'బుల్డోజర్లు వస్తే నన్ను పిలవండి..'
న్యూఢిల్లీ: 'బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు ఎప్పుడు వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయండి. క్షణాల్లో మీ ముందు ఉంటాను. మీ యుద్ధంలో మీతోపాటు సాగివస్తాను' అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రైల్వే అధికారులు ధ్వంసం చేసిన బడుగుల గుడిసెల ప్రాంతం శకూర్ బస్తీని ఆయన సందర్శించారు. గుడిసెలను అధికారులు కూల్చడం వల్లే చిన్నారి చనిపోయిందని, దీనికి పూర్తిగా ఆమ్ఆద్మీపార్టీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
'మురికి వాడల్లోని గుడిసెలను ధ్వంసం చేసేందుకు ఎవరు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీని పిలవండి. అతడు ఇలాంటిది జరగనివ్వడు. మేం మీకు సహాయం చేస్తాం. మీకు తెలుసు మేం ప్రభుత్వంలో లేము. ఇది ఆప్, బీజేపీ ప్రభుత్వం. కానీ మేం మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తాం. మీరు చేసే పోరాటంలో తోడుగా ఉంటాము. ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తుతాం' అని రాహుల్ అన్నారు. ఇది ముమ్మాటికి మోదీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం బాధ్యత మాత్రమే అని చెప్పారు. అయినా, ఆ విషయాన్ని అంగీకరించకుండా ఒకరిపై ఒకరు పరస్పర నిందలు వేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆదివారం రైల్వే అధికారులు ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లోని గుడిసెలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలుకోల్పోయింది.