హైదరాబాద్: ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో అన్ని దేశాలు అంతరిక్ష పరిశోధనలపైన దృష్టి సారించాయి. భారత్ కూడా ఇస్రో ఆధ్వర్యంలో ఇప్పటికే చంద్రయాన్ వంటి ప్రాజెక్టులను చేపట్టింది. త్వరలో ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ను అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నంలో ఉంది. 40 ఏళ్ల క్రితమే భారత్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్షంలో మొదటిసారిగా కాలుమోపారు. సోవియట్ ఇంటర్ కాస్మోస్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1984లో అంతరిక్షం చేరిన మొదటి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ చరిత్ర సృష్టించారు.
హైదరాబాద్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి, నిజాం కళాశాల నుంచి పట్టభద్రులైన రాకేష్ శర్మ అనంతరం స్పేస్ రీసెర్చ్‌లో తన ప్రాతినిధ్యాన్ని పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 106వ స్థాపకదినోత్సవం సందర్భంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పట్లో అంతరిక్షం నుంచి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడినప్పుడు.. అక్కడినుంచి భారత్ ఎలా కనిపిస్తోందని ఆమె అడిగితే.. ‘సారే జహాసే అచ్ఛా..’అని చెప్పానంటూ ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. అంతరిక్ష యానానికి సంబంధించి రాకేష్‌శర్మ తెలిపిన ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే..
వనరులు, ప్రత్యామ్నాయ వేదికల అన్వేషణ దిశగా..
భారత్‌లో 40 ఏళ్ల క్రితం ఉన్న సాంకేతికతకు, ప్రస్తుత అధునాతన టెక్నాలజీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ప్రపంచ దేశాలకు పోటీగా మారింది. స్పేస్ టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెంది సొంతగా ఎన్నో విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో ఇస్రో కీలకపాత్ర పోషిస్తోంది. రానున్న ఏడాదిలో ప్రతిష్టాత్మకమైన గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు నేను నేషనల్ అడ్వైజరీగా ఉండి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నా.
గట్టి పునాదులు వేశారు..
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి విక్రమ్ సారాభాయ్ వంటి పరిశోధకులు గట్టి పునాది వేశారు. దానిని విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే వనరులను అన్వేషించనున్నాయి. భూమిపై పర్యావరణం క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ వేదికలను సైతం వెతకనున్నాయి. చంద్రుడిపై మనిషి మనుగడ సాధ్యమే కానీ అది సాకారం కావాలంటే ఎంతో పురోగమించాలి.
అవకాశాల్ని యువత అందిపుచ్చుకోవాలి..
అంతరిక్షంలో నేను యోగా చేస్తుంటే దీని ఫలితాలు గమనించి ఒకరిద్దరు తోటి వ్యోమగాములు కొన్ని ఆసనాలను అడిగి మరీ ప్రయత్నించారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములకు సెంట్రిఫ్యూజ్ ఆధారిత శిక్షణ ఇస్తున్నారు. అంతరిక్షం నుంచి భారత్ మిశ్రమ వర్ణాల్లో అద్భుతంగా కనిపిస్తుంది. రాజస్థాన్ బంగారు వర్ణంలో, హిమాలయాలు ఊదా రంగులో కనిపిస్తాయి. వ్యోమనౌక కిటికీ నుంచి భూమిని చూడటం మరిచిపోలేని అనుభూతి. మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఓయూలో వనరులు అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
అంతరిక్షంలో యోగా చేశా..
అంతరిక్షంలో ప్రయాణించాలంటే ముందే కఠినమైన శిక్షణ తీసుకోవాలి. అంతరిక్ష నౌక ప్రయాణ వేగం భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ప్రతి సెకనుకు సున్నా నుంచి ఏడున్నర కిలోమీటర్లు పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. గుండె నుంచి వివిధ అవయవాలకు రక్తం సరఫరాపైనా ప్రభావం పడుతుంది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఇవన్నీ తట్టుకోవడానికి వీలుగా సాధారణ స్థాయి కన్నా నాలుగు రెట్ల వేగంతో రక్త ప్రసరణ జరిగేలా శిక్షణ ఉంటుంది. ఇందుకోసం నేను యోగా సాధన కూడా చేశా.
రాకేష్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment