1+1 రగడ | 1 + 1 fights | Sakshi
Sakshi News home page

1+1 రగడ

Published Wed, Jan 14 2015 4:13 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

1+1 రగడ - Sakshi

1+1 రగడ

మురికివాడల్లో ముసలం జీ ప్లస్ వన్ నిర్మాణాల కోసం అధికారుల సర్వేవద్దంటూ ధర్నాలు.. రాస్తారోకోలు.. ఆందోళనలు కార్పొరేషన్‌కు సవాల్‌గా ఇళ్ల నిర్మాణం వన్ ప్లస్ వన్ వద్దు. పక్కాగా నిర్మించిన డాబాలను కూల్చకుండా ఇళ్ల పట్టాలు లేదా భూమిపై హక్కు కల్పించాలి.  రేకుల ఇళ్ల స్థానంలో ఇండిపెండెంట్ ఇల్లు నిర్మించాలి. వన్ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించినా అభ్యంతరం లేదు. భూసేకరణ, లేఅవుట్ పేరుతో డాబా ఇళ్లు, రేకుల ఇళ్లు కూల్చొద్దు. సీసీ రోడ్లు, డ్రెరుునేజీలు లేని చోట నిర్మించాలి.
 - గరీబ్‌నగర్ కాలనీవాసులు
 
 మురికివాడలు లేని నగరంగా  వరంగల్‌ను తీర్చిదిద్దుతాం..  నాలుగైదు నెలల్లో జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తాం. అందరూ సహకరించాలి. నగర జనాభా పెరుగుతోంది. భూమి పెరగడం లేదు. అందరూ గమనించాలి. ఎక్కడైనా జీ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దంటే బంద్ పెడ్తం.
 - ఆదివారం ప్రెస్‌మీట్‌లో సీఎం

సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరాన్ని మురికివాడలు లేని బస్తీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాన్ని అమల్లోకి తేవడం బల్దియా అధికారులకు సవాల్‌గా మారింది. ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలతో అడుగు ముందుకు పడటం లేదు. నాలుగు నెలల్లో నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

వన్ ప్లస్ వన్ వద్దనే నిరనసన మధ్య అధికారులు ఎలా ముందుకు సాగుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివాదంలో జీ ప్లస్ వన్‌వరంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరపాలక సంస్థ పరిధిలోని ఆరు కాలనీల్లో జీ ప్లస్‌వన్(ప్రస్తుతం స్థలంలో ఉన్న వారు కింద.. అర్హులైన మరో కుటుంబం మొదటి అంతస్తులో) పద్ధతిలో మొత్తం 3,957 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీని వల్ల 7,916 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.

అదేవిధంగా ప్రతీ కాలనీలో డ్రెరుునేజీలు, మంచినీటి పైపులైన్లు, 30 అడుగుల అప్రోచ్ రోడ్లు, 20 అడుగుల అంతర్గత రోడ్లు, 334 చదరపు అడుగుల పార్కు స్థలం, అంగన్‌వాడీ సెంటర్, కమ్యూనిటీ హాల్, అర్బన్ హెల్త్ సెంటర్ తదితర అవసరాలకు వీలుగా స్థలం ఉండే విధంగా లే అవుట్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. లక్ష్మీపురం, శాకరాసికుంట, అంబేద్కర్‌నగర్,  జితేందర్‌నగర్, ప్రగతినగర్, దీన్‌దయాళ్‌నగర్‌లలో పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది.

మలివిడతలో భాగంగా ఎస్‌ఆర్ నగర్, గరీబ్‌నగర్, గాంధీనగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీల్లో లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఉచితంగా సకల సౌకర్యాలతో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నా, లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సానుకూలత వ్యక్తం కావడం లేదు. పైగా ఇళ్లు నిర్మాణం అవసర ం లేదంటూ ధర్నాలకు దిగుతున్నారు. జీ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దు, మా ఇళ్లపై యాజమాన్య హక్కు కల్పించి, మంచినీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తే చాలు అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
 
ఉన్నది పోతుందేమో..
ప్రస్తుతం ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిన మురికివాడల్లో అంబేద్కర్, జితేందర్‌నగర్‌లను మినహాయిస్తే మిగిలి ప్రాంతాల్లో కొందరు డాబా ఇళ్లు, రేకుల ఇళ్లు నిర్మించుకున్నారు. తమ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు సంబంధించిన లే అవుట్‌లో రోడ్లు, డ్రెరుునేజీల వల్ల తమ ఇళ్లు పోతాయోమోననే ఆందోళన వారిలో నెలకొంది. దానితో జీ ప్లస్ వన్ నిర్మాణాలను వ్యతిరేకిస్తున్నారు.

కొత్తగా ఇళ్లు నిర్మించి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తాము ఉంటున్న ఇంటి జాగాను క్రమబద్ధీకరిస్తే చాలంటున్నారు. లేదంటే తమ ఇళ్లను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ముఖ్యంగా దీన్‌దయాళ్‌నగర్, గరీబ్‌నగర్ ప్రాంతాల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉండగా లక్ష్మీపురంలో కూడా ఇలాగే ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement