కండోమ్‌ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్‌ఐవీ | HIV Prevention Condom Use In Lowest Percentage In Telangana | Sakshi
Sakshi News home page

కండోమ్‌ కొనేందుకు సిగ్గు.. విస్తరిస్తున్న హెచ్‌ఐవీ

Published Sat, Feb 6 2021 8:45 AM | Last Updated on Sat, Feb 6 2021 11:21 AM

HIV Prevention Condom Use In Lowest Percentage In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఐవీ చాపకింది నీరులా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో గ్రేటర్‌ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం.  

  • అక్షరాస్యతలోనే కాదు.. ఆరోగ్యపరమైన అంశాల్లోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి వారిలో అవగాహన కొంత ఎక్కువే. కానీ సురక్షిత శృంగారంపై మాత్రం అవగాహన తక్కువ. కండోమ్‌ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే హెచ్‌ఐవీనే కాదు హెపటైటీస్‌–బి, సి, గనేరియా, సిఫిలిస్‌ వంటి వ్యాధుల బారినపడుతున్నారు.  
  • అంతేకాదు చాలామందికి హెచ్‌ఐవీ ఉన్నా.. బయటికు చెప్పడం లేదు. బంధువులకు తెలుస్తుందనే భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్నారు. వీరు చూసేందుకు అందంగా ఉన్నారు.. కదా! అని భావించి చాలా మంది ఏమీ ఆలోచించకుండా వీరితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు.  
  • రక్షణ కోసం కనీసం కండోమ్‌లను కూడా వాడటం లేదు. ప్రస్తుతం హెచ్‌ఐవీ కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అవగాహన ఉన్నా..  
జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది. కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్‌ వాడుతున్నారు. గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు. తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్‌ వాడుతున్నారు. సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది. త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్‌ వాడుతున్నారు. ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్‌ వాడుతున్నట్లు స్పష్టమైంది.  

    నిర్లక్ష్యం వల్లే హెచ్‌ఐవీ..  

  • అపరిచిత వ్యక్తులతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల హెచ్‌ఐవీ సోకుతుంది. 
  • ·గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు సోకే అవకాశం ఐదు శాతం ఉంది.  
  • ఎయిడ్స్‌కు స్వలింగ సంపర్కం కూడా ఒక కారణం. 
  • కలుషిత రక్తాన్ని ఇతరులకు ఎక్కించడం వల్ల కూడా సోకుతుంది. 
  • ఒకరికి వాడిన సిరంజ్‌లు, బ్లేడ్స్‌ మరొకరికి వాడటం వల్ల వస్తుంది. 
  • నిరంతరం జ్వరం, నీళ్ల విరేచనాలు, అకారణంగా బక్కచిక్కడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. 
  • జ్ఞాపకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. - డాక్టర్‌ ప్రసన్నకుమారి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ విభాగం అధికారిణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement