ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీకి అధికారమిస్తే మురికివాడలన్నిటినీ ధ్వంసం చేస్తుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడల నివాసితుల సంక్షేమం కంటే కూడా అక్కడి భూములపైనే బీజేపీ దృష్టి ఉందన్నారు. ఆదివారం కేజ్రీవాల్ షకూర్ బస్తీలో మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు మొదటగా మిమ్మల్ని ఓట్లడుగుతారు. ఎన్నికలయ్యాక మీ భూములివ్వమంటారు’అని బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
బస్తీల్లోని వారి సమస్యలను పక్కనబెట్టి, వారి భూమిని ఆక్రమించుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. చేతనైతే వలస జీవులపైనా, మురికివాడల్లో ఉండే వారిపైనా నమోదైన కేసులన్నిటినీ ఎత్తేసి, వారికి మరో చోట పునరావాసం కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. 24 గంటల్లో వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు.
ఇందులో బీజేపీ విఫలమైతే, ఈ ఎన్నికల్లో పోటీ చేసి మురికివాడల ప్రజలకు రక్షణగా నిలుస్తానని, వారి బస్తీలను ఎవరు నాశనం చేస్తారో చూస్తానని హెచ్చరించారు. మురికివాడల్లో వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న బీజేపీ నినాదం కేవలం కంటితుడుపు చర్యమాత్రమేనన్నారు. ‘ఢిల్లీలో 4 లక్షల మురికివాడలుండగా గడిచిన పదేళ్లలో కేంద్రం కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించింది. ఈ రకంగా చూస్తే ఢిల్లీలోని మురికివాడల ప్రజలందరికీ గృహ వసతి కల్పించేందుకు మరో వెయ్యేళ్లు పడుతుంది’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment