ఎడమనుండి కుడికి థామస్ మార్షల్, డొనాల్డ్ మాకార్థర్, జేమ్స్ డ్యుకాట్
Flannan Isles Lighthouse Keepers Mystery Real Story: కొన్ని రక్కసి క్షణాలు.. కొందరి జీవితాలను ఇట్టే తలకిందులు చేస్తాయి. నామరూపాలు లేకుండా తలరాతలను మార్చేస్తాయి. ఆనవాళ్లను సైతం మాయం చేస్తాయి. చరిత్ర జాడల్లో మిస్టరీలుగా మిగుల్చుతాయి. అలాంటిదే ఈ ‘లైట్‌హౌస్ కీపర్స్’ స్టోరీ.ఊహకు అందని ప్రతీది అతీంద్రియ శక్తుల చర్యే అంటారు చాలా మంది. ఊహించగలిగినంత మేర ఇదే నిజమని వాదిస్తుంటారు ఇంకొంతమంది. ఈ కథలో ఇలాంటివారి అభిప్రాయలు ఎన్నో ఉన్నాయి కానీ.. నిర్ధారించే ఆధారాలే లేవు. అందుకే నేటికీ ఇది అత్యంత ఆసక్తికరమైన కథనమైంది.
స్కాట్లాండ్‌కి పడమర తీరాల్లో.. మనుషులు జీవించడానికి వీలు లేని కొన్ని భయంకరమైన దీవులున్నాయి. వాటిని ఫ్లానెన్‌ఐజిల్స్ అంటారు. 18వ శతాబ్దంలో స్కాట్లాండ్‌కి సుమారు 379 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుటర్ హెబ్రిడ్స్‌లోని ఏడు ద్వీపాల(సెవెన్ హంటర్స్)లో గడ్డి అధికంగా మొలిచేది. ఆ గడ్డిలో ఏదో మ్యాజిక్ ఉందని, దాన్ని గొర్రెలు తింటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాయని.. కవల గొర్రె పిల్లలు పుడతాయని స్థానికులు నమ్మేవారు. అందుకే అక్కడి గొర్రెల కాపర్లు.. ఆ ప్రాంతం ప్రమాదకరమని తెలిసినా.. తమ గొర్రెలను పడవల్లో ఆ దీవులకు తీసుకెళ్లి.. రోజంతా మేయించి, సాయంత్రానికల్లా తిరుగుప్రయాణం అయ్యేవారు. ఏ కారణం చేతైనా రాత్రి అక్కడే ఉండాల్సి వస్తే మాత్రం.. వెన్నులో వణుకు పుట్టించే సంఘటనలే ఎదురయ్యేవని, ఎవరో తరుముతున్నట్లు, ఎవరో గమనిస్తున్నట్లు ఉంటోందనేది అప్పటి అనుభవజ్ఞుల మాట.
1896లో సెవెన్ హంటర్స్‌లో ఒకటైన ఐలియన్ మోర్‌లో అత్యవసరంగా.. ఎందరు వద్దని వాదించినా వినకుండా 300 మీటర్లు ఎత్తు గల లైట్‌హౌస్ నిర్మాణం మొదలుపెట్టారు. 1899లో దీని నిర్మాణం పూర్తయి.. ఆ ఏడాది డిసెంబర్ కల్లా తొలిసారి వెలిగింది. ఈ లైట్ హౌస్‌కి కాపలాగా నలుగురు కీపర్స్‌ని నియమించారు. ఎల్లప్పుడూ అక్కడ ముగ్గురు కీపర్స్ ఉండేలా.. వారిలో ప్రతి ఒక్కరికీ 6 వారాలు వర్కింగ్ డేస్, 2 వారాలు సెలవులు ఉండేలా డ్యూటీ చార్ట్ సిద్ధమైంది. వండుకునేందుకు వంటగది, రెస్ట్ తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. ఏ అవాంతరాలు లేకుండా ఏడాది గడిచింది.
సరిగ్గా ఏడాదికి..
