రాష్ట్రంలో నాలుగేళ్లలో 0.48 నుంచి 0.44 శాతానికి
హెచ్‌ఐవీ వ్యాప్తి రేటులో ఐదో స్థానంలో తెలంగాణ
ఈ ఏడాది ఏప్రిల్ – అక్టోబర్ మధ్య 5,363 మందికి పాజిటివ్
రాష్ట్రంలో మొత్తం హెచ్‌ఐవీ/ఎయిడ్స్ రోగులు 1.04 లక్షలు
జాగ్రత్తలు తీసుకొంటే హెచ్‌ఐవీ సోకినా సాధారణ జీవితం
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ కె. హైమావతి
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో పెరిగిన అవగాహన, హెచ్‌ఐవీ రోగులను గుర్తించి తగిన చికిత్స అందిస్తుండడంతో రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. 15–49 సంవత్సరాల వయసు గలవారిలో హెచ్‌ఐవీ వ్యాప్తి (ప్రివలెన్స్) రేటు దేశంలో 0.20 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.44గా ఉంది. రాష్ట్రంలో 2020లో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.48 శాతంగా ఉండగా, ఏటా ఒక శాతం తగ్గుతూ 2024–25లో 0.44 శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 25 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (నాక్స్) లెక్కలు చెబుతున్నాయి.
ఐదో స్థానంలో తెలంగాణ
ఎయిడ్స్ వ్యాప్తిలో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో ఉన్నది. మిజోరం మొదటి స్థానంలో ఉండగా, నాగాలాండ్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ లో 1.04 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లెక్కలు చెబుతు న్నాయి. హెచ్‌ఐవీ వైరస్, ఎయిడ్స్ సోకి న వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మందులను ‘యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్స్ (ఏఆర్‌టీ) ద్వారా సరఫరా చేస్తున్నట్లు సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె. హైమావతి ‘సాక్షి’కి తెలిపారు. భారత్‌లో 2010 నుంచి హెచ్‌ఐవీ వ్యాప్తి రేటు 44 శాతం తగ్గినట్లు సెప్టెంబర్ 25న ’రివైటలైజ్డ్ మలి్టలేటరలిజం: రీకమిటింగ్ టు ఎండింగ్ ఎయిడ్స్ టుగెదర్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మిజోరం ఫస్ట్.. జమ్ముకశీ్మర్ లాస్ట్
దేశంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి రేటు మిజోరంలో అత్యధికంగా ఉంది. 2023–24 లెక్కల ప్రకారం ఇక్కడ ఎయిడ్స్ వ్యాప్తి 2.73 శాతంగా నమోదైంది. ఆ తరువాత నాగాలాండ్‌లో 1.37 శాతం, మణిపూర్‌లో 0.87 శాతం, ఏపీలో 0.62 శాతం, తెలంగాణలో 0.44 శాతం ఉన్నది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ముకశీ్మర్, లద్దాఖ్‌లో ఎయిడ్స్ వ్యాప్తి అతి తక్కువగా 0.06 శాతంగా ఉన్నది. 2024– 25లో దేశవ్యాప్తంగా హెచ్‌ఐవీ రోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు నాక్స్ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ 31 వరకు ఏడు నెలల్లో తెలంగాణలో 9,56,713 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తే.. 5,363 మందికి పాజిటివ్‌గా తేలింది.
3,37,752 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా.. 427 మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 902 హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2023–24 సంవత్సరంలో సుమారు 20 లక్షల పరీక్షలు నిర్వహించగా.. 11,806 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రమం తప్పకుండా మందులు వాడుతూ.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకొంటే హెచ్‌ఐవీ సోకినా సాధారణ జీవితం గడుపవచ్చని కె. హైమావతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment