Shakur Basti area
-
బీజేపీకి అధికారమిస్తే మురికి వాడలు నాశనమే
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీకి అధికారమిస్తే మురికివాడలన్నిటినీ ధ్వంసం చేస్తుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడల నివాసితుల సంక్షేమం కంటే కూడా అక్కడి భూములపైనే బీజేపీ దృష్టి ఉందన్నారు. ఆదివారం కేజ్రీవాల్ షకూర్ బస్తీలో మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు మొదటగా మిమ్మల్ని ఓట్లడుగుతారు. ఎన్నికలయ్యాక మీ భూములివ్వమంటారు’అని బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బస్తీల్లోని వారి సమస్యలను పక్కనబెట్టి, వారి భూమిని ఆక్రమించుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. చేతనైతే వలస జీవులపైనా, మురికివాడల్లో ఉండే వారిపైనా నమోదైన కేసులన్నిటినీ ఎత్తేసి, వారికి మరో చోట పునరావాసం కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. 24 గంటల్లో వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు. ఇందులో బీజేపీ విఫలమైతే, ఈ ఎన్నికల్లో పోటీ చేసి మురికివాడల ప్రజలకు రక్షణగా నిలుస్తానని, వారి బస్తీలను ఎవరు నాశనం చేస్తారో చూస్తానని హెచ్చరించారు. మురికివాడల్లో వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న బీజేపీ నినాదం కేవలం కంటితుడుపు చర్యమాత్రమేనన్నారు. ‘ఢిల్లీలో 4 లక్షల మురికివాడలుండగా గడిచిన పదేళ్లలో కేంద్రం కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించింది. ఈ రకంగా చూస్తే ఢిల్లీలోని మురికివాడల ప్రజలందరికీ గృహ వసతి కల్పించేందుకు మరో వెయ్యేళ్లు పడుతుంది’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. -
'కాస్త పెద్దమనసు చూపితే నా బిడ్డ బతికేది'
న్యూఢిల్లీ: మహమ్మద్ అన్వర్.. పశ్చిమ ఢిల్లీలోని శకూర్ బస్తీలో ఓ గుడిసె వేసుకుని జీవితాన్ని ముందుకు నెడుతున్న నిరుపేద. ఒళ్లు అలసిపోయేలా పనిచేసుకొని వచ్చినా కళ్లముందు కాసేపు సంతోషం. ఎందుకంటే తన చిన్న గుడిసెలో కొండంత సంతోషాన్నిచ్చే ఆరు నెలల కూతురు బోసినవ్వులు ఉండేవి. కానీ, ఇప్పుడు అన్నీ మాయం అయ్యాయి. ఆ బస్తీలోని పన్నెండు వందల కుటుంబాలకు ఒకే కష్టమైతే.. అన్వర్ కు రెండు కష్టాలు. ఒకటి భర్తీ చేయగలిగేది కాగా, మరొకటి ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేనిది. రైల్వే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం అప్పుడప్పుడు తనను పలకరించే సంతోషాన్ని కూడా దూరం చేసింది. ఉన్నపలంగా గుడిసెలు ఖాళీ చేయాలని ఆదేశాలిస్తూనే బుల్డోజర్లతో వచ్చి వారి గుడిసెలను కూల్చడంతో బట్టలుమీదపడి అందులోని తమ ఆరు నెలల చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో వారికుటుంబం మిగితా వారికంటే తీరని విషాదంలోకి కూరుకుపోయింది. తన కూతురు చనిపోయినప్పటి నుంచి తల్లి ఇంకా స్పృహలోకి రాకుండా పోయిందంటే ఆ పాప మరణం వారిని ఎంతటి దిగ్భ్రాంతికి గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు. 'గుడిసెలు ఖాళీ చేయాలని చెప్పిన అధికారులు కాస్తంత సమయం ఇస్తే బాగుండేది. పెద్ద మనసుతో వ్యవహరించి ఉంటే ఈ విషాదం ఉండేది కాదు. ఇంట్లో అందరం తమ సామానంత సర్దుకుంటున్నాం. ఈ లోగా బుల్డోజర్లు గుడిసెలను నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలో ఉన్న మా చిన్నారి ప్రాణాలు పోయాయి. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్న నా చిన్నారి అధికారులు కాస్తంత జాలిగా వ్యవహరించి ఉంటే నా చేతుల్లో బతికుండేది' అంటూ అన్వర్ వాపోయాడు. అన్వర్ కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకపాపకు ఐదేళ్లు, బాబుకు మూడేళ్లు ఉన్నాయి. -
'బుల్డోజర్లు వస్తే నన్ను పిలవండి..'
న్యూఢిల్లీ: 'బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు ఎప్పుడు వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయండి. క్షణాల్లో మీ ముందు ఉంటాను. మీ యుద్ధంలో మీతోపాటు సాగివస్తాను' అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైల్వే అధికారులు ధ్వంసం చేసిన బడుగుల గుడిసెల ప్రాంతం శకూర్ బస్తీని ఆయన సందర్శించారు. గుడిసెలను అధికారులు కూల్చడం వల్లే చిన్నారి చనిపోయిందని, దీనికి పూర్తిగా ఆమ్ఆద్మీపార్టీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 'మురికి వాడల్లోని గుడిసెలను ధ్వంసం చేసేందుకు ఎవరు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీని పిలవండి. అతడు ఇలాంటిది జరగనివ్వడు. మేం మీకు సహాయం చేస్తాం. మీకు తెలుసు మేం ప్రభుత్వంలో లేము. ఇది ఆప్, బీజేపీ ప్రభుత్వం. కానీ మేం మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తాం. మీరు చేసే పోరాటంలో తోడుగా ఉంటాము. ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం' అని రాహుల్ అన్నారు. ఇది ముమ్మాటికి మోదీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం బాధ్యత మాత్రమే అని చెప్పారు. అయినా, ఆ విషయాన్ని అంగీకరించకుండా ఒకరిపై ఒకరు పరస్పర నిందలు వేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆదివారం రైల్వే అధికారులు ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లోని గుడిసెలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలుకోల్పోయింది.