1900 డిసెంబర్‌లో.. హెస్పెరస్ అనే బోట్ ఐలియన్‌మోర్ ద్వీపం వైపు లైట్ హౌస్‌కి బయలుదేరింది. అయితే వాతావరణ పరిస్థితుల అనుకూలించక బోట్ చాలా ఆలస్యంగా నడిచింది. సముద్రం మధ్యలో ఉండగానే ఆ బోట్ కెప్టెన్ జేమ్స్ హార్వేకి గానీ.. అతడి సిబ్బందికి గానీ లైట్ హౌస్ పైన లైట్ కనిపించలేదు. బోట్ ఐలాండ్‌కి చేరువ అవుతున్నకొద్ది.. లైట్ హౌస్ లైటే కాదు.. దాని మీద ఎగిరే స్కాట్లాండ్ జెండా కూడా కనిపించలేదు. దాంతో హారన్స్ మోగించి అక్కడ కీపర్స్‌ని అలర్ట్ చెయ్యాలనుకున్నారు. కావాలనే పలుమార్లు బోట్ హారన్స్ మోగించడం మొదలుపెట్టారు. ఎన్ని హారన్స్ కొట్టినా ఐలాండ్ నుంచి స్పందన రాలేదు. దాంతో హార్వే టీమ్.. హెచ్చరిక మాదిరి సిగ్నల్స్ ఇస్తూ.. గాల్లోక్కి కొన్ని తారాజువ్వలను ఎగరేశారు. అయినా అటు నుంచి నో రిప్లై.
తీరా డిసెంబర్ 26 సాయంత్రానికి హెస్పెరస్ బోట్.. లైట్ హౌస్ దగ్గరకు చేరుకుంది. అక్కడంతా సాధారణంగానే ప్రశాంతమైన వాతావరణమే ఉంది. కానీ ఏదో తెలియని నిర్మానుష్య శ్మశాన నిశబ్దం అలముకుంది. మెయిన్ గేట్, మెయిన్ డోర్, లోపలి గదులు అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఒక్క కీపర్ కూడా కనిపించ లేదు. వంట గది మాత్రమే తెరుచుకునుంది. అందులోని పొయ్యి చూస్తే గత కొన్ని రోజులుగా దాన్ని వాడలేదని అర్థమవుతోంది. పైగా అక్కడున్న గడియారాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన ముగ్గురూ ఏమయ్యారో తెలియలేదు. దాంతో అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మాయమైన ముగ్గురిలో 20 ఏళ్ల అనుభవమున్న ప్రిన్సిపల్ కీపర్ జేమ్స్ డ్యుకాట్(43), అకేషనల్ కీపర్ డొనాల్డ్ మాకార్థర్ (40) సెకండ్ అసిస్టెంట్ కీపర్ థామస్ మార్షల్(28) ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరూ వివాహితులే. నేటికి 121 ఏళ్లు గడిచినా ఆ ముగ్గురూ ఏమయ్యారనేది తెలియలేదు. నాలుగో కీపర్ జోసఫ్ మోర్ సెలవులో ఉండటం వల్లే బాధితుల లిస్ట్‌లో అతడి పేరు చేరలేదు.
అధికారులు, పోలీసులు ఏకమై వెతికినా ఏ ఒక్క ఆధారమూ దొరకలేదు. ఐలాండ్‌కి పడమర వైపు బోట్ లాండ్ అయ్యే చోటు డ్యామేజ్ అయ్యి ఉంది. మోరింగ్ రోప్స్ తెగిపోయి ఉన్నాయి. టాకిల్ బాక్స్ మిస్ అయ్యింది. ఐరన్ రెయిలింగ్స్ విరిగిపోయి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ప్రొఫిలింగ్ బోయ్ సమీపంలోనే ఉంది. అయితే అది పక్కకు ఒరిగిన తీరుని గమనిస్తే సముద్రమే తన దారిని మార్చుకుందనిపించింది. ఎందుకంటే దాన్ని కదిలించడం మనుషుల తరం కాదు. ఈ పాయింట్స్ అన్నీ విచారణలో భాగంగా ఫైల్ అయ్యాయి. కానీ ఫలితం లేదు.
ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఒక కోటు దొరికింది. అది తన సహోద్యోగి డొనాల్డ్ వాడే కోటేనని నాలుగో కీపర్ జోసఫ్ మోర్ గుర్తించాడు. అయితే డిసెంబర్ నెలలో కోటు తీసేసి ఉండటం అసాధ్యం. మరి డొనాల్డ్ దాన్ని ఎందుకు ధరించలేదనేది మరో చిక్కుప్రశ్నగా మారింది. డిసెంబర్ 12న లైట్‌హౌస్ లాగ్‌బుక్‌లో మార్షల్.. ‘నేను మునుపెన్నడు చూడని విధంగా గాలులు వీస్తున్నాయని, డ్యుకాట్ మౌనంగా ఉన్నాడు కానీ.. మాకార్థర్ ఏడుస్తున్నాడు. ఇంత అనుభవజ్ఞుడైన మాకార్థర్ బేలగా మారిపోయాడు’ అని రాశాడు. విచిత్రమేమిటంటే.. 12, 13, 14 తేదీల్లో ఎలాంటి నివేదికా లేదు కానీ.. డిసెంబర్ 15న ‘తుఫాను ముగిసింది, సముద్రం ప్రశాంతంగా ఉంది, గాడ్ ఈజ్ ఓవర్ ఆల్’ అని రాసి ఉంది.
ఆ తర్వాత ఏమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. దాంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ ముగ్గురూ మాయం కావడానికి కారణం అక్కడున్న అతీంద్రియశక్తులే అని కొందరు.. సముద్ర జీవుల పని అని మరికొందరు భావించారు. అయితే ముగ్గురిలో ఒకరికి పిచ్చి పటì ్ట మిగిలిన ఇద్దరినీ చంపి, సముద్రంలో పడేసి.. తనూ దూకేశాడంటూ ఓ కథ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. బహుశా ఇది విదేశీ గూఢాచారుల పని అయ్యుండొచ్చని, లేదంటే ఏలియన్స్ వచ్చి ఆ ముగ్గురినీ తీసుకుని వెళ్లి ఉంటారని వదంతులు వ్యాపించాయి.
అయితే.. నార్తన్ లైట్స్‌కి చెందిన సూపరింటెండెంట్ ఆఫ్ కమిషన్ రాబర్ట్ ముయిర్‌హెడ్ రాసిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం.. ‘డిసెంబర్ 15 మధ్యాహ్నం ఆ ముగ్గురూ వెస్ట్ ల్యాండింగ్ సమీపంలోని మూరింగ్ రోప్స్ భద్రపరడానికి వెళ్లి ఉంటారని.. ఆ సమయంలో అనుకోకుండా పెద్ద కెరటం వచ్చి ముగ్గురినీ ఒకేసారి కొట్టుకునిపోయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
1950లో ఓ చరిత్రకారుడు మైక్ డాష్.. ఈ ఐలాండ్ సముద్రమట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి.. అంతకు మించిన ఎత్తులో సముద్ర కెరటాలు ఎగసిపడి ఉంటాయనేందుకు.. పలు ఆధారాలు కనుగొన్నాడు. అదే జరిగితే మనుషులు కొట్టుకుపోవడం ఖాయమని భావించాడు. ఆ అంచనా ప్రకారం ఆ ముగ్గురూ మాయమయ్యారనేది అతడి వాదన. మొత్తానికి ఆ ముగ్గరూ ఏమయ్యారనేది మాత్రం ప్రపంచానికి తెలియకుండా ముగిసిన కథ. కానీ ఇక్కడే ఉంది ఓ ట్విస్ట్, ఘటన జరిగిన ఏడాదికి అక్కడ డ్యూటీలో ఉన్న కీపర్స్‌కి.. అదృశ్యమైన వారి పేర్లు పిలుస్తూ ఎవరో కేకలు వేస్తున్న ధ్వనులు వినిపించాయట. అది నిజమా, కల్పితమా అనేది మరో మిస్టరీ.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment