్షయ కేసుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉంది. ఉమ్మడిరాష్ట్రంలో 1,03,707 కేసులు నమోదు కాగా, తెలంగాణవి 41,826 కేసులున్నాయి. హైదరాబాద్‌లోనే 6,612 టీబీ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 5,791, మహబూబ్‌నగర్ జిల్లాలో 4,076 కేసులను క్షయవ్యాధిగా గుర్తిం చారు. ప్రపంచవ్యాప్తంగా 80.6 లక్షల మంది క్షయ రోగులుంటే, మనదేశంలో 20.3 లక్షల మంది ఉన్నా రు. అంటే 25 శాతం రోగులు భారతలో ఉన్నారు.
షుగర్, ఎయిడ్స్ ఉంటే క్షయ వచ్చే ప్రమాదం...
పారిశ్రామికీకరణ, వాతావరణ కాలుష్యం పెరగడంతో క్షయ వ్యాధి కూడా విజృంభిస్తోంది. దీనికి తోడు షుగర్, ఎయిడ్స్ వంటివి ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గి క్షయరావడానికి అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఎయిడ్స్ రోగుల్లో 56 శాతం మందికి క్షయ సోకుతోంది. టీబీ ఉన్న రోగుల్లో 4 శాతం ఎయిడ్స్ రోగులున్నారు.
మందులకు లొంగని స్థితికి...: 2006 నుంచి టీబీ మందులకు కూడా లొంగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆసుపత్రుల్లోనూ మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా టీబీ పెరగడానికి ఒక కారణమని కేంద్రప్రభుత్వ నివేదిక పేర్కొంది.
పరిశోధనలు జరగాలి
ప్రస్తుత మందులకు టీబీ పూర్తిగా తగ్గే అవకాశం లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేర్ ఆసుపత్రి ఊపిరితిత్తులు, శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎ. రఫీ అంటున్నారు.