పేదబస్తీలకు ఫిల్టర్ వాటర్
-
4 రూపాయలకే 20 లీటర్లు..
-
400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు యోచన..
-
తొలి దశలో 60 కేంద్రాలు
-
త్వరలో ప్రారంభించనున్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, హైదరాబాద్: గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్న నగరంలోని పేదబస్తీ వాసులకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. పేదల కోసం ఇప్పటికే రూ. 5కే భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న జీహెచ్‌ఎంసీ.. త్వరలోనే రూ. 4కే 20 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే ఏర్పాట్లు చేస్తోంది. 400 నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు యోచన ఉన్నప్పటికీ తొలిదశలో 60 ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సర్కిళ్ల వారీగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న బస్తీలు/కాలనీలను గుర్తించారు. ఈ బస్తీల్లో ఆర్‌ఓ ప్లాంట్లను జీహెచ్‌ఎంసీయే ఏర్పాటు చేస్తుంది. స్థానిక స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు కొద్దిరోజుల శిక్షణనిచ్చి.. అనంతరం నిర్వహణ బాధ్యతను వాటికే అప్పగిస్తుంది. ఖర్చులు పోను మిగిలే ఆదాయం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు అందుతుంది. బస్తీలకు స్వచ్ఛమైన నీటి సదుపాయంతోపాటు ఎస్‌హెచ్‌జీలతో ఎంతోకొంత ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు.
గ్రేటర్‌లో 1,476 మురికివాడలు ఉండగా, వీటిల్లో చాలా బస్తీలకు కనీస నీటి సదుపాయం లేదు. శివారు మునిసిపాలిటీల్లోని కాలనీల్లోనూ అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించేందుకు ఉద్దేశించిన ‘టిప్’ పథకం అటకెక్కింది. ఇలాంటి కాలనీలు 900 పై చిలుకు ఉన్నాయి. దాదాపు 40 లక్షల మంది జనాభాకు అవసరమైన తాగునీరు లేదు. తొలిదశలో మురికివాడలపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పేదలకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కోసం రూ. 20 కోట్లు కేటాయించింది.
ఈ నిధులతో ఆయా బస్తీల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. భూగర్భ జలాలు అధికంగా ఉన్న చోట పవర్‌బోర్లు వేస్తారు. సమీపంలోని కమ్యూనిటీ హాలు.. లేదా జీహెచ్‌ఎంసీ లేదా ఇతర ప్రభుత్వ భవనంలో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఇలా తొలిదశలో 60 ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకుగాను 62 బస్తీలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. నిరంతర నీటి సర ఫరాకు అక్కడ వీలుందా లేదా అనే సాంకేతికాంశాల్ని ఇంజినీరింగ్ విభాగం అధికారులు తనిఖీ చేస్తున్నారు. నివేదిక రాగానే నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. శుద్ధి చేసిన నీటిని 20 లీటర్ల క్యాన్‌ను రూ. 4 కే అందజేస్తారు. ప్లాంట్ వద్దకు వెళ్లేవారికి ఈ ధర వర్తిస్తుంది. శివారు ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించారు. పైపులైన్ల ద్వారా శాశ్వత నీటి సదుపాయం సమకూరేంత వరకు అక్కడ కూడా ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఆలోచనలున్నాయి.