న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.
మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్‌ను నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment