'కాస్త పెద్దమనసు చూపితే నా బిడ్డ బతికేది'
న్యూఢిల్లీ: మహమ్మద్ అన్వర్.. పశ్చిమ ఢిల్లీలోని శకూర్ బస్తీలో ఓ గుడిసె వేసుకుని జీవితాన్ని ముందుకు నెడుతున్న నిరుపేద. ఒళ్లు అలసిపోయేలా పనిచేసుకొని వచ్చినా కళ్లముందు కాసేపు సంతోషం. ఎందుకంటే తన చిన్న గుడిసెలో కొండంత సంతోషాన్నిచ్చే ఆరు నెలల కూతురు బోసినవ్వులు ఉండేవి. కానీ, ఇప్పుడు అన్నీ మాయం అయ్యాయి. ఆ బస్తీలోని పన్నెండు వందల కుటుంబాలకు ఒకే కష్టమైతే.. అన్వర్ కు రెండు కష్టాలు. ఒకటి భర్తీ చేయగలిగేది కాగా, మరొకటి ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేనిది.
రైల్వే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం అప్పుడప్పుడు తనను పలకరించే సంతోషాన్ని కూడా దూరం చేసింది. ఉన్నపలంగా గుడిసెలు ఖాళీ చేయాలని ఆదేశాలిస్తూనే బుల్డోజర్లతో వచ్చి వారి గుడిసెలను కూల్చడంతో బట్టలుమీదపడి అందులోని తమ ఆరు నెలల చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోయింది. దీంతో వారికుటుంబం మిగితా వారికంటే తీరని విషాదంలోకి కూరుకుపోయింది. తన కూతురు చనిపోయినప్పటి నుంచి తల్లి ఇంకా స్పృహలోకి రాకుండా పోయిందంటే ఆ పాప మరణం వారిని ఎంతటి దిగ్భ్రాంతికి గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
'గుడిసెలు ఖాళీ చేయాలని చెప్పిన అధికారులు కాస్తంత సమయం ఇస్తే బాగుండేది. పెద్ద మనసుతో వ్యవహరించి ఉంటే ఈ విషాదం ఉండేది కాదు. ఇంట్లో అందరం తమ సామానంత సర్దుకుంటున్నాం. ఈ లోగా బుల్డోజర్లు గుడిసెలను నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలో ఉన్న మా చిన్నారి ప్రాణాలు పోయాయి. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్న నా చిన్నారి అధికారులు కాస్తంత జాలిగా వ్యవహరించి ఉంటే నా చేతుల్లో బతికుండేది' అంటూ అన్వర్ వాపోయాడు. అన్వర్ కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకపాపకు ఐదేళ్లు, బాబుకు మూడేళ్లు ఉన్నాయి.